
రైలు కింద పడి ఆత్మహత్య
కడప కోటిరెడ్డిసర్కిల్ : కమలాపురం మండలం సి.రాజుపాలెం గ్రామానికి చెందిన కామనూరు నాగరాజు (35) అప్పుల బాధ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నాగరాజు భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. మద్యానికి అలవాటుపడిన నాగరాజు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తనకు ఆరోగ్యం సరిగా లేదని పందిళ్లపల్లెలో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స చేయించుకుని వస్తానని తన తల్లికి చెప్పి కమలాపురం–ఎర్రగుడిపాడు మధ్యన దిగువ రైలు పట్టాలపై రైలు కింద పడి మృతి చెందాడు. 0701 నెంబరుగల రైలు లోకో పైలట్ ె వెంకటేశ్వర్లు గమనించి ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్వర్ణ దుకాణంలో చోరీ
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో గల జె.బి. స్వర్ణ దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 72 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 కిలోల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలోని మార్కెట్‌వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో గత కొన్నేళ్లుగా స్వర్ణ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరే శనివారం కూడా వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఫోన్ రావడంతో దుకాణంలో ఉండే పిల్లలను చూస్తూ ఉండమని చెప్పి దుకాణం నుండి బయటికి వచ్చాడు. అప్పటికే కాపు కాసిన ఇద్దరు యువకులు దుకాణంలోకి వెళ్లి బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్‌లో పరారయ్యారు. వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తమై గట్టిగా కేకలు వేస్తూ వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దుకాణ యజమాని అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టణంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఆరా..
వైఎస్సార్‌సీపీ నాయకుడైన జబీవుల్లాకు చెందిన స్వర్ణ దుకాణంలో చోరీ జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులతో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు.

రైలు కింద పడి ఆత్మహత్య