సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా, పులివెందుల డీఎస్‌పీ మురళీ నాయక్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తెలపడంతో, ఈ నిర్ణయానికి గల కారణాలను అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చింతలపూడి పురుషోత్తంకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మురళీనాయక్ డీఎస్‌పీగా ఉంటే స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశమే లేనందున, ఆయనను బదిలీ చేయాలని కోరుతూ ఈ నెల 19న సమర్పించిన వినతిపత్రంపై ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతూ డీఎస్‌పీ ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్ అవినాష్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. 2025 ఆగస్టు 12 న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమయంలోనూ నాయక్ అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించారని వైఎస్ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి హైకోర్టుకు విన్నవించారు. డీఎస్‌పీని ఎన్నికల విధుల నుంచి తప్పించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. విచారణ క్రమంలో తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నర్సీపట్నం అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని, దానిని పరిశీలించిన అనంతరం నాయక్‌ను తొలగించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపారు.


