ఎవరిని మభ్యపెట్టడానికి ఈ నాటకాలు? | Jana Sena party is shocked by the behavior of TDP and Jana Sena key leaders | Sakshi
Sakshi News home page

ఎవరిని మభ్యపెట్టడానికి ఈ నాటకాలు?

Oct 24 2026 5:06 AM | Updated on Oct 24 2026 5:06 AM

Jana Sena party is shocked by the behavior of TDP and Jana Sena key leaders

జెడ్పీ, ఎంపీటీసీ స్థానాల కోసం.. నామినేషన్ల గడువు ముగిసేటప్పుడు చర్చలా?  

ఈ దశలో టీడీపీ ఇచ్చేదేంటి.. జనసేన తీసుకునేదేంటి?  

ఇలాంటివి నోటిఫికేషన్‌కు ముందో.. నోటిఫికేషన్‌ వెలువడ్డాకో జరగాలి  

టీడీపీ, జనసేన ముఖ్య నేతల తీరుపై జనసేన పార్టీలో విస్మయం   

జనసేన నేతలపై దాడుల ప్రస్తావనే లేకుండా చర్చలేంటని ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం  

సాక్షి, అమరావతి : ‘ఇంకో 15–20 ఏళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి. మనం ఒంటరిగా పోటీ చేసి గెలవలేం. నిజానికి మనకు అంత బలం లేదు’ అని పదే పదే శ్రేణులకు ఉద్బోధించే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కసరత్తు చేస్తుండటం అటు జనసేన, ఇటు టీడీపీ శ్రేణుల్లో నవ్వులపాలవుతోంది. మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే పరిషత్‌ ఎన్నికల్లోనూ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు రసకందాయంలో పడింది. జనసేన కార్యకర్తలను శాంతింపజేసేందుకు 40 శాతం వాటా అడిగినట్లు హడావుడి చేసి చివరికి టీడీపీ ఇచ్చిన వాటితో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ శుక్రవారం మళ్లీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ సుమారు అరగంటపాటు చర్చించారు. ఇదే అంశంపై గురువారం కూడా వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యారు. రెండ్రోజుల్లో రెండుసార్లు సమావేశమైనా పంపకాలపై స్పష్టత రాలేదని లీకులు ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ తమకు 30 శాతం కేటాయించాలని జనసేన కోరినట్లు జనసేన నేతలు తెలిపారు. అయితే, దానిపై జిల్లా కమిటీలే నిర్ణయం తీసుకుంటాయని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌ పీఠాలపై మాత్రం పీఠముడి వీడలేదని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. 

రాష్ట్రంలోని 28 జెడ్పీల్లో తమకు ఎనిమిది చైర్మన్, ఎనిమిది వైస్‌ చైర్మన్‌ పదవులు కావాలని పవన్‌కళ్యాణ్‌ కోరినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. టీడీపీ మాత్రం మూడు మాత్రమే ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. అలాగే, బీజేపీ మూడు జెడ్పీ పీఠాలు కోరుతుండగా ఒకటి ఇస్తామన్నట్లు తెలిసింది. జనసేన తిరుపతి, ఏలూరు జెడ్పీ పీఠాలు అడుగుతుండడం, వాటిని ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేకపోవడంతో దానిపైనే చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఫైనల్‌గా పరిషత్‌ పోరులోనూ టీడీపీ ఇచ్చినన్ని తీసుకోవడానికి జనసేన సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడానికి గట్టిగా పట్టుబట్టినట్లు చూపించడానికి చర్చల పేరుతో హడావుడి చేస్తున్నట్లు సమాచారం.   

పోటాపోటీగా కూటమి పార్టీల నామినేషన్లు  
మరోవైపు.. చాలా చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ ఆశావహులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సర్దుబాటు తేలకముందే జెడ్పీటీసీ స్థానాలకు బీజేపీ నామినేషన్లు దాఖలు చేయగా, జనసేన సైతం బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. దీంతో.. పలుచోట్ల కూటమి పార్టీల అభ్యర్థులే ఒకరిపై ఒకరు పోటీపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పలు మండలాల్లో జనసేన నాయకులను టీడీపీ నేతలు నామినేషన్లు వేయనీయకపోవడం, వారిపై దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై మాట మాత్రంగా కూడా ప్రస్తావన రాలేదని జనసేన శ్రేణులు రగిలిపోతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement