డీజీపీ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఈ దారుణంపై సీబీఐ విచారణ జరిపించాలి
కారకులైన పోలీసులపై చర్య తీసుకోవాలి
సాల్మన్ కుటుంబానికి కోటి నగదు, ఐదెకరాల పొలం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్
ఎస్పీలపై జరుగుతున్న దాడులపై వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు
డీజీపీ కలవకపోవడంతో ఏడీజీకి వినతిపత్రం ఇచ్చిన నాయకులు
చంద్రబాబు పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదంటూ మండిపడ్డ నాయకులు
సాల్మన్ హత్యపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్‌ని ఆశ్రయిస్తామని వెల్లడి
వారి కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టికరణ
సాక్షి, అమరావతి: పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని.. సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మన్‌ని అతి దారుణంగా పట్టపగలు ఇనుపరాడ్లతో కొట్టి చంపారని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణహత్య నేపథ్యంలో సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
సాల్మన్‌ది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాల్మన్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు కోటి రూపాయల పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు ఈ హత్య ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటినుంచి దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నిర్వీర్యం అయ్యాయని చెప్పడానికి మందా సాల్మన్ హత్యే తాజా నిదర్శనమని చెప్పారు.
కళ్ల ముందు దారుణాలు జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు రాబోయే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో డీజీపీ కార్యాలయం గేటు వద్దనే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో దిగివచ్చిన పోలీసులు వారిని లోపలికి అనుమతించి ఏడీజీకి వినతిపత్రం ఇప్పించి పంపించారు. ముందస్తు సమాచారం ఉన్నా తమను కలవకపోవడంతో ప్రజాసమస్యలను వినడానికి కూడా డీజీపీకి ఓపిక లేదా అని వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాలను, జాతీయ మానవహక్కుల సంఘాన్ని (ఎన్‌హెచ్‌ఆర్‌సీని), నేషనల్ ఎస్సీ కమిషన్‌ని ఆశ్రయిస్తామని చెప్పారు. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, మాజీమంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, విడదల రజిని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయిస్తాం
గతంలో బిహార్‌లో జంగిల్రాజ్ గురించి దేశమంతా మాట్లాడుకునేది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో అమలవుతున్న దొంగల రాజ్యం, డెకాయిట్ రాజ్యాన్ని ప్రజలు కళ్లారా చూస్తున్నారు. ఎంతోమంది వేధింపులు అనుభవిస్తున్నారు. ఒక్క పిన్నెల్లి గ్రామంలోనే దాదాపు 200 కుటుంబాలను ఊరి నుంచి వెలివేస్తే.. పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం శూన్యం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఊరి బయటే ఉంటున్న సాల్మన్.. భార్య అనారోగ్యంతో ఉందని వస్తే నిర్దాక్షిణ్యంగా చంపేశారు.
కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఆధార్ కార్డులు చూపిస్తేనే శ్మ శానానికి అనుమతిస్తామంటూ దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నారు. సాల్మన్ హత్యపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఎన్‌హెచ్‌ఆర్‌సీని, ఎస్సీ కమిషన్‌ని ఆశ్రయిస్తాం. న్యాయం జరిగేదాకా వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపదు. సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించాం. – కాసు మహేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
డీజీపీ కనీసం పట్టించుకోలేదు
అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టి చంపేశారు. పోలీసుల ఉదాసీన, నిర్లక్ష్యవైఖరి కారణంగానే సాల్మన్ హత్య జరిగింది. సాల్మన్ మీద జరిగిన దాడి గురించి ఫోన్ చేసి చెప్పినా, ఆయన భార్య స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
పైగా చావు బతుకుల మధ్య ఉన్న సాల్మన్‌పైనే 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయడానికి ప్రతిపక్ష నాయకులు వచ్చినా డీజీపీ పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 15 సార్లకు పైగా వివిధ అంశాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చినా డీజీపీ కనీస బాధ్యతగా వ్యవహరించలేదు. సాల్మన్ హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. – అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
సీబీఐ విచారణ జరిపించాలి
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులు ప్రాణాలతో ఉండాలంటే ఊళ్లు వదిలేసి బయట తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. భార్యకు ఆరోగ్యం బాలేదని చూడటానికి వెళ్లిన వ్యక్తిని ఇనుపరాడ్లతో కొట్టి అతి దారుణంగా చంపేశారు. నిందితులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు.. వారిచ్చిన ఫిర్యాదుతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న సాల్మన్ మీదనే కేసు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి. సాల్మన్ హత్య పథకం ప్రకారమే జరిగింది. రాష్ట్రంలో దళితులు వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటున్నారన్న కక్షతో వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈ హత్య జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్టులు కూడా దేశంలో ఎక్కువ నేరాలు ఏపీలోనే నమోదవుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగంతో దళిత బిడ్డల్ని వేధిస్తున్నారు. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి
వైఎస్సార్‌సీపీకి దూరం చేసే కుట్ర
సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ముందస్తుగా అనుమతి తీసుకుని వచ్చిన మమ్మల్ని ధర్నా చేస్తేగానీ కార్యాలయం లోపలికి అనుమతించలేదు. డీజీపీని కలవడానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా ఆయనకు సమయం లేకపోయింది. సాధారణ వ్యక్తులతో వ్యవహరించినట్టు కూడా పోలీసులు ప్రవర్తించలేదు.
స్థానిక సీఐ, ఎస్‌ఐల తీరుని వివరించాలని వచ్చిన మమ్మల్ని కనీసం సమస్య చెప్పుకోనివ్వలేదు. వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్న దళితులను దూరం చేయాలన్న కుట్రతోనే పథకం ప్రకారం దళితులపై సీఎం చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడు. దళితుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతీయాలన్న వ్యూహాలు రచిస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చే వరకు వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుంది. – టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
దళితుడిని పట్టపగలు దారుణంగా తలపగలగొట్టి చంపితే ప్రభుత్వం నుంచిగానీ టీడీపీ నుంచిగానీ కనీస స్పందన లేదు. ఎన్నికలొచ్చినప్పుడల్లా పెద్ద మాదిగనని చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. మాదిగ కులస్తుడు మందా సాల్మన్‌ని దారుణంగా చంపితే ఎందుకు పట్టించుకోవడం లేదు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మవిశ్వాసంతో బతికిన దళితులు కూటమి ప్రభుత్వం వచ్చాక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. దళితులను దారుణంగా వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి. టీడీపీలో ఉన్న దళిత నాయకులు కూడా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి. – మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ


