అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan Mohan Reddy to Visit Chittoor Assurance for mango farmers | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన

Jul 9 2025 5:26 AM | Updated on Jul 9 2025 7:22 AM

YS Jagan Mohan Reddy to Visit Chittoor Assurance for mango farmers

పోలీస్‌ ఆంక్షల వలయంలో బంగారుపాళెం మార్కెట్‌ యార్డు

వందల మందికి నోటీసులు.. రౌడీషీట్లు తెరుస్తామంటూ బెదిరింపులు 

రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరికలు 

రాత్రికి రాత్రే వైఎస్సార్‌సీపీ కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఖాకీలు 

ఏడాదిగా ఏ పంటకూ ‘మద్దతు’ లేదు 

మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం?.. మండిపడుతున్న రైతులు

నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన.. మామిడి రైతన్నలకు భరోసా  

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతు­న్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. 

అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్‌ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.

కూటమి నేతల బెదిరింపులు...
దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపా­ళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. 

ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరో­వైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగ­ట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. 

కొందరు పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఫోన్‌ చేసి వైఎస్‌ జగన్‌ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం.  వైఎస్‌ జగన్‌ బంగారు­పాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద  కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా మార్కెట్‌ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. 

ఎన్ని ఆటంకాలు సృష్టించినా...
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. 

ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మంది, మార్కెట్‌ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. 



వైఎస్‌ జగన్‌ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్‌కు వైఎస్‌ జగన్‌ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్‌ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. 

బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్‌కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్‌ జగన్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.

నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా... 
మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.

కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసన
బంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. 

అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్‌ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement