
ప్రియురాలిని దూరం చేశారని..
ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : పెద్దలను ఎదిరించి ప్రియురాలిని పెళ్లి చేసుకుంటే, కేసు పెడతామని బెదిరించి, స్టేషన్‌కు పిలిపించి తమను విడదీశారని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. నీరుగట్టువారిపల్లె యోగివేమన వీధికి చెందిన కొండారెడ్డి, సావిత్రమ్మల దంపతుల కుమారుడు బయ్యారెడ్డి (21) ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివే సమయంలో కొండామారిపల్లెకు చెందిన భవిత (21)ను ప్రేమించాడు. నాలుగేళ్లుగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈనెల 7వతేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి కాణిపాకంలో వివాహం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలో భవిత తల్లిదండ్రులు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారిని 9వతేదీన మదనపల్లె పోలీసు స్టేషన్‌కు రప్పించారు. ఇరువురు మేజర్లు కావడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం భవిత తాను ఏడాది పాటు తల్లిదండ్రులతోనే ఉంటానని, బయ్యా రెడ్డి ప్రవర్తనలో మార్పువస్తే తల్లిదండ్రులను ఒప్పించి కాపురానికి వెళ్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి తల్లిదండ్రులతో వెళ్లింది. ఈ క్రమంలో ప్రియురాలు దూరమైందన్న మనస్థాపంతో బయ్యారెడ్డి మంగళవారం విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బయ్యారెడ్డి, అతని తండ్రి కొండారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్ ముందు వరకు తనతో ఉంటానన్న భవిత కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులతో పాటు వెళ్లటంలో పోలీసులు కీలకంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై సీఐ కళా వెంకటరమణను వివరణ కోరగా ప్రేమ వివాహం చేసుకున్న బయ్యారెడ్డి, భవితలకు స్టేషన్‌లో కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చామని, భవిత రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చి తల్లిదండ్రులతో వెళ్లిందన్నారు.