
ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు, నాయకులు
కురుపాం ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
మలం కలిసిన నీళ్లు తాగడం వల్లే పచ్చ కామెర్లకు గురయ్యారు
ఘటనపై చలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ రామసుబ్రహ్మణియన్
క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ
సాక్షి, న్యూఢిల్లీ: గిరిజన విద్యార్థుల మృత్యు ఘోషతో మన్యం విలవిల్లాడుతోందని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు, విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను చుట్టుముట్టినా కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన హాస్టల్‌లో 170 మంది విద్యార్థులు పచ్చకామెర్లు, విష జ్వరాల బారిన పడగా ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో ‘హెపటైటిస్– ఏ’ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘానికి (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేసింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్‌ను ఢిల్లీలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, రాజన్న దొర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర, విజయనగరం జిల్లా మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభ స్వాతిరాణి, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరిక్షీత్ రాజు తదితరులు కలసి ఫిర్యాదు చేశారు.
ఘటనకు సంబంధించిన ఆధారాలను చైర్మన్‌కు అందచేశారు. కూటమి ప్రభుత్వం ఉదాశీన వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను వైఎస్ జగన్ పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందచేశామన్నారు.
గిరిజన కుటుంబాలకు నష్టం జరిగితే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించి ఈ ఘలనపై దర్యాప్తు చేయాలని కోరగా అందుకు చైర్మన్ అంగీకరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
తాగునీటిలో మలం కలిసింది
గిరిజన విద్యార్థులు తాగే నీటిలో మలం కలిసిందని, ఇది అత్యంత దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఆ నీటిని తాగిన కారణంగానే పిల్లలు విష జ్వరాలు, పచ్చ కామెర్ల బారిన పడ్డారన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతో పాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘170 మంది గిరిజన విద్యార్థులు ‘హెపటైటిస్ ఏ’ ఇన్ఫెక్షన్‌కి గురై విశాఖ కేజీహెచ్‌లో చేరారు.
ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కూటమి ప్రభుత్వ పాలనలో పాఠశాలల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇద్దరు గిరిజన విద్యార్థులు చనిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. గురుకుల పాఠశాలే కాకుండా పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్ధులకు కూడా ఇన్ఫెక్షన్ సోకినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆరి్టకల్ 21 (మానవ హక్కుల ఉల్లంఘన) కింద ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశాం’ అని పేర్కొన్నారు.
సీఎం కనీసం సమీక్షించరా?కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శించారు. ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినులు కల్పన, అంజలి చనిపోయారన్నారు. ఆరోగ్యం సరిగా లేదని తెలిసినా విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చకుండా స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపేసి చేతులు దులిపేసుకుందని మండిపడ్డారు. విద్యార్థిని కల్పన దాదాపు పది రోజుల పాటు నాలుగు ఆస్పత్రులు తిరిగినా సరైన వైద్యం అందక అక్టోబర్ 1న చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు నెలలుగా ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిసినా మరమ్మతులు చేయించకపోవడంతో ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు. ఘటన జరిగిన ఐదు రోజుల వరకు స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లలేదని విమర్శించారు. జిల్లా మంత్రికి ఇప్పటికీ తీరిక లేదన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం కోసం వచ్చిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుకు పక్కనే వంద మీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే తీరిక లేదని దుయ్యబట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇంత దారుణం జరిగిందని తెలిసినా సీఎం చంద్రబాబు ఇంతవరకు సమీక్ష కూడా చేయలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తానంటూ ఒక నోట్ రిలీజ్ చేసి మౌనం దాల్చారని వ్యాఖ్యానించారు. విశాఖలో క్రికెట్ చూడటానికి వచ్చిన మంత్రి లోకేష్ గిరిజన బిడ్డల కష్టాలను కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు.
చలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్
వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధుల బృందం ద్వారా ఈ దయనీయ ఘటన గురించి తెలుసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ రామసుబ్రహ్మణియన్ చలించారు. పిల్లల విషయంలో ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చదువుల కోసం హాస్టళ్లకు పంపితే గిరిజన విద్యార్థులు ఇలా చనిపోవడం, ఆస్పత్రుల పాలు కావడం దారుణమన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తక్షణం బృందాన్ని పంపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ హామీ ఇచ్చారు.