పంట పొలాల్లో చిరుత
కురబలకోట: జిల్లాలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. శనివారం కురబలకోట మండలంలోని సింగన్నగారిపల్లె దగ్గర పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రామాంజులు అనే రైతు ఉదయం టమాటా పొలం వద్దకు వెళ్లాడు. చిరుత కనిపించడంతో భయంతో పక్కనున్న చెట్టు ఎక్కుదామని భావించాడు. అంతలోనే చిరుత సమీపంలోని రైల్వే బ్రిడ్జి వైపుగా వెళ్లి అటుగా పక్కనున్న గుట్టల్లోకి చేరుకున్నట్లు రైతు తెలిపారు. విచిత్రమేమంటే చిరుతను రైతు చూశాడు కాని అది ఇతన్ని చూడకుండా వెళ్లిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అతను ఈ సంగతిని ఊరి వారికి చెప్పడంతో అంతా పులి సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. పులి అడుగులను గుర్తించారు. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హూటాహుటిన వచ్చారు. పులి అడుగు జాడలను గుర్తించారు. ఈప్రాంతంలో జింకలు సంచరిస్తుండడంతో వాటి కోసం చిరుత వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పొలాల్లో పులి కనిపించిందన్న సమాచారంతో పరిసర ప్రాంత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లకుండా కొన్నాళ్ల పాటు జాగ్రత్త వహించాలని ఫారెస్టు అధికారులు సూచించారు. పరిసర గ్రామాల్లో హార్సిలీహిల్స్, బురకాయలకోట సెక్షన్ ఫారెస్టు సిబ్బంది అవగాహన కల్పించారు. చిరుత ఒక చోట ఉండదని తిరుగుతూ ఉంటుందని అన్నారు.హార్సిలీహిల్స్ పరివాహక ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు.
భయాందోళనలో రైతులు
పంట పొలాల్లో చిరుత
పంట పొలాల్లో చిరుత


