సాక్షి,నరసరావుపేట రూరల్: మున్సిపాలిటి ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్‌ల స్వీకరణ, నవంబర్ 3వ తేదీన ఎన్నికలు, 5వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
దీంతో స్థానిక సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జేసీ సంజనా శ్రీహర్ష వ్యవహరించనున్నారు.
నరసరావుపేటలోని ఆర్‌డీవో కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసే నామినేషన్ కేంద్రాల్లో తమ నామినేషన్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికలకు మండల స్థాయిలో నియమించిన రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు..
జిల్లాలోని 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అమరావతి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు సీఆర్‌డీఏ విలీన ప్రతిపాదనల కారణంగా ఎన్నికలు నిలిపివేశారు. నరసరావుపేట మున్సిపాలిటీలో ఐదు విలీన గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 1548 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో 706 అత్యంత సమస్యాత్మకం, 488 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 12,89,165 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 6,33,116, మహిళలు 6,55,951, ఇతరులు 96మంది ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.
నోటిఫికేషన్ విడుదల అక్టోబర్ 19
నామినేషన్‌లు ప్రారంభ తేదీ అక్టోబర్ 21
నామినేషన్‌ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 23
నామినేషన్‌ల పరిశీలన అక్టోబర్ 24
అభ్యంతరాలపై అప్పీళ్లు అక్టోబర్ 25
అప్పీళ్ల పరిష్కారం అక్టోబర్ 26
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 27
పోలింగ్ నవంబర్ 3
ఓట్ల లెక్కింపు, ఫలితాలు నవంబర్ 5
పురుషులు 6,33,116
మహిళలు 6,55,951
ఇతరులు 96
మొత్తం 12,89,165


