
అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దు
లక్కిరెడ్డిపల్లి : ఎన్నికల కౌంటింగ్ ముగిసేంత వరకు గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో వారు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యేంతవరకు ప్రతిరోజూ గ్రామాలలో పర్యటించి అల్లర్లు జరగకుండా చూడాలన్నారు. అలాగే గ్రామాలలో చాలా మంది వ్యక్తులు మద్యం సేవించి పార్టీలకు అతీతంగా గొడవలు పడుతూ ఉంటారని, అలాంటి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలన్నారు. కౌంటింగ్ ముగిసేంతవరకు ప్రతిరోజూ గ్రామాలలో కవాతు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి శాంతి భద్రతలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జీవన్ గంగనాథ్ బాబు, ఎస్‌ఐ విష్ణువర్దన్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ కృష్ణారావు