ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు
ఇలాంటి క్రిమినల్స్ చేతిలో అధికారం శ్రేయస్కరం కాదు
తిరగబడండి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి
రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు
తొండి, అన్యాయం, దౌర్జన్యంతోనే స్థానిక ఎన్నికల నిర్వహణ
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబుకు, ఎస్ఈసీకి బుద్ధి రాలేదు
సాక్ష్యాధారాలతో టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశాం
ఇప్పటికీ ఏ ఒక్కరినీ సస్పెండ్ చేయలేదు.. కనీసం బదిలీ కూడా చేయలేదు
ఎస్ఈసీ, పోలీసులు, అధికారులు బాబుకు తొత్తులుగా మారిపోయారు
ఇప్పుడే ఇలా ఉంటే పోలింగ్ ముగిసే నాటికి వీళ్ల అరాచకాలు
ఏ స్థాయిలో ఉంటాయో ప్రజలే ఆలోచించాలి.. చంద్రబాబు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే ఆ పనులను చూపించి ఓట్లు అడగాలి
కానీ నేడు సూపర్ సిక్స్ లేవు.. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు.. ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోతారన్న భయంతోనే బాబు ఎన్నికలు జరగనివ్వట్లేదు
పైగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నట్లు కోర్టులను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్సీపీ తరఫున వెన్నుపోటు పార్టీ వారే ఫేక్ నామినేషన్లు వేస్తున్నారు
అందుకే ఒక్క రోజులోనే ఎంపీటీసీ నామినేషన్లలో 547 శాతం, జెడ్పీటీసీ నామినేషన్లలో 468 శాతం పెరుగుదల చూపించారు
ఇవి పార్టీపరమైన ఎన్నికలు.. మా అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా చేయడం ధర్మమేనా?
మా అభ్యర్థుల జాబితాలను హైకోర్టు, సుప్రీంకోర్టుల ముందు ఉంచుతాం
కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని న్యాయపోరాటం చేస్తాం
క్రిమినల్ మెంటాలిటీ, దిగజారుడు బుద్ధి కలిగిన చంద్రబాబు వంటి వారి చేతుల్లో అధికారం ఉంటే ప్రజలకే కాదు.. ఈ రాష్ట్రానికి కూడా గ్యారంటీ లేదు. చంద్రబాబు వ్యవస్థీకృతంగా చేస్తున్న ఈ దారుణాలను అతిపెద్ద నేరంగా పరిగణించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే చంద్రబాబు పాల్పడే కుట్రపూరిత నేరాలను ప్రోత్సహించిన వారమమవుతాం.
పార్టీ శ్రేణులకు ఒకటే చెబుతున్నా.. మీ దగ్గర ఉన్న ఆధారాలతో పార్టీ లీగల్ సెల్ ద్వారా పిటిషన్లు వేయించండి. ప్రైవేటు పిటిషన్లు వేయండి.. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు (ఎన్హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేయండి. పార్టీ డిజిటల్ బుక్‌లో నమోదు చేయండి. మనం అధికారంలోకి రాగానే ఈ ప్రతీ ఘటనలోనూ బాధ్యులపైన, ప్రతీ ఒక్కరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఇవన్నీ ఉపకరిస్తాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నో దాడులు ఎదుర్కొని గుండె నిబ్బరంతో నిలబడి ఈ దుర్మార్గులను ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులకు, వారికి తోడుగా నిలుస్తున్న నాయకులు, కార్యకర్తలకు, వారికి న్యాయపరంగా అండగా నిలుస్తున్న పార్టీ లీగల్ సెల్ విభాగానికి హ్యాట్సాప్ చెబుతున్నా.. శివంగుల్లా నిలబడి ఈ అన్యాయాన్ని ఎదురొడ్డి పోరాటం చేస్తున్న నా అక్కచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నా.
-వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి: ‘‘ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ప్రజ్వరిలి్లతే ప్రజలకు స్వేచ్ఛ ఉండదు.. ఎలాంటి హక్కులు ఉండవు. ఈరోజు నామినేషన్ పత్రాలు లాక్కొని చించేస్తున్నట్టుగానే రేపొద్దున మీ ఆస్తిపత్రాలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే లాక్కొని చించేసి మీ ఆస్తి తమదంటారు. ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తున్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ప్రతీ ఒక్కరూ తిరగబడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. లేకుంటే మీ ఆస్తులు, మీ హక్కులకే కాదు.. మీ ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండ, వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను చించేయడం, మరోవైపు యథేచ్ఛగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఎస్ఈసీ, చంద్రబాబు ప్రభుత్వ తీరును సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ నిప్పులు చెరిగారు. ‘‘స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును తప్పు బడుతూ సుప్రీంకోర్టు తీవ్రమైన మొట్టికాయలు వేసినా చంద్రబాబులో కానీ, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తీరులో కానీ ఎలాంటి మార్పు రాలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లకు మించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా టీడీపీ గూండాలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. మహిళలని కూడా చూడకుండా చీరలు లాగి దుశ్శాసనపర్వానికి పాల్పడుతున్నా పట్టించుకునే వారులేరు. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలు, వారికి సహకరిస్తున్న పోలీసులు, ఎన్నికల అధికారులపై ఎలాంటి చర్యలు తీçసుకోవడం లేదు. పైగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నట్టు కోర్టులకు భ్రమ కల్పించేలా వైఎస్సార్సీపీ తరఫున ఫేక్ నామినేషన్లు వేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
తొండి.. అన్యాయం..దౌర్జన్యం ఇదే చంద్రబాబు మార్క్ కుతంత్రం..
‘‘రాష్ట్రంలో అన్నింటా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు. అందుకే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి, ఎలాగైనా గెలిచేందుకు అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారు. ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో స్థానిక ఎన్నికల్లో అష్ట కుట్రలకు పాల్పడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం యథేచ్ఛగా బేఖాతరు చేస్తున్నారు. ఎస్ఈసీ కానీ, చంద్రబాబు ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అన్ని కుట్రలకు పితామహుడు చంద్రబాబే. ఆయన ఫోర్జరీ, మోసాలు, కుట్రలు స్థానిక ఎన్నికల్లో తారస్థాయికి చేరాయి. తొండి, అన్యాయం, దౌర్జన్యంతో స్థానిక ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా పాతర వేస్తూ నియంతృత్వ ధోరణితో ముందుకెళ్తున్నారు.
వ్యవస్థ దిగజారిపోయింది..
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై గత ఆదివారం ప్రెస్మీట్లో అన్ని ఆధారాలు చూపడంతో పాటు, ఇక్కడ ఎస్ఈసీని కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాం. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి, అన్ని ఆధారాలు చూపడంతో, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కి తీవ్ర స్థాయిలో మొట్టికాయలు వేసింది. నామినేషన్ వేయలేకపోయిన వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఇవి పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికలు. అలాంటప్పుడు మా పార్టీ అభ్యర్థులతో నామినేషన్ వేయించమని అడిగితే, ఎదుటి పక్షం మాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. మా పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వడం లేదు. అంటే వ్యవస్థ దిగజారిపోయింది అనేది వాస్తవం.
ఎందుకీ డ్రామాలు.. అబద్ధాలు?
సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చింది. అక్టోబరు 25వరకు తుది జాబితాలు ప్రకటించ వద్దని, నామినేషన్లు వేయలేకపోయిన వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని, అవసరమైతే జిల్లా కలెక్టరేట్ల వద్ద అందుకు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని, వారికి పోలీస్ భద్రత కల్పించాలని, ఆ దిశలో ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కవరేజీ ఏర్పాటు చేయాలని కూడా డీజీపీని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని నిర్దేశించింది. మా పార్టీ అభ్యర్థుల నామినేషన్లు వేయనిస్తే, అసలు గొడవే లేదు కదా? నిజంగా మీరు ప్రజలకు మంచి చేశామని అనుకుంటే, మా వాళ్లతో నామినేషన్లు వేయించే అవకాశం ఇచ్చి, ప్రజాతీర్పు కోరాలి. కానీ, ఆ పని చేయకుండా, మా వాళ్లను అడ్డుకోవడం ఏమిటి? మీరు ఓడిపోతారన్న భయంతోనే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఎన్నికలను బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు కదా? అందుకే స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలపై సుప్రీంకోర్టు చాలా లోతుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ మౌలిక విలువలలో భాగమని, ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు లేకుండా చేస్తే కోర్టులు తప్పకుండా జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది.
చంద్రబాబు ఆదేశాలను పాటిస్తున్న ఎస్ఈసీ..
అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తోందా? లేక చంద్రబాబు ఆదేశాలు పాటిస్తోందా? టీడీపీ దాడులు, పోలీసులు అడ్డుకోవడం వల్ల 19 మున్సిపాలిటీల్లో మేము నామినేషన్లు వేయలేకపోయామని సుప్రీంకోర్టుకు వెళ్లాం. వాటితో పాటు, మరో 4 మున్సిపాలిటీల్లో స్క్రూటినీ పేరుతో మా వాళ్ల నామినేషన్లు తిరస్కరించారు. అంటే మొత్తం 23 అర్బన్ లోకల్ బాడీస్‌లో పోటీ లేకుండా చేశారు. పుంగనూరు, రాయచోటి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, గురజాల, దాచేపల్లి, దర్శి, గుత్తి, మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు, తిరుపతి, పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, తాడిపత్రి, కనిగిరి, చిత్తూరు, నెల్లూరు, చిలకలూరిపేట, కనిగిరిలలో 15 చోట్ల ఏకంగా పోటీయే లేదు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు కూడా లేరు. 8 చోట్ల నామినేషన్లకు అస్సలు అనుమతించలేదు. గురజాల, పిడుగురాళ్ల, దర్శి, రాయచోటి, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, పుంగనూరులో నామినేషన్లు వేయనీయలేదు. 7 చోట్ల కొన్ని నామినేషన్లు పడ్డాయి. కానీ స్క్రూటినీ పేరుతో మళ్లీ అక్రమంగా చైర్మన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. దాచేపల్లి, కనిగిరి, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు, గుత్తి, నగరి తదితర 15 చోట్ల చైర్మన్ అభ్యర్థి లేకుండా చేశారు. ఇంకా చిత్తూరు, నగరి, చిలకలూరిపేట, నెల్లూరులో స్క్రూటినీ పేరిట నామినేషన్లు తిరస్కరించారు. (అంటూ.. ఎక్కడెక్కడ ఏం చేశారనే జాబితా పీపీటీలో చూపారు)
శకునిని తలపిస్తున్న చంద్రబాబు..
చంద్రబాబూ.. మీరు ఎందుకింత తొండి. దౌర్జన్యం. అన్యాయం చేస్తున్నారు. మీకు ధైర్యముంటే ఈ ఎన్నికలు ఎదుర్కోవచ్చు కదా? అసలు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీటిని ఎన్నికలు అంటారా? మహాభారతంలో శకునికి పాచికలు ఉండేవి. ఆయన కోరుకున్నట్లు నెంబర్లు వచ్చేవి. ఇక్కడ నీవు కూడా శకునిలా మారావు. నీ ఇష్టానుసారం ఎన్నికలను నిర్దేశిస్తున్నావు. ఎక్కడెక్కడ ఏం జరగాలో నీవే ఆదేశిస్తున్నావు. ఒక చోట తల (చైర్మన్) ఉండదు. కొన్ని చోట్ల కాళ్లు, చేతులు (వార్డు మెంబర్లు) ఉండవు. అంటే ఎక్కడా పూర్తిస్థాయిలో సక్రమంగా ఎన్నికలు జరగవు.
మా హయాంలో ఒక్క ఫిర్యాదైనా వచ్చిందా?
మీరు ప్రజలకు నిజంగా మంచి చేసి ఉంటే, వాటిని చూపి, మీ పనితీరు చూపి ఎన్నికల్లో ఓట్లు అడగాలి. మీరు ఆ పని చేయడం లేదు. కానీ, ఆ పని మేము చేశాం. మా హయాంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, ఆయన చంద్రబాబు నియమించిన వ్యక్తి. నాడు ఎన్నికల షెడ్యూల్ రాగానే, ఆయన ఇష్టానుసారం ఆఫీసర్లను బదిలీ చేశారు. అయినా మేం ఏమీ అనలేదు. ఎక్కడా ప్రజలకు మేలు చేయడంలో మేము వెనుకంజ వేయలేదు. ఎంతో మంచి చేశాం. అందుకే ఆ ఎన్నికల్లో విజయం సాధించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం అమలు చేసి చూపాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చాం. అందుకే ఆ ఎన్నికల్లో మేము 86 శాతం విజయం సాధించాం. కానీ ఈరోజు అంతా మోసం. సూపర్ సిక్స్ లేవు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. నాడు సంతకాలు చేసి ఇంటింటికీ పంపించిన బాండ్లు ఒట్టివే అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలదీసే పరిస్థితి. అందుకే ఈ స్థానిక ఎన్నికలు జరగనివ్వకుండా, అన్నీ ఏకగ్రీవం అయ్యేలా తొండి, దౌర్జన్యం, అన్యాయం చేస్తున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లలోనూ అదే తీరు..
అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా తగిన భద్రత కల్పించాలని, ఏర్పాట్లు చేయాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఆదేశించినా, అది అమలు చేయకుండా బరి తెగిస్తున్నారు. జంగిల్‌రాజ్ నడుపుతున్నారు. ఇక్కడ నారాసుర రక్త చరిత్ర కొనసాగుతోంది. ఎంపీటీసీలకు సంబంధించి రాష్ట్రంలోని 659 మండలాల్లో 101 మండలాల్లో జీరో నామినేషన్లు. అక్కడా అదే పద్ధతి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో ఏం చేశారో.. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల్లో టీడీపీ మనుషులు ఉంటారు. వారికి పోలీసులు అండగా ఉంటారు. అక్కడికి మా పార్టీ వారు పోగానే అడ్డుకుంటున్నారు. చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాగేసుకుంటున్నారు. చింపేస్తున్నారు. ఎవరైనా నామినేషన్ వేస్తే, చివరకు ఆర్ఓ (రిటర్నింగ్ అధికారి) చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారు. మరో 70 మండలాల్లో 5 నామినేషన్ల కంటే తక్కువ పడ్డాయి. జడ్పీటీసీలకు సంబంధించి 227 మండలాల్లో నామినేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. స్థానిక ఎన్నికల సందర్భంగా మా వారిపై జరుగుతున్న దాడులకు ప్రధాన కారణం.. సీఎం చంద్రబాబు. ఆయన చెప్పినట్లు ఆడుతున్న పోలీసులు. ఇతర అధికారులు. మరి వారిని బాధ్యతల నుంచి తప్పించకుండా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయి? చంద్రబాబు ఒకప్పుడు పోలింగ్ కేంద్రాలను రిగ్గింగ్ చేయడం చూశాం. ఇప్పుడు ఏకంగా నామినేషన్ కేంద్రాల రిగ్గింగ్‌కు దిగజారారు. మనం గతంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాల రిగ్గింగ్ చూశాం.
తిరగబడండి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి..
ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ప్రజా హక్కులు కాపాడబడతాయి. అదే నియంతృత్వ వ్యవస్థలో ప్రజలకు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛ ఉండదు. కాబట్టి ప్రజలంతా ఆలోచించాలి. ఈరోజు మీ ఓటు ఎంతో ముఖ్యం. దాన్ని సక్రమంగా వినియోగించు కోకపోతే, రేపు మీ ఆస్తులను ఇలాగే లాక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో అధికారుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు లాక్కుని చించేస్తున్నారు. రేపొద్దున మీ ఆస్తి పత్రాలు కూడా ఇలాగే అధికారులు, పోలీసుల సమక్షంలోనే లాక్కుని చింపేస్తారు. ఆ ఆస్తులు వారివే అంటారు. కాబట్టి, తిరగబడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొండి. లేకపోతే ఏ ఒక్కరి ఆస్తులు, స్వేచ్ఛ, హక్కులకు గ్యారంటీ లేదు. టీడీపీ గూండాలకు పోలీసులంటే భయం లేదు. పోలీసులను వాడుకుని ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నపుడు ఇక ఈ రాష్ట్రం ఏమవుతుందనేది అందరూ ఆలోచించాలి. చంద్రబాబు ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో చేస్తున్న ఈ దారుణాలన్నీ కూడా రాజ్యాంగ నిర్మాణంపై జరుగుతున్న దాడి మాత్రమే కాదు.. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు జరుగుతున్న నేరపూరిత కుట్రగా పరిగణించాలి. నిజంగా ఇది అతి పెద్ద నేరం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.
19కి బదులు, 4 మున్సిపాలిటీల్లోనే రీ నామినేషన్లకు..
ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా, చంద్రబాబులో కానీ, ఎస్ఈసీలో కానీ, చంద్రబాబు చేతిలో తోలుబొమ్మ మాదిరిగా మారిన డీజీపీలో కానీ, డీఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై గౌరవం లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వలేదని మేము ఆధారాలతో సహా సుప్రీంకోర్టుకు వెళ్తే, కోర్టు మొట్టికాయలు వేసినా, వీరిలో మార్పు లేదు. కేవలం 4 మున్సిపాలిటీల్లో మాత్రమే రీనావిునేషన్లకు అనుమతి ఇచ్చారు. కేవలం మైదుకూరులో మొత్తం వార్డుల్లో రీ నామినేషన్లకు అవకాశం కల్పించారు. తిరుపతిలో 18 డివిజన్లు, కడపలో 11 డివిజన్లతో పాటు, రాజంపేటలో మరో 11 వార్డులకు రీ నామినేషన్లకు పరిమితం చేశారు. అసలు వీరికి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఉందా? నామినేషన్ విధానంలో నియమించుకుంటే సరిపోతుంది కదా? ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారు? ఇవి పార్టీపరమైన ఎన్నికలు. మా అభ్యర్థులను నామినేషన్ వేయించమని అడుగుతున్నాం. నామినేషన్లు వేయనివ్వకుండా, గెలుపు ఏకపక్షం చేసే పని చంద్రబాబు చేస్తున్నాడు. ఇది ధర్మమేనా?
కడపలో 66 డివిజన్లుంటే..11 డివిజన్లకే రీ నామినేషన్..
కడప కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉంటే, కేవలం 11 డివిజన్లలో మాత్రమే రీనావిునేషన్కు అవకాశం కల్పించారు. మిగిలిన 55 డివిజన్లలో కేవలం రెండే రెండు వార్డుల్లో పోటీ ఉండేలా చేసిన వీరు, మరో 11 చోట్ల ఇప్పుడు అనుమతి అంటే.. మొత్తం 13 వార్డుల్లో మాత్రమే పోటీకి అనుమతి ఇస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం. రాజంపేటలో 32 వార్డులుంటే, ఇంతకు ముందు కేవలం 3 వార్డుల్లో మాత్రమే పోటీ ఉండేలా చేశారు. కాగా, ఇప్పుడు మరో 11 వార్డుల్లో రీ నామినేషన్‌కు అనుమతి ఇచ్చారు. అంటే 32 వార్డులకు గానూ, కేవలం 14 వార్డుల్లో మాత్రమే మా పోటీకి అనుమతి ఇస్తున్నారు.
‘పచ్చమూకల దాడులు’ పేరిట బుక్..
ఈ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది. ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. అందుకే ఎన్నికలను బుల్డోజ్ చేసి, ఎలాగైనా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇలాంటి విష సంçస్కృతి మంచిది కాదు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఘటనను చూపుతూ.. ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాం. ‘పచ్చమూకల దాడులు’ పేరుతో బుక్ రిలీజ్ చేస్తున్నాం. దీన్ని అందరికీ ఇవ్వబోతున్నాం. కోర్టులకు కూడా చూపుతాం. దాంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వివరాలన్నింటినీ ప్రజలకు చెప్పాలి’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
మా అభ్యర్థుల జాబితాలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తాం
ఈ స్థాయిలో అంతులేని అక్రమాలు జరుగుతుంటే, సీఎం చంద్రబాబు, ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఇంత జరుగుతుంటే, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా? అన్న సందేహం కలుగుతోంది. ఇవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు. అందుకే మేము మా పార్టీ అభ్యర్థులను ప్రకటించాం. వారికి ఏ ఫామ్స్, బీ ఫామ్స్ కూడా ఇచ్చాం. అందుకనే మా పార్టీకి సంబంధించిన మొత్తం అభ్యర్థుల జాబితాలను ఎస్ఈసీకి ఇస్తాం. హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా సమర్పిస్తాం. న్యాయం చేయమని అడుగుతాం.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి..
తక్షణం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, అమికస్ క్యూరీగా ఒక సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌ను తీసుకొచ్చి, అతడి ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలి. దాడులు జరిగిన జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఐజీలను బదిలీ చేయాలి. కక్షపూరితంగా విధులు నిర్వర్తిస్తున్న 59 మంది డీఎస్పీలు, సీఐలు, ఇతర అధికారులను గుర్తించి మేము ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. తక్షణం వారిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలి. నామినేషన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల స్టోర్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద, కేంద్రాల లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వెంటనే కేంద్ర బలగాలు రప్పించాలి.
ఎన్నికల కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరించాలి
ప్రజలకు ఏ మాత్రం మంచి చేయని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసు కాబట్టే, ఎన్నికలను బుల్డోజ్ చేస్తున్నారు. అందుకే, నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, కేంద్ర బలగాలు మోహరించాలని కోరుతున్నాం. మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అలాగే చేశారు. ఇంకా మా పార్టీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. దాని కోసం హైకోర్టుకు కూడా వెళ్లాం. హైకోర్టు అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. అయినా ఎస్ఈసీ పట్టించుకోలేదు. అసలు ఎన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పెట్టారని ఎస్ఈసీని మేము అడిగితే, సమాధానం లేదు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏం చర్యలు తీసుకున్నారని అడిగాం. దానికీ సమాధానం లేదు. ఇంకా ఏ ఒక్కరిపై చర్యలు లేవు. ఆర్ఓల చేతిలో నుంచి నామినేషన్లు లాక్కుని చింపేసినా, వారు కనీసం ఫిర్యాదు కూడా చేయడం లేదు. ఇంకా మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేవు. ప్రజాస్వామ్యం అంటే, నిర్భయంగా ఓటు వేయాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. మరి ఇవన్నీ లేనప్పుడు రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలినట్లు కాదా?
ప్రజలు కసితో ఉన్నారు కచ్చితంగా బుద్ధి చెబుతారు..
ఈ అక్రమాలు, కుట్రలపై ఎస్ఈసీని కలిసినా లాభం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులే న్యాయం చేయాలి. ఇలా తొండి, అన్యాయం, దౌర్జన్యంతో ఎన్నికలు గెలవొచ్చని చంద్రబాబు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే రేపు సాధారణ ఎన్నికల్లో ఇలా చేసే అవకాశం రాదు. ప్రజలు కసితో ఉన్నారు. కచ్చితంగా బుద్ధి చెబుతారు. ఈ కుట్రలు, అక్రమాలన్నింటినీ మేము మళ్లీ కోర్టులో వేస్తాం. అన్ని ఆధారాలు చూపుతాం. ఇవి పార్టీపరంగా జరిగే ఎన్నికలు. కాబట్టి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. నామినేషన్లు స్వేచ్ఛగా వేసే పరిస్థితి ఉండాలని కోరుతున్నాం. ఆ పని ఎన్నికల కమిషన్ చేయాలి. కానీ, ఎస్ఈసీ ఆ పని చేయడం లేదు. అసలు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? లేక నియంతృత్వ వ్యవస్థలో ఉన్నామా?


