చెరువులో భవన నిర్మాణ కార్మికుడు మృతి
నిమ్మనపల్లె : చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందిన ఘటన నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. రాచవేటివారిపల్లెకు చెందిన బోడుమల్లె జగన్నాథం(40) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడికి భార్య చిన్నబుజ్జి, కుమార్తె మహిత, కుమారుడు మహేష్ ఉన్నారు. ఏప్రిల్ 30న భార్య కూలి పనికి వెళ్లగా, మదనపల్లె ఆస్పత్రిలో బంధువు అనారోగ్యంతో ఉన్నాడని, చూసి వస్తానని జగన్నాథం ఇంటి నుంచి వెళ్లాడు. అయితే.. మూడు రోజులుగా రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులతో కలిసి భర్త కోసం గాలిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆచార్లపల్లె సమీపంలోని ముసలినాయుని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తెచ్చారు. మృతుడి కుడిచేయికి మల్లయ్య పచ్చబొట్టు, ఎర్రటి గుడ్డ ఉండగా, కుడికాలికి ఎర్రటితాడు ఉంది. దీంతో పోలీసులు, గత మూడురోజులుగా కనిపించని వారి కుటుంబసభ్యులు ఉంటే రావాల్సిందిగా సమాచారం అందించడంతో మృతుడి భార్య చిన్నబుజ్జి చెరువు వద్దకు చేరుకుని ఆనవాళ్ల ఆధారంగా భర్త జగన్నాథంను గుర్తు పట్టింది. మృతి చెందిన వ్యక్తి తన భర్తేనని చెప్పింది. తన భర్త అప్పుడప్పుడు చేపల కోసం చెరువుకు వెళుతుంటాడని, అదే క్రమంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెంది ఉంటాడని పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. భార్య చిన్నబుజ్జి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


