రైల్వే ప్రాజెక్టుల బాధ్యత కేంద్రానిదే

YSR Congress Party MPs On Railway projects - Sakshi

 రాష్ట్ర వాటా నిధులతో మెలికపెట్టి జాప్యం సరికాదు: వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

సాక్షి, అమరావతి, సాక్షి, విజయవాడ/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ‘రైల్వేలు లాభాపేక్షతో నడిచే వ్యాపార సంస్థ కాదు.. రాష్ట్రం వాటా నిధులు రాలేదని రైల్వే ప్రాజెక్టులను నిలుపుదల చేస్తే సహించేది లేదు. కోవిడ్‌తో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏ రాష్ట్రం కూడా తమ వాటాను పూర్తిగా సమకూర్చలేదు. అలాగని రైల్వే ప్రాజెక్టుల పనులు నిలిపివేస్తామంటే సమ్మతించేది లేదు..’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు విభజన హామీలన్నీ కచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య గురువారం విజయవాడలో పార్లమెంట్‌ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై రైల్వే శాఖ ఉదాశీన వైఖరిపై వైఎస్సార్‌ సీపీ ఎంపీలు మండిపడ్డారు. 

ప్రజల ప్రాణాల కంటే వాటాలే ముఖ్యమా?
సమావేశం ప్రారంభమైన వెంటనే విశాఖ రైల్వే జోన్‌ గురించి వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ప్రస్తావించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటులో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. అయితే ఇది తమ పరిధిలో లేదని, రైల్వే శాఖ పరిధిలోని అంశమని మాల్య తెలిపారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను వెల్లడించడం తమ బాధ్యతని, అదే విషయాన్ని రైల్వే శాఖకు గట్టిగా నివేదించాలని ఎంపీలు సూచించారు. రాష్ట్రంలో ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాల మృతుల కంటే రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. దీనిపై రాష్ట్ర వాటా నిధులు రావాల్సి ఉందని రైల్వే అధికారులు పేర్కొనడంపై ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎంపీలతో సమావేశంలో మాట్లాడుతున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య 

కోవిడ్‌ పరిస్థితులతో దేశంలో అన్ని రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిందనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం వాటా నిధులు రాలేదని ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల పనులు పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సమంజమని నిలదీశారు. ప్రజల ప్రాణాల కంటే వాటాల అంశం ముఖ్యమా? అని అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో ఆర్వోబీల నిర్మాణానికి అవసరమైన రూ.530 కోట్లను కేంద్రమే భరించేందుకు 2020 డిసెంబర్‌లో సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని అనకాపల్లి ఎంపీ సత్యవతి గుర్తు చేశారు. గుజరాత్‌ కూడా ఆర్‌వోబీల నిర్మాణానికి తమ వాటా నిధులు సమకూర్చలేదన్న విషయాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత ప్రస్తావించారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే పనులకు 2001 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సమకూర్చడం లేదనే విషయాన్ని ఎంపీ మార్గాని భరత్‌ రైల్వే అధికారులకు గుర్తు చేశారు. అతి ముఖ్యమైన ఆ రైల్వే లైను పనులను చేపట్టకుండా ఎన్నేళ్లు నిలుపుదల చేస్తారని ప్రశ్నించారు. 

పల్నాడు – ఢిల్లీ రైలు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
రైల్వే ప్రాజెక్టుల పురోగతిని గజానన్‌ మాల్యా ఎంపీలకు వివరించారు. గుంటూరు –గుంతకల్‌ డబ్లింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జయవాడ–భీమవరం, గుడివాడ–మచిలీపట్నం డబ్లింగ్‌ పనులతోపాటు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. విజయవాడ–గూడూరు మూడో లైన్‌ పనులు 30 కి.మీ. మేర పూర్తయ్యాయని, మరో 60 కి.మీ. పనులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం మార్గంలో విద్యుదీకరణ పనులు త్వరగా పూర్తి చేసి లైన్‌ను ప్రారంభించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. నల్లపాడు – పగిడిపల్లి మధ్య డబుల్‌ లైన్‌ చేయాలని, మాచర్ల, రేపల్లెలో పిట్‌లైన్స్, మెయింట్‌నెన్స్‌ కోసం వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. మిర్చి, పత్తి తదితర వాణిజ్య పంటలకు కేంద్రంగా, పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న పల్నాడు నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రైలు సదుపాయం కల్పించేలా కృషి చేయాలన్నారు. గుంటూరు నుంచి న్యూఢిల్లీకి అన్ని తరగతుల రైళ్లు ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చింతా అనూరాధ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, ఎస్‌.సంజీవ్‌ కుమార్, పి.బ్రహ్మానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, విజయవాడ డీఆర్‌ఎం షీలేంద్రమోహన్, గుంటూరు, గుంతకల్లు డివిజన్‌ అధికారులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తాం: వైఎస్సార్‌సీపీ ఎంపీలు
రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల అంశాన్ని సాకుగా చూపిస్తూ రైల్వే ప్రాజెక్టులను ఆలస్యం చేస్తే సమ్మతించేది లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. విజయవాడలో రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ విప్‌ మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని కోరామన్నారు. రెండున్నరేళ్లుగా రైల్వే ప్రాజెక్టుల గురించి పట్టుబడుతున్నా కాలయాపన చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులపై పంపిన ప్రతిపాదనలపై రైల్వే శాఖ అధికారుల స్పందన ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు త్వరలోనే విడుదల చేస్తుందని, ఈలోగా పనులు ప్రారంభించాలని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ తెలిపారు. ఆర్వోబీల నిర్మాణంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ వంగా గీత విమర్శించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top