నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు విశేష స్పందన
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల చరిత్రాత్మక ఉద్యమం
విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం
ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను స్పష్టంగా వ్యక్త పరిచారు
స్వలాభం కోసం కాకుండా సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు
అడ్డంకులు ఎదురైనా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు
ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది.. చంద్రబాబూ..
ఇకనైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి
ర్యాలీలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు, విద్యార్థులతో కలిసి వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, భావసారూప్య పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది ప్రజా విజయం అని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
» వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళమెత్తారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల ద్వారా ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్త పరిచారు. ర్యాలీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం.
ఆ సంకల్పంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలందరితోపాటు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థలు, మిత్రపక్షాలు.. వివిధ ప్రజా సంఘాలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ప్రజల నిబద్ధతను, సామాజిక న్యాయంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజలు స్వలాభం కోసం కాకుండా, సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు.
» తమ బాధ్యత మరిచి, ప్రభుత్వ పెద్దల మాటలు మాత్రమే వింటున్న పోలీసులు నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎక్కడా ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ధైర్యంగా, శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. బలవంతంగా ప్రజల గొంతు నొక్కలేమని ప్రజా ఉద్యమ ర్యాలీ మరోసారి నిరూపించింది.
» చంద్రబాబు గారూ.. ఇకనైనా ప్రజల మనోభావాలు గుర్తించి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ప్రజల సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ చారిత్రక ఉద్యమాన్ని విజయవంతం చేసిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.


