రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు | YSRCP President YS Jagan lashes out at Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు

Jun 13 2026 4:22 AM | Updated on Jun 13 2026 4:22 AM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ సహా 143 హామీలిచ్చారు

చంద్రబాబూ.. ఈ హామీలన్నీ ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు  

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు 

చెప్పిన మాటలకు.. చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు

ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్‌ల మయం.. డీఎస్సీలోనూ అక్రమాలు

రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ పాలన

కుప్పకూలిన వ్యవస్థలు.. ఎవరికీ రక్షణ లేదు.. జంగిల్‌ రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు

అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి.. అన్నింటా మాఫియాతో దోపిడీ 

ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి.. పేదరికం బుసలు కొడుతోంది

ఈ రోజు ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ

ప్రజా వ్యతిరేకతకు అద్దం పట్టిన వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు

పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు హృదయ పూర్వక అభినందనలు

ప్రజలు ప్రతి హామీని గుర్తు పెట్టుకుని.. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు

నారాసుర పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు

సాక్షి, అమరావతి : ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ 143 హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు ఈ రెండేళ్లలో వాటిని అమలు చేయకుండా అటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల నారాసుర పాలన రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఇంటింటికీ బాండ్లు రాసిచ్చి మరీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన మాటలకు, ఈ రెండేళ్లలో చేసిన పనులకు ఏమాత్రం పొంతన లేదని చెప్పారు. 

నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు, చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మోసపోయిన, దగా పడిన యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాలపై వైఎస్‌ జగన్‌ శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజాగ్రహానికి అద్దం పట్టిన వైఎస్సార్‌సీపీ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీల ఫొటోలను ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రెండేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ అన్నారు.. సూపర్‌ సెవెన్‌ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలో.. బాండ్ల రూపేనా పెట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు ఇచ్చారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబూ అని అడుగుతున్నారు.

రైతులను మోసం చేశారు. మహిళలను మోసం చేశారు. యువతను మోసం చేశారు. విద్యార్థులను మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్నీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగా, స్కామ్‌ల మయమే. ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు. పచ్చి అబద్ధాల ప్రచారం. సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రజలు చూసింది మోసం. ప్రజా పాలన కాదు.. రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో భయానక పాలన.

వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బ తీశారు. జంగిల్‌ రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడిని ఏమంటాం?

అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక, మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్‌ అన్నింటిలోనూ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.

మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు చార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, బస్సు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది. 

విద్యా రంగం దెబ్బతింది. వైద్య రంగం దెబ్బతింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశ చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవక­తవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బ­తీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఉపాధి అవ­కాశాలు కల్పించలేకపోయారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు. ప్రచార కార్యక్రమా­లకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 

ఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయ పూర్వక అభినందనలు.

చంద్రబాబుకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. అబద్ధాలతో కొంత కాలం ప్రజలను మోసం చేయొచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్నీ లెక్కపెడుతున్నారు. 

ఈ ‘నారాసుర పాలన’కు వ్యతిరేకంగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం. ప్రజల గొంతుకగా నిలబ­డతాం. అన్ని వర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement