అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి | YSRCP Demands Poll Delay Over Irregularities: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి

Oct 19 2026 5:50 AM | Updated on Oct 19 2026 5:50 AM

YSRCP Demands Poll Delay Over Irregularities: Andhra pradesh

పునేఠకు వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

మళ్లీ షెడ్యూల్‌ విడుదల చేయాలి

కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాల

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల బృందం డిమాండ్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రక్రియలో హింస, బెదిరింపులు, నామినేషన్ల అడ్డగింత వంటి అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేసి, రూల్‌–7 ప్రకారం నామినేషన్ల దశనుంచి మళ్లీ షెడ్యూల్‌ విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. హింస, బెదిరింపులు, అడ్డంకుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన ప్రతి అర్హుడికి మరో అవకాశం కల్పించి, వారి హక్కును పరిరక్షించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌చంద్ర పునేఠకి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.

 పుంగనూరు, పులివెందుల, తిరుపతి, బద్వేలు, మైదుకూరు, ధర్మవరం, కడప, దర్శి, పల్నాడు తదితర ప్రాంతాల్లో నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడం, బెదిరించడం, నామినేషన్‌ పత్రాలను లాక్కోవడం, చించివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, మరికొన్ని చోట్ల అడ్డంకులను నివారించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పులివెందు లలో డీఐజీ కోయ ప్రవీణ్, డీఎస్పీ మురళీనాయక్‌ పక్షపాతంగా వ్యవహరించారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను తప్పించి నిష్పక్షపాత అధికారులను నియమించాలని కోరారు. 

దాఖలు చేసిన నామినేషన్లను చించేయడం ఎన్నికల చరిత్రలో ఎప్పుడైనా ఉందా?
కాగా.. ఆదివారం ఉదయం నుంచి ఎస్‌ఈసీ పునేఠను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల బృందం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేసింది. అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించిన నామినేషన్లను లాక్కెళ్లడం, చించేయడం ఎన్నికల చరిత్రలో ఎప్పుడైనా ఉందా అని ఎమ్మెల్సీల బృందం ప్రశ్నించింది. స్వేచ్ఛగా నామినే షన్లు వేసే అవకాశం కల్పించాలని కోరారు. 

అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, రుహుల్లా, మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, పార్టీ నేతలు సతీష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నారాయణమూర్తి, నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, నాగార్జున యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్లను చించివేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఒప్పుకుందన్నారు. అలాంటి వారు మళ్లీ నామినేషన్లు వేయాలని కోరుతున్నట్టు తెలిపిందన్నారు.  కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలోని అప్రజాస్వావిుక ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement