కొనుగోలు చేసిన భూమిపైనా ‘పచ్చ’ కుట్ర
మదనపల్లె : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్షకట్టి పచ్చ మీడియా కట్టుకథలను అల్లుతోంది. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూమిపైనా విషం కక్కుతున్నారు. నిజాలు లేకున్నా అడ్డగోలు రాతలతో ఇబ్బందులకు గురి చేయాలన్న ప్రయత్నాలు విఫలం అవుతున్నా మళ్లీ మళ్లీ అవే కట్టుకథలు అల్లుతున్నారు. ఇందులో భాగమే సోమవారం మదనపల్లె పట్టణం బీకేపల్లె గ్రామంలో పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వ భూమి ఆక్రమణ అంటూ తప్పుడు కథనం వండివార్చారు. అయినా అక్కడ ఆక్రమణ ఏదిలేదని తేలిపోయింది. అధికారులు కూడా ఎన్‌ఓసీ మేరకు భూమి కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
1959 జూన్ 30న మాజీ సైనికుడు ఆకుల సిద్దప్పకు అప్పటి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. 2002 జూలై 29న మదనపల్లె సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో తన ఆస్తులు వారసులకు దక్కేలా రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించారు. 2006 మే ఏడున ఆయన చనిపోయాక వీలునామా ప్రకారం పట్టా భూమి కుమారుడు ఆకుల రామాంజులుకు సక్రమించింది. ఈ భూమికి ఎన్‌ఓసీ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2018 ఫిబ్రవరి 23న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ భూమికి వారసుడైన రామాంజులు 2018 ఫిబ్రవరి 9న తన కుమార్తె ఆకుల శ్రీప్రియ పేరిట వీలునామా రాశారు. ఆయన 2018 మార్చి 13న చనిపోయారు. తర్వాత ఈ భూమిపై శ్రీప్రియకు వారసత్వ హక్కు ఏర్పడింది. దీంతో ఆమె హైకోర్టు తీర్పు మేరకు తమ భూమికి ఎన్‌ఓసీ జారీ చేయాలని అప్పటి కలెక్టర్ గిరీషాకు దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు, జారీచేసిన పట్టా వివరాలు, కోర్టు తీర్పు, ఉన్నతాధికారుల నివేదికను పరిశీలించి అన్ని సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించాక కలెక్టర్ 2023 మే 3న ఎన్‌ఓసీఓ జారీ చేశారు. దీంతో భూమిని విక్రయించుకునే హక్కు శ్రీప్రియకు దక్కింది.
3.40 ఎకరాలు కొనుగోలు
బీకేపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 552/7లోని మాజీ సైనికుడికి కేటాయించిన భూమిలో 3.40 ఎకరాలను పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేశారు. వారసురాలు శ్రీప్రియ నుంచి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి ఆకుల సిద్దప్ప, ఆయన కుమారుడు రామాంజులు బాబుకు పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, వన్‌బీలును రెవెన్యూ అధికారులు మంజూరు చేసి ఉన్నారు. పక్కాగా న్యాయబద్ధంగా ఉన్న భూమి కావడంతోనే పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తమ కుటుంబానికి ఈ సర్వేనంబర్‌లో వ్యవసాయ భూమి ఉందని పెద్దాయన స్పష్టంగా పేర్కొన్నారు.
పక్కనే ప్రభుత్వ భూమి ఉందని..
కొనుగోలు చేసిన ఈ భూమి పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు. కొన్న భూమి వరకే ఉన్నప్పటికి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. భూమిలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. అయినప్పటికీ భూమిని ఆక్రమించారంటూ ఆరోపిస్తూ కథనం వండారు. అందులో చెరువులు, కుంటలు లేవు, అయినా ఉన్నట్టు ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం సర్వే నంబర్ 552/1లోని 1.35 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులు గాడిని తవ్వించారు. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్టు, ఆక్రమణ లు లేవని రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా నిర్ధారించారు.
ఎలాంటి వివాదం లేదు
సర్వేనంబర్ 552/7లో కొనుగోలు చేసిన 3.40 ఎకరాల భూమి పక్కాగా ఉందని తహసీల్దార్ కే.ధనంజయలు స్పష్టం చేశారు. ఈ భూమిపై ఎలాంటి వివాదం లేదని, పక్కనే ఉన్న 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి కావడంతో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇందులో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని స్పష్టం చేశారు.
మాజీ సైనికుడి పట్టాకు
ఎన్‌ఓసీ ఇచ్చిన కలెక్టర్
ఆపై వారసురాలి ద్వారా సర్వేనంబర్ 552/7లో 3.40 ఎకరాల కొనుగోలు
2024 ఎన్నికల అఫిడవిట్‌లో ఈ భూమి వివరాలు పేర్కొన్న పెద్దిరెడ్డి
అయినా ఆక్రమణ అంటూ కట్టుకథ


