పేద విద్యార్థులకు మద్దతుగా పోరుబాట | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు మద్దతుగా పోరుబాట

Mar 10 2025 11:00 AM | Updated on Mar 10 2025 10:55 AM

రాజంపేట టౌన్‌ : పేద విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12వ తేదీ తలపెట్టిన ‘యువత పోరు’ పోస్టర్లు ఆదివారం రాజంపేట పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆకేపాటి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా పేద విద్యార్థులపై సీఎం చంద్రబాబునాయుడు కక్షగట్టారని అన్నారు. ఐదు త్రైమాసికాలుగా చెల్లించక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలకు ఫీజులు చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులు చదువులు మానేసి కూలీ పనులకు వెళ్లే దయనీ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పేద పిల్లలకు పెద్ద చదువుల కల

సాకారం చేసిన వైఎస్సార్‌

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టి పేద పిల్లలు పెద్ద చదువులు చదివే కలను సాకారం చేశారని తెలిపారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరుగార్చుతూ వచ్చాయన్నారు. 2014–2019 మధ్య కాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తిలోదకాలు ఇచ్చారని దుయ్యబట్టారు.

పకడ్బందీగా అమలు చేసిన జగన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరిందని తెలిపారు. అంతేకాక జగనన్న వసతిదీవెన పథకం ద్వారా పేద విద్యార్థులు హాస్టల్‌లో ఉంటూ చదువుకునేందుకు నెలకు రెండు వేల రూపాయిల చొప్పున ఇచ్చినట్లు పేర్కొన్నారు. పిల్లల తలరాతలు మారాలంటే ఒక విద్యతోనే సాధ్యం అని గట్టిగా విశ్వసించి జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఎనలేని మేలు చేసినట్లు తెలిపారు. ఆ దిశగా జగన్‌ తన హయాంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు జగన్‌ ప్రభుత్వం 18 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు.

ఫీజురీయింబర్స్‌మెట్‌పై చంద్రబాబు కుట్ర

పేదలు చదువుకోకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులు చదువుకుంటే పేదరికం నుంచి బయటపడితే తమ అడ్రస్‌ ఎక్కడ గల్లంతు అవుతుందో అన్న భయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు.. లేకుంటే ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. అయితే వాటిని అమలు చేయలేదని విమర్శించారు.

యువత పోరును విజయవంతం చేయండి

ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రమైన రాయచోటిలో చేపట్టే ‘యువతపోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని తెలిపారు. అలాగే మార్చి 12న వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవమైనందున అన్ని మండలాలు, గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మర్రి రవి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు వడ్డే రమణ, డి.భాస్కర్‌రాజు, డీలర్‌ సుబ్బరామిరెడ్డి, శ్రీను, వివేకానందరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, దండు గోపి, జీవీ సుబ్బరాజు, మిర్యాల సురేఖ, ఖాజా మోహిద్దీన్‌, జాహీద్‌ అలీ, మసూద్‌, అబ్దుల్‌మునాఫ్‌, నరేష్‌, చింతల హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’

ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి

ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement