విశాఖ: చంద్రబాబు బరితెగించి ప్రభుత్వ భూములను దోపీడీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం భూముల దోపిడీ చేస్తోందని, చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తామరని ధ్వజమెత్తారు. ప్రధానంగా గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈరోజు( మంగళవారం. జనవరి 27వ తేదీ)జీవీఎంసీ కార్పొరేటర్లతో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, కన్నా బాబు, గుడివాడ అమరనాథ్, కేకే రాజు, వాసుపల్లిలు సమావేశమయ్యారు.
30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎంపీ భరత్ యూనివర్సిటీకి 55 ఎకరాలు కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. రూ. 5 వేల కోట్ల విలువ చేసే భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.
ఈ నెల 30వ తేదీన జరిగే భూ కేటాయింపులను అడ్డుకుంటామని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ హెచ్చరించగా, ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ భూములను కాపాడటం కోసం వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ వరకూ పోరాటం చేస్తోంది. ప్రభుత్వ భూములను విశాఖ ఎంపీ భరత్ కబ్జా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తారు. గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. గీతం యూనివర్శిటీకి ఇచ్చిన భూములపై మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు.


