తెనాలి: జాన్‌ విక్టర్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Tenali Tour: YSRCP Chief Console John Victor Family Updates | Sakshi
Sakshi News home page

తెనాలి: జాన్‌ విక్టర్‌ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jun 3 2025 9:51 AM | Updated on Jun 3 2025 2:03 PM

YS Jagan Tenali Tour: YSRCP Chief Console John Victor Family Updates

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. అక్కడి పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల్లో ఒకడైన జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తమ కొడుకును పోలీసులు ఎంతగా హింసించింది ఫొటోలు, ఆస్పత్రి రిపోర్టులతో జగన్‌కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా.. వైఎస్సార్‌సీపీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.  అంతకు ముందు..

జగన్‌ రాక సందర్భంగా తెనాలిలో అభిమానం పోటెత్తింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్‌ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. తెనాలి రోడ్డు కిక్కిరిసిపోగా.. ఈ సందోహం నడుమ వాహనం నుంచి ఆయన బయటకు వచ్చి అభివాదం చేశారు. ఆపై యువకులు, మహిళలతో కలిసి ఆయన కాన్వాయ్‌ నెమ్మదిగా ముందుకు కదిలింది.

తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై అతి చేష్టలకు దిగిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరు యువకులపై బహిరంగంగా ఖాకీలు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించగా.. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. పైగా పోలీస్‌ కానిస్టేబుల్‌పై హత్యాయత్నం చేశారని, గంజాయి బ్యాచ్‌ అంటూ రివర్స్‌లో ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై  దళిత, మైనారిటీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బాధిత యువకుల్లో జాన్‌ విక్టర్‌ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని బాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా ఇవ్వనున్నారు.

అన్నం పెట్టకుండా హింసించారు
తమ కొడుకు విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని జాన్‌ విక్టర్‌ తల్లిదండ్రులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. ‘‘పోలీసులు ఇంత రాక్షసత్వంగా వ్యవహరిస్తారని ఊహించలేదు. అరెస్ట్‌ చేస్తే చట్టపరంగా యాక్షన్‌ తీసుకోవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్‌గా కొడతారా?. అన్నం కూడా పెట్టకుండా మూడు రోజులు చిత్రహింసలు పెడతారా?. స్టేషన్‌కు వెళ్తే కనీసం అతన్ని చూడనివ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

LIVE: జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

 

Advertisement
 
Advertisement
Advertisement