
హర్ ఘర్ తిరంగాలో అందరూ పాల్గొనాలి
రాయచోటి: ప్రతి పౌరుడు జాతీయ సమగ్రత, ఐక్యత చాటుకునేలా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం రాయచోటిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు జిల్లా పర్యాటక శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్, మండల కేంద్రాల్లో హర్‌ఘర్ తిరంగాను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపడానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ రాధమ్మ, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, జిల్లా పర్యాటక శాఖ నాగభూషణం, జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం
ఘనంగా నిర్వహించాలి
పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో కనుల పండువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సూచించారు. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, వేదికను అందంగా అలంకరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అభివృద్ధి పథకాల కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ఆయా శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఏఎస్పీ వెంకటాద్రి, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్