రాష్ట్ర ఖజానా నుంచి తీర్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే
2026–27 బడ్జెట్‌లో రూ.836.26 కోట్లు కేటాయింపు
ఇప్పటికే రూ.421.99 కోట్లు చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ బూటకమేనని మరోసారి రుజువైంది. అమరావతి నిర్మాణ పనుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.194.33 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ఖజానా నుంచి ఈ అప్పు తీర్చేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనుల కోసం సీఆర్‌డీఏ చేసిన అప్పులు తీర్చేందుకు 2026–27 బడ్జెట్‌లో రూ.836.26 కోట్లు కేటాయించారు. ఇందులో రెండు త్రైమాసికాలకు సంబంధించి ఇప్పటికే రూ.421.99 కోట్లను రాష్ట్ర ఖజానా నుంచి రాజధాని అప్పు తీర్చేందుకు ఇచ్చారు.
ప్రజలు కట్టే పన్నుల నుంచే..!: రాజధాని పనులకు బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా కేటాయించడం లేదని సీఎం చంద్రబాబు పదే పదే నమ్మబలుకుతూ వస్తున్నారు. రాజధాని కోసం చేస్తున్న అప్పులన్నీ అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూమిని అమ్మి తీర్చుతామని.. పైసా భారం కూడా ప్రజలపై పడదని.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ మభ్యపెడుతున్నారు. ఇందులో డొల్లతనం తాజాగా మరోసారి నిరూపితమైంది. రాజధాని పనుల కోసం 2014–19 మధ్య జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బాండ్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు రూ.5,013.60 కోట్ల మేర అప్పులు తెచ్చారు.
ఇక 2024 జూన్ 12 నుంచి ఇప్పటివరకూ రాజధాని పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో, బ్యాంకుల నుంచి ఇప్పటికే రూ.47,687 కోట్లు అప్పు చేశారు. 2014–19 మధ్య చేసిన అప్పులు తీర్చడానికి చంద్రబాబు సర్కార్ 2026–27 బడ్జెట్‌లో రూ.836.26 కోట్లు కేటాయించింది. అంటే.. రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పులన్నీ వడ్డీతో కలిపి రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుంచే చెల్లించాల్సిందేనని స్పష్టమవుతోంది.


