గడువును కనీసం 48 గంటలు పొడిగించేలా ఎస్‌ఈసీని ఆదేశించండి
హైకోర్టులో వైఎస్సార్‌సీపీ అత్యవసర పిటిషన్
అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారు
నామినేషన్లు దాఖలు చేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారు
ఎన్నికల సంఘం విధి నిర్వహణలో దారుణంగా విఫలమైంది
నామినేషన్ల కోసం కూడా న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది
దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్
దాడులు, బెదిరింపులు తదితరాలపై కేసుల నమోదుకు ఆదేశాలివ్వాలని వినతి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అటు అధికార పార్టీ నేతలు, ఇటు పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మరోసారి న్యాయ పోరాటానికి దిగింది. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకున్న జిల్లాల్లో నామినేషన్ల గడువును కనీసం 48 గంటలు పొడిగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
అంతేకాక దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసానికి పాల్పడిన వారిపై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వెంటనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అంతక్రితం వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ‘ఇక ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం తన విధి నిర్వహణలో దారుణంగా విఫలమైంది. ఎన్నికల సంఘం సక్రమంగా విధులు నిర్వర్తిస్తే మేము కోర్టుకు రావాల్సిన పని లేదు.
నామినేషన్లు దాఖలు చేసే విషయంలో న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికార పార్టీ నేతలు ఇతర వ్యక్తులతో ఉపసంహరింపజేసిన ఘటనలూ ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ బరి తెగించి వ్యవహరిస్తోంది’ అని కోర్టుకు వివరించారు.
పోలీసులు కోర్టుకు ‘దృశ్యం–3’ సినిమా చూపిస్తున్నారు
అధికార పార్టీ నేతలతో పోలీసులు కుమ్మక్కై నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు పక్షపాత వైఖరితో అధికార పార్టీకి అనుకూలంగా చేయాల్సిందంతా చేస్తూ, తమకేమీ తెలియదని కోర్టుకు చెబుతున్నారు. కోర్టుకు ‘దృశ్యం–3’ సినిమా చూపిస్తున్నారు. – వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్ వాదనలు


