
కూటమి ప్రభుత్వం రాగానే రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల బహిష్కరణ
వందల కుటుంబాలు ఊరు వదలాల్సిన దుస్థితి
నిరాకరించిన వారిపై దాడులు.. చేతులెత్తేసిన పోలీసులు
ఇప్పటికీ గ్రామంలోకి రాలేని పరిస్థితి.. వలస కూలీలుగా కొందరు.. బంధువుల ఇళ్లలో మరికొందరు
సాక్షి, నరసరావుపేట: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో.. కట్టుబట్టలతో సొంత ఊరిని వీడిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు వనవాసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. కాదన్న వారి ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు.
కాపాడాల్సిన పోలీసులు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ గ్రామం వీడి వెళ్లిపోవాలని బాధితులకు సలహాలిచ్చారు. స్వయంగా పల్నాడు ఎస్పీ గ్రామంలో పర్యటించి వెళ్లిన గంటల వ్యవధిలోనే మరోసారి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డా చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో వందలాది కుటుంబాలు పుట్టిన ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇప్పటికీ పిన్నెల్లి వాసులు సొంతూరికి రాలేని దుస్థితి నెలకొంది.
వలస కూలీలుగా....
పదుల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు సైతం టీడీపీ మూకల దాడులకు భయపడి వేరే ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకీడుస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతులు ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌లుగా గడుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన పొలాలను ఇతరులు సాగు చేయనివ్వకుండా బీడు పెట్టారు. కొందరి భూములను దౌర్జన్యంగా అక్రమించారు.
అంత్యక్రియలకూ అనుమతించలేదు..
పిన్నెల్లి నుంచి వలస వెళ్లిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను కనీసం కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు సైతం రానివ్వకుండా టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారు. పిన్నెల్లికి చెందిన షేక్ అల్లా బ„Š అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆయన శవాన్ని గ్రామానికి తరలించేందుకు టీడీపీ నేతలు ఒప్పుకోకపోవడంతో గుంటూరులోనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది. మాడుగుల అల్లు చనిపోతే కనీసం నలుగురు కూడా లేకుండా అంతిమ సంస్కారాలు పూర్తి చేయాల్సి వచ్చింది.
ఆస్తులు ధ్వంసం..
ఎన్నికల ఫలితాలు వెలువడగానే పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్‌సీపీకి చెందిన వారెవరూ గ్రామంలో ఉండటానికి వీల్లేదని గ్రామంలో దండోరా వేయించారంటే టీడీపీ నేతల దురాగతాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. ఇప్పటికి 400కు పైగా కుటుంబాలు పిన్నెల్లి గ్రామంలోకి రాలేని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గ్రామం నుంచి వెళ్లగొట్టే క్రమంలో టీడీపీ నేతలు వారి ఇళ్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment