AP: ముంచుకొస్తున్న'అర్ణబ్‌' తుపాను | Heavy rain forecast in Coastal and Rayalaseema districts | Sakshi
Sakshi News home page

AP: ముంచుకొస్తున్న'అర్ణబ్‌' తుపాను

Oct 24 2026 4:54 AM | Updated on Oct 24 2026 4:54 AM

Heavy rain forecast in Coastal and Rayalaseema districts

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 

26 నాటికి తుపానుగా మారే అవకాశం

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు  

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు 

నేటి నుంచి 2 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఆదివారానికి వాయుగుండంగా, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి అర్ణబ్‌ అని పేరు పెడతారు. తుపానుగా మారిన తర్వాత ఇది ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలి విశాఖ పరిసరాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

దీని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై ఎక్కువగా కోస్తా జిల్లాలపై ఓ మోస్తరుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకూ విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం ఆవర్తనంగానే కొనసాగుతోంది. అది బలహీనపడితే అర్ణబ్‌ తుపాను ఇంకా బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఒకవేళ అది అలాగే కొనసాగితే అర్ణబ్‌ తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం తగ్గుతుందని వెల్లడించారు.

వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే జిల్లాలు..
దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. శనివారం అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో .. ఆదివారం అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. సోమవారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

27, 28 తేదీల్లో..  
27న విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. బుధవారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మ­న్యం, విజయనగరం, విశా­ఖ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా­ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.కాగా, శుక్రవారం కర్నూలు జిల్లా దూదెకొండలో 6.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది.

తాడికొండలో భారీ వర్షం
అమరావతికి నిలిచిన రాకపోకలు
తాడికొండ: తాడికొండలో శుక్రవారం భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి పొర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనాలు అవస్థలు పడ్డారు. తాడికొండ నుంచి తుళ్లూరు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 4 గంటలు అమరావతికి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చే విద్యార్థులు, చిన్నారులు ఇంటికి వెళ్లేందుకు తల్లిదండ్రులకు ఫోన్‌లు చేసి పిలిపించుకొని వర్షం, వరద నీటిలో నడిచి వెళ్లారు. తాడికొండ నుండి తుళ్లూరు వరకు అధ్వాన్నంగా ఉన్న రహదారిని గతేడాది పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించి మరమ్మతులు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అది అమలుకు నోచలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement