
సాక్షి, అమరావతి : వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తండ్రి బాటలోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ధర్మాన మండిపడ్డారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్ జగన్ శ్రమిస్తున్నారన్నారు. తండ్రి అడుగుజాడల్లో వైఎస్ జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
వైఎస్సార్ ఆశయాలు ఎప్పటికీ పదిలం: మంత్రి బొత్స
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన గొప్ప నాయకుడు రాజశేఖరరెడ్డి.. అందుకే ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. 'ఆంధ్రప్రదేశ్ పరిపాలన చరిత్రలో రాజశేఖర రెడ్డి ఒక మైలు రాయి. ఎల్లప్పుడూ పేదలకు ఎలా సహాయం చేయాలని ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం' అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.