
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్‌కు తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. దీంతో, ఎస్పీ జగదీష్ ఈసారైన అనుమతి ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం ఎస్పీ జగదీష్‌కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్బంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖ రాశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, అనంతపురం రాంనగర్‌లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటికి తాను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్..
‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్‌సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు’ అని జేసీ రెచ్చిపోయారు.
