చంద్రబాబుపై తీవ్రస్థాయిలో జగన్ ధ్వజం
వైఎస్సార్సీపీ అభ్యర్థులకు బెదిరింపులు, ముందస్తు అరెస్టులు
వైఎస్సార్సీపీ నాయకుల గృహనిర్బంధం.. అడ్డంకులు
నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ మూకల దౌర్జన్యాలు..
పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాల చింపివేత
బాధితులనే బయటకు నెట్టేస్తున్న పోలీసులు
దాడులకు పాల్పడిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు
స్క్రూటినీ పేరుతో నామినేషన్ల తిరస్కరణ..
సంతకాల ఫోర్జరీతో ఉపసంహరణలుగా చిత్రీకరణ
మహిళలపై దారుణాలు.. జుట్టు పట్టుకుని లాగడం, చీరలు లాగేయడం
నామినేషన్ల అడ్డగింత ఒకవైపు.. ఫేక్ నామినేషన్లతో సంఖ్య పెంపు మరోవైపు
సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు గ్యాంగ్ కుట్ర
పోలీసుల పక్షపాతంపై విచారణ జరపాలి.. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి
అభ్యర్థుల నామినేషన్ హక్కును కాపాడాలి.. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాలి
సాక్షి, అమరావతి: నామినేషన్లకు అడ్డంకులు.. నాయకుల గృహనిర్బంధాలు.. పత్రాల చింపివేత.. దాడులు.. అక్రమ కేసులు.. సంతకాల ఫోర్జరీ.. ఫేక్ నామినేషన్లు.. బలవంతపు ఉపసంహరణలు! ఇలా స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ఎనిమిది రకాల కుట్రలకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష అభ్యర్థులను పోటీకి దూరం చేసేందుకు బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని, మహిళా అభ్యర్థులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, వైఎస్సార్సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు దాఖలు చేసి, ఎన్నికలు సజావుగా జరుగుతున్నట్లు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
‘‘అష్టకుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు’’ అంటూ చంద్రబాబు, పోలీసుల వ్యవహారశైలి, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై జగన్ ధ్వజమెత్తారు. మా హయాంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఒక్కటైనా ఇలా జరిగిందా? అంత సాఫీగా మేము ఎన్నికలు జరిపాము. అదే ఈరోజు అందుకు పూర్తి భిన్నంగా ఎన్నికలు. తొండి. అన్యాయం. దౌర్జన్యం. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలో కూడా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మాదిరిగా జరుగుతోంది. ఆ అధికారులు. ఆ పోలీసులే ఉన్నారు. మరి ఏ విధంగా నామినేషన్లు వేస్తారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే..
నామినేషన్ల పర్వంలో జరుగుతున్న దౌర్జన్యాలిలా..
(అంటూ.. అన్నీ వరసగా పేర్లు, వివరాలతో సహా వీడియోల్లో చూపారు)
» పెనుకొండలో మంత్రి సవిత ముఖ్య అనుచరుడు, టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి ఆర్వో చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశాడు.
» చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై టీడీపీ గూండాల దాడి. ఆయన కారు ధ్వంసం.
» ధర్మవరం మున్సిపాలిటీ. 32వ వార్డులో నామినేషన్ వేయడానికి వెళ్తున్న తలారి నళినిపై టీడీపీ అభ్యర్థి దాడి చేసి చీర లాగాడు.
» పలమనేరు నియోజకవర్గం, వి.కోట జెడ్పీటీసీ అభ్యర్థి జీ.వీ.ప్రకాష్‌పై దాడి. నామినేషన్ పత్రాలు చింపివేత.
» చిలకలూరిపేట. 47వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఆర్ఓ సమక్షంలోనే టీడీపీ గూండాల దాడి.
» చిత్తూరులో జెడ్పీటీసీ అభ్యర్థినిపై కె.సుష్మను అసభ్యంగా తాకి, నామినేషన్ పత్రాలు లాక్కునే ప్రయత్నం చేసిన టీడీపీ గూండాలు.

దాడుల పర్వాన్ని వివరిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
» చిత్తూరు జెడ్పీ ఆఫీస్‌లోనే జీడీ నెల్లూరు జెడ్పీటీసీ అభ్యర్థిని నిరీషాపై దాడి చేసి, నామినేషన్ పత్రాలు చింపేశారు. టీడీపీ మహిళా నేత ఆ పని చేసింది.
» జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు టీడీపీ గూండాలు బలవంతంగా లాక్కున్నారు.
» సత్యసాయి జిల్లా తాడిమర్రిలో మండల నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు వారిని కొట్టారు. 9 నెలల గర్భిణీ అని కూడా చూడలేదు.
» కడప జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్థి భారతి నామినేషన్‌ను టీడీపీ గూండాలు చింపేశారు.
» కనిగిరిలో మా ఎంపీటీసీ అభ్యర్థిని పోలు వరలక్ష్మి చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేశారు.
» కడప జిల్లా చాపాడు మండలంలో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చిన 9 నెలల గర్భిణీ ప్రశాంతిపై దాడి చేసిన టీడీపీ మూకలు నామినేషన్ పత్రాలు లాక్కున్నాయి.
» నర్సారావుపేటలో, పిడుగురాళ్ల జెడ్పీటీసీ అభ్యర్థి భారతి భర్త, పెద్ద లక్ష్మారెడ్డిపై దారుణంగా దాడి చేశారు.
» కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఇంట్లో ఉన్న మా పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వినోద్‌ను దుస్తులు చింపి, దారుణంగా కొట్టిన ఎస్ఐ విజయ్.
» కనిగిరిలో 18వ వార్డు అభ్యర్థి సమీర నామినేషన్ వేయనివ్వాలంటూ పోలీసుల కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించలేదు.
» దాచేపల్లిలో మా పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పద్మావతి చీర లాగేందుకు టీడీపీ మహిళలు ప్రయత్నించారు. 10 మంది ఆ పని చేశారు. ఇదంతా నర్సారావుపేటలో జరిగింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు.
» పుంగనూరులో వార్డు నెం.1లో ఎస్సీ మహిళ కమలమ్మ చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు దౌర్జన్యంగా లాక్కున్నారు.
» జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా నామినేషన్ వేయడానికి బయలుదేరిన ఇందిరమ్మను పోలీసులు తుపాకీ చూపించి బెదిరించారు.
» కడప వైఎస్సార్సీపీ ఆఫీస్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన ఎంపీ అన్న కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఆయన్ను ఒక తీవ్రవాది మాదిరిగా చూశారు. అలా అక్రమంగా అరెస్టు చేశారు.
» తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరులు అమానవీయ ప్రవర్తన. ఒక మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా, దాడి చేసి అమానవీయ ప్రవర్తన.
» తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి ఎస్సీ మహిళ శారద సీఐ కాళ్లు పట్టుకుంది. నామినేషన్ వేయనివ్వాలని వేడుకుంది.
»నగరి మున్సిపల్ చైర్పర్సన్ బాలకృష్ణ, నామినేషన్ తొలుత ఓకే అన్నారు. అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత తుది జాబితాలో టీడీపీ అభ్యర్థి పేరు మాత్రమే ఉంది.
సుప్రీంకోర్టును ఏమార్చేందుకు ఫేక్ నామినేషన్లు దాఖలు
చంద్రబాబు కుట్రల్లో పరాకాష్ట.. మా పార్టీ పేరుతో వారే దొంగ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అలా సంఖ్యను పెంచి చూపి, రాష్ట్రంలో అంతా శాంతియుతంగానే జరుగుతోందని కోర్టులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ డేటా చూస్తే, అది మీకు అర్ధమవుతుంది. ‘ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నామినేషన్ల అసాధారణ పెరుగుదల’ (ఎక్స్పొనెన్షియల్ సర్జ్ ఇన్ వైఎస్సార్సీపీ నామినేషన్స్) కనిపిస్తుంది. రాష్ట్రంలో 9,829 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరుగుతుంటే, ఈనెల 21 నాటికి, అంటే బుధవారం నాటికి వైఎస్సార్సీపీ పక్షాన కేవలం 1,918 నామినేషన్లు మాత్రమే దాఖలైతే ఆ మర్నాడు, అంటే 22వ తేదీ గురువారం నాటికి వాటి సంఖ్య ఏకంగా 10,501 కి పెరిగినట్లు చూపిస్తున్నారు.

ఫేక్ నామినేషన్ల వివరాలు వెల్లడిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్
అంటే ఒక్కరోజులోనే వైఎస్సార్సీపీ నామినేషన్ల దాఖలులో 547% పెరుగుదల చూపించారు. అలాగే 659 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరుగుతుంటే, ఈనెల 21 నాటికి వైఎస్సార్సీపీ పక్షాన దాఖలైన నామినేషన్లు కేవలం 192 మాత్రమే. ఆ మర్నాడు, అంటే 22వ తేదీ నాటికి వాటి సంఖ్య ఏకంగా 900 కి పెరిగింది. అంటే ఒక్కరోజులోనే వైఎస్సార్సీపీ నామినేషన్ల దాఖలులో 468% పెరుగుదల చూపించారు. ఒకవైపు ఎక్కడికక్కడ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. మండల కేంద్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ అదే మాదిరిగా ఉంది. కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ డేటా చూస్తే.. ఆ స్థాయిలో మా పార్టీ నామినేషన్లు పెరిగాయి!. అంటే వైఎస్సార్సీపీ పేరుతో వెన్నుపోటు పార్టీ వారే ఫేక్ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
(ఇవీ కొన్ని వివరాలు అంటూ ఆధారాలతో సహా పీపీటీలో చూపారు).
» ఇది కొండాపురం మండలం కొండాపురంలో14, 15, 16, 17, 18 వార్డులు. అన్నీ ఫేక్ నామినేషన్లు. వైఎస్సార్సీపీ పేరుతో వెన్నుపోటు పార్టీ వారే వేశారు.
» మైలవరం మండలం దొమ్మల నంద్యాల. అక్కడ సిలివేరు లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ సిలివేరు గోపాలకష్ణ పేరుతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అంటూ నామినేషన్. ఆమె మా పార్టీ అభ్యర్థిని కాదు.
» పులివెందుల నియోజకవర్గం, వేముల మండలంలో లోకేపల్లి మల్లికార్జునరెడ్డి, ఎస్.లక్ష్మీదేవి పేరుతో, వారు వైఎస్సార్సీపీ పక్షాన వేశారంటూ, ఫేక్ నామినేషన్లు దాఖలు చేశారు.
కుట్రలు, కుతంత్రాలకు పితామహుడు చంద్రబాబు
ఈ కుట్రలకు నిజంగా పితామహుడు చంద్రబాబే. ఆయన ఇంత దారుణమైన ఎత్తుగడ ఎందుకు వేశాడంటే, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ సజావుగా సాగుతున్నాయని సుప్రీంకోర్టుకు ఒక భ్రమ కల్పించే కుట్రకు తెగబడ్డాడు. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లలో వెన్నుపోటు పార్టీ వారే, మా వైఎస్సార్సీపీ తరపున ఫేక్ నామినేషన్లు వేయిస్తున్నారు. అందుకే ఒక్క రోజులోనే ఎంపీటీసీ నామినేషన్లలో 547%, జెడ్పీటీసీ నామినేషన్లలో 468% పెరుగుదల చూపించారు.
ఇటు చూస్తే, మండల, జిల్లా కేంద్రాల్లోనూ మా వాళ్ళని అడ్డుకుంటూ నామినేషన్లను వేయనీయకుండా కుట్ర చేస్తున్నారు. అటు మా పార్టీ పేరుతో వాళ్లే ఫేక్ నామినేషన్లు వేస్తున్నారు. ఆ నామినేషన్లలో ఎక్కడా ఎ–ఫామ్స్, బీ–ఫామ్స్ ఉండవు. వారంతట వారే వైఎస్సార్సీపీ అని చెప్పుకోవడం, నామినేషన్ వేయడం, అదే ఎన్నికల కమిషన్ డేటాలో చేర్చడం.. అంతా కుట్రలో భాగంగా జరుగుతోంది.’’ అని జగన్ వివరించారు.
ఇవీ అష్టకుట్రలు
చంద్రబాబు, ఆయన గ్యాంగ్ కలిసి, ఈ స్థానిక ఎన్నికల్లో చేసిన 8 కుట్రలు ఇలా ఉన్నాయి..
కుట్ర–1
నామినేషన్ వేయకముందే, వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వారికి బెదిరింపులు. కుట్రలో భాగంగా, అభ్యర్థులు, వారికి సహకరించే వారిని బెదిరించడం. బైండోవర్ చేయడం. ముందస్తు అరెస్టులు చేయడం.
కుట్ర–2
నాయకుల గృహ నిర్భంధం. నామినేషన్ల ప్రక్రియ అంతా మీరు గమనించండి. ఎక్కడా అభ్యర్థులకు తోడుగా నాయకులను వెళ్లనీయడం లేదు.
కుట్ర–3
నామినేషన్ కేంద్రాలు స్వాధీనం చేసుకుని, ప్రతిపక్ష అభ్యర్థులు లోపలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మా పార్టీ అభ్యర్థులు ఎలాగోలా నామినేషన్ కేంద్రాలకు వెళ్లే సరికే అక్కడ టీడీపీ వారు మారణాయుధాలతో ఉంటారు. అక్కడ ఉన్న పోలీసులు వారికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు.
కుట్ర–4
పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు లాక్కోవడం, కొన్ని చోట్ల ఆర్వోల చేతిలో నుంచి లాక్కుని చింపడం.
కుట్ర–5
ఇన్ని జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోగా, బాధిత అభ్యర్థులను, అంటే మా పార్టీ వారినే పోలీసులు బయటకు నెట్టేస్తారు. నామినేషన్ వేయడానికి అభ్యర్థి కాకుండా, కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తున్నారు. నామినేషన్ కేంద్రం గేటు, ఎక్కడో దూరంగా ఉంటుంది. అక్కణ్నుంచి వారు లోపలికి నడిచి వెళ్తుండగానే అడ్డుకోవడం. నామినేషన్ పత్రాలు లాక్కోవడం చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగమణి సంతకాన్ని ఫోర్జరీ చేసి టీడీపీ అభ్యర్థి విజయ ఎన్నికైనట్టు ప్రకటన
కుట్ర–6
దాడి చేసిన వారిని పూర్తిగా వదిలేసి, దాడులకు గురైన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. అలా కేవలం మా వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు, వారితో ఉంటున్న మా పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలా వారిని ఇంటికే పరిమితి చేయడం. లేదంటే జైలుకు పంపడం చేస్తున్నారు.
కుట్ర–7
స్క్రూటినీ పేరుతో నామినేషన్ల తిరస్కరణ. ఆ సమయంలో అభ్యర్థులను ఆఫీసులకు రానివ్వకుండా, ఇష్టానుసారం చేస్తున్నారు. కొన్ని చోట్ల వారే కొన్ని పేపర్లు చింపేయడం. కొన్ని చోట్ల అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి, విత్‌డ్రా చేసుకున్నట్లు చెప్పడం జరుగుతోంది.
ఉదా: నంద్యాల మున్సిపాలిటీ. 51వ వార్డు అభ్యర్థి నాగమణి. ఆమె స్క్రూటినీకి హాజరు కాగా, ఆమె నామినేషన్ ఓకే చేశారు. ఆ తర్వాత ఆమె సంతకం ఫోర్జరీ చేసి, ఆమె విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు.
(అంటూ ఆ వివరాలు చూపడంతో పాటు, ఆమెను స్వయంగా మీడియాకు చూపారు)
» అలా నాగమణి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆమె విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించి, ఆ వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు.
» ఆ తర్వాత నగరి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బాలకృష్ణ విషయంలో కూడా చేశారు. తొలుత ఆయన నామినేషన్ ఆమోదించినట్లు చెప్పారు. తుది జాబితాలో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.
కుట్ర–8
అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి, లోబర్చుకుని నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేయడం.
మహిళలపై నిర్దాక్షిణ్యంగా దాడులు
అత్యంత దారుణ విషయం ఏమిటంటే.. దాడులకు ఎక్కువగా గురైంది మహిళలే. ఎందుకంటే వారికి 50 శాతం రిజర్వేషన్లు. దాన్ని తీసుకొచ్చింది మనమే. నాడు మన హయాంలో మహిళలు వర్థిల్లారు. అదే ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని వారంతా దాడికి గురవుతున్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగితే డివిజన్లలో కార్పొరేటర్లు మొదలు, గ్రామస్థాయిలో వార్డు సభ్యుల వరకు దాదాపు 80 వేల మంది మహిళలు ఎన్నికవుతారు.అందులో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ పదవుల్లో 7,216 మంది మహిళలు ఎన్నికవుతారు.

మరి ఇన్ని వేల మంది మహిళలు నామినేషన్లు వేయడానికి వస్తే, వారి జుట్టు పట్టుకోవడం, చీరలు లాగేయడం, వారిని తిట్టి కొట్టి దాడులు చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను. చంద్రబాబు అనేవాడు అసలు మనిషేనా? మహిళలపై దాడులు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, ఆ పని చేస్తున్న ఆయన పార్టీ గూండాలు, మరోవైపు ప్రత్యక్షంగా దీన్ని చూస్తూ ఊరుకుంటున్న పోలీసు అధికారులు, ఎస్ఈసీ.. చేస్తోంది ధర్మమేనా?.


