వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర

YS Jagan Released YSR Vahana Mitra Scheme Funds To Beneficiaries Accounts - Sakshi

సాక్షి, అమరావతి: మూడో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి సుమారు 2.48 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా రూ.248.47 కోట్లు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
ఇచ్చిన మాటకు కట్టుబడి..
ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. వరుసగా మూడో సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్‌కు మంచి చేసే కార్యక్రమమిది. సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లగా ప్రతిరోజూ సేవలందిస్తూ, రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్ధానాలకు చేరుస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ కూడా  3,648 కిలోమీటర్ల సాగిన నా పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న ఒక మాటిచ్చాను.

ఆ రోజు వాళ్లు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వంలో బాదుడు ఎక్కువ అయింది, ఫెనాల్టీలు ఎక్కువ ఉన్నాయని మొరపెట్టుకున్నారు. ఫెనాల్టీలు కట్టకపోతే ఆటో తిరగదని, రోజుకు రూ.50 ఫెనాల్టీ వేస్తున్నారని ఆవేదన చెందారు. ఇన్సూరెన్స్‌ కట్టాలంటే దాదాపు రూ.7500 అవుతుందని చెప్పారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ రావాలి, అది కావాలంటే రిఫేర్లు చేయించాలి. అన్నీ కలిపి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతుందని, ఒకేసారి కట్టాలంటే అప్పులు తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. వారి బాధలు విన్న తర్వాత ఆ రోజు ఏలూరు సభలో మాటిచ్చాను.

వరుసగా మూడో ఏడాది..
వరుసగా మూడో ఏడాది ఈ రోజు వారికిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ వైయస్సార్‌ వాహనమిత్ర సహాయాన్ని  నేరుగా బటన్‌ నొక్కి వాళ్ల అకౌంట్‌లోకి డబ్బుల ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాం.

మూడో విడతతో కలిపితే రూ.759 కోట్లు సాయం
ఈ ఏడాది 2,48,468 మంది నా అక్కచెల్లమ్మలకు, అన్నదమ్ములకు రూ.248.47 కోట్లు సహాయంగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. దీంతో ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వాహనమిత్ర పథకం ద్వారా మాత్రమే అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ .. ఈ మూడో విడత కార్యక్రమం కూడా కలుపుకుంటే అక్షరాలా రూ.759 కోట్ల రూపాయలు వాళ్ల అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఇందులో చాలా మందికి ఒక్కొక్కరికీ ఇప్పటికే రూ.30 వేల రూపాయలు సహాయం అందినట్టవుతుంది.

ఈ ఏడు కొత్తగా మరో 42,932 లబ్ధిదారులు
వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధిపొందిన అర్హులందరితో పాటు గత ఏడాది కాలంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు కూడా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10వేలు వాళ్ల అకౌంట్‌లలో కూడా జమ చేయడం జరుగుతుంది.

84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే...
ఈ రోజు వాహనమిత్ర అందుకుంటున్న వారికి ఈ పథకం ఎంత మంచి చేస్తుందంటే.. ఇందులో అంటే ఈ 2,48,468 మందిలో దాదాపు 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వారే ఉన్నారు. నిజంగా బ్రతుకులు మన కళ్ల ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలతో ఈ సంతోషాన్ని పాలుపంచుకోవడం  చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఇలా ఆటోలు, టాక్సీలు నడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు గురించి ఆలోచన చేసి వీళ్లకి మంచి చేయాలని ఆలోచన చేసిన ప్రభుత్వాలు ఈ దేశంలో ఎక్కడా లేవు. ఒక్క మన రాష్ట్రంలోనే ఇది జరుగుతుందని చెప్పి సగర్వంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లికి అన్నగా గర్వంగా తెలియజేస్తున్నాను.

ప్రయాణికుల భద్రతకూ భరోసా
ఈ రోజు మనం ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 వేల రూపాయలు ఆటో అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల చేతిలో పెడతున్నామో ఇది వాళ్లకు మాత్రమే మేలు చేస్తున్నాము అని అనుకోకూడదు. ఈ కార్యక్రమం ద్వారా వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఈ సొమ్ము భరోసాగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాహనాలకు వాహన బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌తో పాటు రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ డబ్బులు ఇస్తున్నాం. దీనివల్ల ఇన్సూరెన్స్‌ చేయించుకుంటారు. బళ్లు రిపేరు చేయించుకుంటారు, ఫిటినెస్‌ సర్టిఫికేట్‌ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులో వస్తే ఆటోలు నడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే కాకుండా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో మంచి జరుగుతుంది.

చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదనే...
ఇలా అన్ని అనుమతులు ఉండేలా, చలాన్లు కట్టే పరిస్థితి రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్ముని అందిస్తున్నాం. నిజంగా ఈ డబ్బులు ఒకేసారి కట్టుకోలేని పరిస్థితులు. ఒకేసారి ఇన్సూరెన్స్‌కు రూ.7వేలు చిల్లర, రిపేర్లకు ఇంతని, ఫిట్నెస్‌ సర్టిఫికేట్‌కి ఇంత ఆవుతుందని  చెప్పి రకరకాలుగా బాధపడుతున్నారు. ఆ పదివేలు ఒకేసారి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ కూడా ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది.

పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పళ్లున్న  చెట్టుమీదనే రాళ్లు పడతాయి అని ఒక సామెత ఉంది. అలానే మంచి చేసే మనుషుల మీదనే అడ్డగోలుగా విమర్శలు చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. 

గత ప్రభుత్వంలో పన్నుల బాదుడు
గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నుల రూపంలో ఛలాన్ల రూపంలో భారీగా వడ్డింపులు ఉండేవి. గత ప్రభుత్వంలో 2015–16లో ఆటో రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి వసూలు చేసింది రూ.7.39 కోట్లు. 2016,17లో రూ.9.68 కోట్లు. 2017–18లో రూ.10.19 కోట్లు, అలాగే 2018–19లో రూ.7.09 కోట్లు.

మన ప్రభుత్వం హయాంలో
అదే మన ప్రభుత్వంలో 2019–20లో వసూలు చేసింది రూ.68.44 లక్షలు. ఈ 68 లక్షలు కూడా కేవలం కాంపౌండింగ్‌ ఫీజు(సీఎఫ్‌)గా వసూలు చేసింది మాత్రమే. 2020–21లో సీఎఫ్‌గా వసూలు చేసింది కేవలం రూ.35 లక్షలు మాత్రమే. అంటే దీని అర్ధం ఏమిటో ఆటోలు నడుపుకుంటున్న అన్నలకు, అక్కచెల్లెమ్మలకు బాగా తెలుసు. 

95 శాతం హామీలు అమలు చేశాం...
ఎక్కడా దౌర్జన్యం లేదు, జులుం లేదు, ఎక్కడా ఆక్రందన లేదు. మానవత్వంతో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అన్నకు, తమ్ముడుకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంటే... దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసామంటే.. వాళ్లు మనం చేసిన 95 అన్యాయాలు అని ప్రచురించారు. అందులో ఇది ఒకటి. వాళ్లు ఆటోలపై పన్నులు బాదితే, మనం వచ్చిన తర్వాత బాదుడు తగ్గించాం. ఒకవైపు రూ.10 వేలు మనం ఇస్తుంటే... ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా మనం పన్నులు బాదాం అని అబద్దాలు ఆడుతున్నారు. ఇలాంటి విషయాలు విన్నప్పుడు నవ్వాలో బాధపడాలో అర్ధంకాదు. జరుగుతున్న విషయాలు అన్నీ మీకు తెలుసు.

వివక్షకు తావులేకుండా...
ఈ రోజు 2.48 లక్షల మందికి అందిస్తున్న సహాయంలో ఎక్కడా ఎలాంటి వివక్ష, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాం. లిస్టులన్నీ గ్రామ సచివాలయంలో డిస్‌ప్లే చేశాం. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి ఈ పథకం ద్వారా ఎవరికైనా లబ్ధి జరగకపోతే ఈ రోజుకి కూడా ఆందోళనపడాల్సిన పనిలేదు. 

ఇది మీ అన్న ప్రభుత్వం
ఇది మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఈ పథకం రాకుండా పోతే  ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప, ఎలా ఎగరగొట్టాలని అని ఆలోచన చేసే ప్రభుత్వం కాదు. పారదర్శకతతో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయడంతో పాటు అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సహాయం చేశాం. 

నెల రోజుల గడువు
ఇప్పటికీ కూడా ఎవరైనా పొరపాటున మిగిలిపోయుంటే  ఏమాత్రం ఆందోళన చెందవద్దు. ఇంకో నెలపాటు గడువు ఇస్తున్నాను. మీరు అర్హులై ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు పెట్టండి. వలంటీర్ల సహాయ, సహకారాలు తీసుకొండి. నెలరోజుల పాటు గడువు ఇస్తున్నాను. మీరు పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సహాయం అందేటట్టు చేస్తాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే... 9154294326 నెంబరుకు ఫోన్‌ చేసి కనుక్కొండి. లేదా 1902 నెంబరుఅందుబాటులో ఉంది. మీకేమైనా సందేహాలుంటే మీరు తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ కార్యక్రమం బాగా జరిపించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. వీరు మీకు తోడుగా ఉంటారు. 

చివరగా..
చివరగా ఒక్క మాట.. అందరూ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించండి అని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆటోలు, టాక్సీలు ఇప్పుడిచ్చే ఈ సహాయంతో మీ వాహనాలను కండిషన్‌లో పెట్టుకొండి. దయచేసి ఎవ్వరూ కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దు అని మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరికీ మరొక్కసారి మనవి చేస్తున్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు బాగుండాలని, దేవుడి దయ ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం, మనందరి రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నానంటూ  సీఎం వైఎస్ జగన్‌ తన ప్రసంగం ముగించారు. 

ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌) కె.నారాయణస్వామి, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయలు, ఇతర ఉన్నతాధికారులు, వాహనమిత్ర లబ్ధిదారులు హాజరయ్యారు.

చదవండి: వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top