
ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం
లక్కిరెడ్డిపల్లె: లక్కిరెడ్డి పల్లె మండలంలో తెలుగు తమ్ముళ్ల బరితెగింపునకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అనేక సంవత్సరాలుగా ఉపాధి హామీ పధకంలో పనిచేస్తున్న పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు తమ్ముళ్లు తొలగించారు. వారి స్థానంలో అధికార పార్టీ నాయకులు తమకు కార్యకర్తలుగా పనిచేసే వారిని ఫీల్డ్ అసిస్టెంట్లు గా నియమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ నాయకులు నియమంచుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు నాయకుల అండ చూసుకొని విదేశాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు కూడా జాబ్ కార్డులో అన్ లైన్ మస్టర్లలో హాజరు వేసుకొని డబ్బులు చెల్లిస్తున్నట్లు ఉపాధిహామీ కూలీల నుంచే ఆరోపణలు ఉన్నాయి. అలాగే పనికి రాకుండా ఇంటి వద్ద ఉన్న వారికి కూడా కూలీ డబ్బులు చెల్లిస్తున్నట్ట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా ఫీల్డ్ అసిస్టెంట్లు ఊరికే చేయడం లేదు. పనికి రాకుండా ఉండే వారి వద్ద ముడుపులు తీసుకొని తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారని పలువురు ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పలువురు కూలీలు క్రమం తప్పకుండా కూలికి వెళ్లినా ఐదు వారాలకు రెండు వారాల కూలి మాత్ర మే వారి ఖాతాలో జమకావడం.. మిగతా మూడు వారాల కూలి జమ కాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల చేతి వాటం బట్ట బయలయింది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం కూలీల కు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది అని చెపుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఏది ఏమైనా కూటమి పార్టీ నాయకుల వల్లే ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
కనీస సౌకర్యాలు లేవు
గతంలో ఉపాధి పనులకు వెళితే ఎండ నుంచి ఉపశమనానికి టెంట్ వేసేవారు. నీటి సౌకర్యం కల్పించే వారు.వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స కోసం కిట్ ను పనుల వద్ద ఉంచే వారు.మజ్జిగ ప్యాకెట్లు అందించేవారు.ప్రస్తుతం అవి ఏమి లేకపోగా తాము చేసిన పనులకు బిల్లులు రాకుండా ఎరరెవరి పేర్లో మస్టర్లలో ఆన్ లైన్‌లో ఎక్కించుకొని తమ కడుపు కొడుతున్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. –శ్రీరాములు,ఉపాధి కూలీ,అగ్రహారం,లక్కిరెడ్డిపల్లె మండలం
ఐదు వారాలు పనిచేస్తే రెండు వారాల బిల్లులు ఇచ్చారు
ఐదు వారాలు పని చేస్తే రెండు వారాల బిల్లులు వచ్చాయి. ఈ విషయం గురించి అడుగుతంటే ఎవరూ పట్టించుకోలేదు. పని మేము చేస్తే డబ్బులు పనులకు రాని వాళ్లకు వేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలని సిబ్బందిని నిలదీస్తే మీకు పనులే పెట్టమంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. –నాగలక్ష్మి,కుర్నూతల ,లక్కిరెడ్డిపల్లె మండలం
పనికి తగిన వేతనం లేదు
ప్రతిరోజు ఎండలో పనులు చేస్తాం.వారంలో మాకు మూడు రోజులకు మాత్రమే కూలీ పడుతుంది.ఇంటి వద్ద ఉన్న వారికి ఆరు రోజులకు కూలీ డబ్బులు ఎక్కువ మొత్తంలో వస్తుంది.కష్టం మాదైతే కూలి డబ్బులు ఇంటి వద్ద ఉన్న వారికి వేస్తారు. అడిగితే పట్టించుకున్న వారే లేరు.మేము చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించాలి. –అచ్చమ్మ, అగ్రహారం,కుర్నూతల గ్రామం,లక్కిరెడ్డిపల్లె మండలం
విదేశాల్లో ఉన్న ఉపాధి కూలీలకు డబ్బులు
అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూలీలను ఇబ్బంది పెడుతున్న వైనం

ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం

ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం

ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం

ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం

ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం