
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న వచ్చిందని పేర్కొంటూ ఈ సారి కాస్త ముందుగానే వెలువడే అవకాశం ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలతో మమేకమవుతున్నామని, 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలను సమన్వయం చేసుకుంటూ ఇకపై మరింత ఉద్ధృతంగా జనంలోకి వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు.
శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సందర్భంగా అజెండా అంశాలపై చర్చ ముగిశాక అధికారులు ని ్రష్కమించారు. తర్వాత సమకాలీన రాజకీయ పరిస్థితులపై సీఎం జగన్ మంత్రులతో చర్చించారు. నాలుగున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సాకారమైన విప్లవాత్మక మార్పులను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించాలన్నారు.
వరుస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి..
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా పాల్గొనాలని సీఎం జగన్ సూచించారు. వృద్ధాప్య పింఛన్ రూ.2,000 వేల నుంచి రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జనవరి 1 నుంచి రూ.3 వేలకు పెంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనవరి 8 వరకూ నిర్వహిస్తామని, అందులో విస్తృతంగా పాల్గొనాలని సూచించారు.
జనవరి 10 నుంచి 23 వరకూ వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద మహిళా సంఘాలకు నిధుల జమ కార్యక్రమంతో పాటు వైఎస్సార్ చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో నిధుల జమ కార్యక్రమాన్ని జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నిర్వహిస్తున్నామని, అందులో విస్తృతంగా పాల్గొనాలని ఆదేశించారు. నాలుగున్నరేళ్లుగా మనం చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ, ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ, జనసేన చేస్తున్న దు్రష్ఫచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని మార్గనిర్దేశం చేశారు.