YSRCP Plenary 2022: ప్రజాభ్యుదయమే అజెండా

YSRCP Third Plenary July 8th and 9th In Andhra Pradesh - Sakshi

ఈనెల 8, 9 తేదీల్లో వైఎస్సార్‌సీపీ మూడో ప్లీనరీ

రెండో ప్లీనరీలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ

ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో ముడిపడిన ఏడు అంశాలపై చర్చ, తీర్మానాలు

ప్రభుత్వంపై దుష్టచుతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపివ్వనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: గతాన్ని మననం చేసుకుని.. వర్తమానాన్ని విశ్లేషించుకుని.. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడమే అజెండాగా ప్లీనరీ నిర్వహించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రజాభ్యుదయమే అజెండాగా ప్లీనరీలు నిర్వహించడం వైఎస్సార్‌సీపీ విధానం. పార్టీ ఆవిర్భవించాక 2011, జూలై 8, 9న ఇడుపులపాయలో నిర్వహించిన తొలి ప్లీనరీ.. 2017, జూలై 8, 9న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించిన రెండో ప్లీనరీలోనూ ప్రజాభ్యుదయమే అజెండాగా చేసుకుంది.

ఇక అధికారంలోకి వచ్చాక నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈనెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీలోనూ ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేవరకూ సుమారు పదేళ్లపాటు దేశ చరిత్రలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, అటుపోట్లు, దాడులను వైఎస్సార్‌సీపీ ధీటుగా ఎదుర్కొంది. ప్రజల తరఫున నిలబడి పోరాడింది. ప్రజల హృదయాలను గెలుచుకుని 2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించింది.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పదేళ్ల పోరాటంలో ప్రజలకు చేసిన వాగ్దానాల్లో 95 శాతం అమలుచేసింది. ప్రజాభ్యుదయం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి నిబద్ధతతో కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే ప్లీనరీలో ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ముడిపడిన విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం–సామాజిక సాధికారత, మహిళా సాధికారత–రక్షణ, నవరత్నాలు–డీబీటీలు, పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పనపై చర్చించి.. వాటిని మరింత మెరుగ్గా అమలుచేయడంపై తీర్మానాలు చేయనున్నారు. 

జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా..
సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించి పేదరికం నుంచి ప్రజలను గటెక్కించడం.. మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా సాధికార, సామాజిక సాధికారత సాధించడం ద్వారా రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలపడానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో గడచిన మూడేళ్లలో పలు రంగాల్లో కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. ముఖ్యంగా..

విద్యారంగం..
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ఆధునీకరించారు. పిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, వసతి దీవెన, గోరుముద్ద, నాడు–నేడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ తదితర పథకాల కింద విద్యారంగంలో రూ.52,676.98 కోట్లను ఖర్చుచేశారు. ప్రపంచ విద్యార్థులతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ఏటా రూ.24 వేల వరకు ఖర్చయ్యే.. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న బైజూస్‌ స్డడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేయనుంది.

వైద్యరంగం..
ప్రజలకు వైద్య సేవలను మెరుగ్గా అందించడానికి ప్రభుత్వాస్పత్రులను కూడా నాడు–నేడు కింద సీఎం వైఎస్‌ జగన్‌ ఆధునీకరిస్తున్నారు. వీటిల్లో 40,180 ఉద్యోగాలను భర్తీచేసి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఓ వైద్య కళాశాల ఏర్పాటుచేయాలనే లక్ష్యంలో భాగంగా కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

వ్యవసాయం..
విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు తోడునీడగా నిలవడం ద్వారా వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌ రైతుభరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. ఉచితంగా పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నారు.

వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సలహాలు అందిస్తూ.. అధిక దిగుబడులు సాధించడానికి బాటలు వేస్తున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు నష్టపోతే అదే సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. పంటల బీమా కింద రైతులకు పరిహారం అందిస్తూ పంట పండినా.. ఎండినా.. తడిసినా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టారు.

సామాజిక న్యాయం–సాధికారత..
పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించి సామాజిక న్యాయం చేయడం ద్వారా ఆ వర్గాలు సాధికారత సాధించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. తొలిసారి ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి, సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు. అలాగే, దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ అమలుచేస్తున్నారు.

అసెంబ్లీ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశమిచ్చారు. శాసనమండలి చైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి.. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు ఇచ్చారు. మరోవైపు.. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల్లోనూ ఆ వర్గాలకే సింహభాగం అవకాశమిచ్చి.. సామాజిక న్యాయం, సాధికారతలో వైఎస్‌ జగన్‌ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచారు.

మహిళా సాధికారత–రక్షణ..
మహిళా సాధికారతతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని.. తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగాఢ విశ్వాసం. అందుకే మహిళలు ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, సున్నావడ్డీ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు. తొలి కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పిస్తే.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో నలుగురికి అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం కల్పించారు. ఇక 30.56 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను మహిళల పేర్లతోనే ఇచ్చారు. 

పారిశ్రామికాభివృద్ధి–ఉద్యోగాల కల్పన..
పారిశ్రామికరంగ ప్రోత్సాహకానికి సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలతో మిట్టల్, బిర్లా, అదానీ, సంఘ్వీ, భజాంకా, బంగర్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు, పర్యావరణ హిత గ్రీన్‌ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో వారు రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కోవిడ్‌ సమయంలో రిస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా పరిశ్రమలను ఆదుకోవడంతో ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగింది.

గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,588 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిలతో కలిపి రూ.2,086 కోట్లు వరుసగా రెండేళ్లు చెల్లించడమే కాకుండా ఈ ఏడాది కూడా ఆగస్టులో చెల్లించనున్నట్లు సర్కారు ముందుగానే ప్రకటించింది. దీంతో.. పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన సులభతర వాణిజ్య (ఈఓడీబీ) ర్యాంకుల్లో ఏపీ వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన మూడేళ్ల కాలంలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రాంరంభించడం ద్వారా 2,48,122 మందికి ఉపాధి లభించింది.

ప్రస్తుతం రూ.1,51,372 కోట్ల విలువైన 64 యూనిట్లకు సంబంధించిన నిర్మాణ పనులు వివిధ దశలో ఉండగా, మరో రూ.2,19,766 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దావోస్‌ పర్యటనలో రూ.126 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరగడమే కాకుండా త్వరలో విశాఖ వేదికగా భారీ పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.

ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొచ్చింది. చరిత్ర మెచ్చేలా మూడేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 6,03,756 ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి 1,21,518 మందికి ప్రభుత్వ కొలువులిచ్చి సొంత ఊరిలో ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించింది. 

నవరత్నాలు–డీబీటీ..
పేదరికం నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నవరత్నాల కింద డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా మూడేళ్లలో రూ.1,41,247.94 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ జమచేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.43,682.65 కోట్లను పేదల కోసం ఖర్చుచేశారు.

దుష్టచుతుష్టంపై సమరభేరి
ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత పారదర్శకంగా.. సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడం.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే అధిక మెజార్టీ వైఎస్సార్‌సీపీకి రావడమే అందుకు తార్కాణం.

ఇది చూసి ఓర్వలేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మూకుమ్మడిగా అవాస్తవాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. ఈ దుష్టచతుష్టయంపై యుద్ధంచేసి.. దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్లీనరీ వేదికగా పిలుపునివ్వనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top