ఆరోగ్యానికి పొగబెడుతుంది
రాజంపేట టౌన్ : పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం చేకూర్చుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో పాటు గుండె జబ్బులు, పలు రకాల కేన్సర్‌లు, పక్షవాతం వంటి సమస్యలు పొగతాగే వారిలో ఎక్కువగా వస్తాయి. ఈ విషయాలను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. అందులో భాగంగా 1988వ సంవత్సరం నుంచి పొగాకు వల్ల కలిగే అనర్దాలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
పొగాకును ఏ రూపంలో సేవించినా ప్రమాదమే..
పొగ పగ సాధిస్తుంది. సరదా..సరదా సిగరెట్టు అనారోగ్యానికి తొలిమెట్టులా మారిపోతుంది. ఎంత ఒత్తిడి నుంచైనా సిగిరెట్, బీడీ ఉపశమనం కలిగిస్తాయని, అవిలేనిదే జీవితం లేదని గొప్పలు చెప్పే పొగరాయుళ్ళు వైద్యులు చెప్పే విషయాలు వింటే గుండె జారడం మాత్రం ఖాయం. ధూమపానం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు బాగా దెబ్బతినిపోతాయి. ఆ విషయం తెలుసుకునేలోపే సిగరెట్, బీడి పొగలాగే మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్, గుట్కా, ఖైని, పానమసాల పేరు ఏదైనా పొగాకును ఏ రూపంలో సేవించినా ప్రమాదమే అంటున్నారు వైద్యులు. ఒక సిగరెట్‌లో నాలుగు వందలకు పైగా హానికర విషరసాయనాలు ఉంటాయి. అందులో 48 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. పొగాకు వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు, గొంతు, దవడ, పెదాలు వంటి భాగాలకు క్యాన్సర్ సులువుగా సంక్రమిస్తుంది. ధూమపానం చేసే వ్యక్తి తనకు మాత్రమే కాకుండా తనచుట్టూ ఉండేవారి ఊపిరితిత్తుల్లో 25 శాతం విషవాయువును పంపుతూ వారి అనారోగ్యానికి కారణమవుతున్నాడు. పొగను పీల్చడం వల్ల కూడా దేశంలో ప్రతి ఏటా అనేక మంది మృత్యువాత పడుతున్నట్లు అంచనా. రోజు రోజుకు మహమ్మారిగా మారుతున్న ఈ విషవాయువు అలవాటుకు ప్రజలు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనావుంది. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అందువల్ల ధృడ సంకల్పంతో ఈ అలవాటును దూరం చేసుకోవడం పెద్ద విషయం కాదంటున్నారు వైద్యులు.
ధూమపానంతో కలిగే రుగ్మతలివే
● పొగతాగడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల కేన్సర్ సోకే ప్రమాదముంది
● గుండె రక్తనాళాలు బిరుసుగా మారి గుండెపోటుకు దారితీస్తుంది
● నాడి సంబంధ వ్యాధులు, పక్షవాతానికి దారితీస్తుంది
● మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది
● దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై ప్రభావం చూపుతుంది
● శారీరక సామర్ద్యం, ఎముకల పటుత్వం తగ్గుతుంది
ఇలా చేస్తే ధూమపానానికి దూరం కావచ్చు
● ధూమపానం అలవాటు ఉన్న వారు వారి వద్ద సిగిరెట్, బీడి, గుట్కా వంటి వాటిని ఉంచుకోకూడదు
● పొగాకు అలవాటు ఉన్న వ్యక్తులకు కొంతకాలం దూరంగా ఉండాలి
● పొగాకు సేవించడం సంపూర్ణంగా వదిలిన నాడే సంపూర్ణ ఆరోగ్యం పొందగలమన్న నిజాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి
● ధూమపానం లేక గుట్కా వంటివి వేసుకోవాలనిపించినప్పుడల్లా లవంగాలు యాలకులు వంటి వాటిని తీసుకున్నట్టయితే తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు
● ఆరంభంలో నాలుగు వారాలు, ఆ తరువాత ఆరువారాల పాటు ఇలాంటి ప్రయత్నం చేసి నెమ్మదిగా పొగాకు అలవాటు నుంచి శాశ్విత విముక్తి పొందవచ్చు
● ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా కూడా ధూమపానానికి, గుట్కా వంటి అలవాట్లకు దూరం కావచ్చు
ధూమపానంతో ఆరోగ్యం ‘ఉఫ్’
బీడి, సిగిరెట్, గుట్కాలతో అనేక అనర్దాలు
పలు రకాల వ్యాధులకు కారణం అవుతున్న పొగాకు వినియోగం
జీర్ణకోశ, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు కేన్సర్
గుండె, మెదడుకు కూడా చేటు
పొగాకుకు బానిసలవుతున్న యువత
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే
పొగాకును ఏరూపంలో తీసుకున్నా జబ్బులను కొనితెచ్చుకున్నట్లే. చాలా మంది యువకులు సరదా కోసం సిగరెట్ తాగడం అలవాటు చేసుకొని ఆ తర్వాత సిగరెట్ తాగడాన్ని మానుకోలేక చిన్న వయస్సులోనే అనారోగ్యాల భారీన పడుతున్నారు. అందువల్ల ఎవరు కూడా సిగరెట్, బీడి, గుట్కా వంటివి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేసుకోకూడదు. అలవాటు చేసుకున్న వారు ఎలాగైనా ఆ అలవాట్లను మానుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు.
– డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
ఆరోగ్యానికి పొగబెడుతుంది


