
సీఎం స్థాయిలో ఉన్న 76 ఏళ్లున్న వ్యక్తి అనాల్సిన మాటలేనా ఇవి?
సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
ఏడాదికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనం
ప్రజల దృష్టి మళ్లించడానికే తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు
కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చింది
అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నింటిపై దాడికి చంద్రబాబు బాధ్యుడు కాదా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసాలు, అబద్ధాలు, అవినీతిపై ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు సృష్టించి.. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఆయన ప్రతి మాటలోనూ అసహనం కనిపిస్తోందని, నియంతలా మారి అణచివేత అన్న పదానికి నిర్వచనంగా మారారని దెప్పి పొడిచారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోందని, ఈ నెల 4న వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించడమే ఇందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, నాణేనికి రెండో వైపు ఉన్న వాస్తవాలను సాక్ష్యాధారాలతో వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను కడిగిపారేశారు. ‘ప్రజల సమస్యల పట్ల ఎవరైనా గొంతు విప్పితే చాలు చంద్రబాబు భూస్థాపితం చేస్తానంటున్నారు.
76 ఏళ్ల వయస్సున్న వ్యక్తి, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా? ఒక ఎల్లో మీడియా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మీడియా ఓనర్.. ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడు భూస్థాపితం చేస్తారు అని అడగడం.. దానికి ఇదిగో మొదలు పెట్టేశా.. త్వరలోనే చేస్తాను.. అంటూ ఈ 76 ఏళ్ల ముసాలాయన చెప్పడం ఎంత వరకు సమంజసం? ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏమిటి? ఈ బెదిరింపులు ఏమిటి? వాడిని తొక్కుతా.. వీడిని తొక్కుతా.. అనే మాటలు ఏమిటి?
ప్రజలు, దేవుడి దయతో అధికారంలోకి వచ్చారు. వచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి.. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, అబద్ధాలు, మోసాలతో పరిపాలన సాగిస్తున్నారు. ప్రజల కోసం ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తానంటూ బెదిరిస్తున్నారు’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజల్లో, కార్యకర్తల్లో విప్లవం వచ్చింది
పల్నాడు జిల్లాలో నిన్న (బుధవారం) నా కార్యక్రమం కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగింది. కష్టాల్లో ఉన్న ప్రజల్ని, మా పార్టీ కార్యకర్తలను నేను పరామర్శిస్తే తప్పా చంద్రబాబూ? నా పర్యటనకు ఎందుకు అన్ని ఆంక్షలు పెట్టాలి? పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి.. నా పర్యటనకు ఎవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేయడం.. వచ్చిన వాళ్లను ఎక్కడికక్కడ కట్టడి చేయడం ఎందుకు? చంద్రబాబు చేతలు, మాటలను బట్టే ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ విప్లవం వచ్చింది. నిన్న జరిగిన నా కార్యక్రమం ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన పనిలేదు. మీ అందరికీ తెలిసిందే.
మొన్న పొగాకు రైతులకు భరోసా ఇచ్చేందుకు పొదిలి వెళ్తే.. అక్కడ కూడా ఇదే రీతిలో వ్యవహరించారు. పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అదే సమయంలో పర్చూరు, కొండేపిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావం తెలిపేందుకు ప్రతిపక్ష నాయకుడు వెళ్తే పోలీసుల ద్వారా చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు రాని పరిస్థితి నెలకొంది. ధాన్యాన్ని రైతులు బస్తా రూ.300 తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది.
మిరప, పత్తి, జొన్న, పెసలు, కందులు, మినుములు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, అరటి, చీని, కోకో ఇప్పుడు పొగాకు, మామిడి.. ఇలా ప్రతీ పంటకు కనీస మద్దతు ధర దక్కక రైతులు అష్టకష్టాలు పడతున్నారు. ఈ మధ్య కాలంలో కొండపిలో ఇద్దరు.. రెండు రోజుల కిందట చిలకలూరిపేటలో ఇద్దరు, వినుకొండలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
తప్పుడు ఆలోచనలు.. తప్పుడు పనులు
» తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు బనాయించారు. ఈయన 2009, 2012, 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. మాచర్లలో అజమాయిషీ కోసం పిన్నెల్లిని తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరిలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై రెండుసార్లు కేసులు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెస్తే, మరో కేసు పెట్టి అరెస్టు చేశారు. సురేష్ భార్యపైనా కేసు పెట్టారు.
» వల్లభనేని వంశీని అక్రమ కేసులతో జైలులో పెట్టారు. దాదాపు 2 నెలలు దాటింది. ఒక కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతున్నారు. ఇప్పటికే వంశీపై 13 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. కృష్ణమోహన్ అన్న.. ఆయన నా ఓఎస్డీ. పాపం ఆయన్ను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఆయన ఓ ఆర్డీవో..
ధనుంజయరెడ్డిని చూసినా జాలి అనిపిస్తుంది. వీళ్లంతా మచ్చలేని అధికారులు.
» మరొక పక్క రాజ్ కేసిరెడ్డి, బాలాజీ, గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మా ఎంపీ మిథున్‌రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా అని వెంటపడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడో కాలేజ్‌లో చదువుకున్న రోజుల్లో చంద్రబాబును కొట్టారట. ఆ కోçపం ఇప్పటికీ చంద్రబాబు మనసులో ఉంది. ఆయన్ను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆయన కొడుకునూ అరెస్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నాడు.
» పేర్ని నానిపై తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఆయన భార్య జయసుధమ్మను కూడా ఇరికించాలని ప్రయత్నం. కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు, వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే అయిన తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, మాజీ మంత్రి, బీసీ మహిళాæ నేత ఉషాచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, విజయవాడలో గౌతంరెడ్డి, మాజీ మంత్రి, దళిత నాయకుడు మేరుగు నాగార్జున, మరో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.. తదితరులందరిపై తప్పుడు కేసులు పెట్టి.. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలా.. అని చూస్తున్నాడు.
» జగన్ చుట్టూ ఉన్న వారిని భయపెట్టాలి. చిన్న చిన్న వ్యక్తులను భయపెట్టడం, కొట్టడం, తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అరెస్టు చేయడం. ఇలా అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరెండి (పని చేసే విధానం). అన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు.
చంద్రబాబు చెంప చెళ్లుమన్పించేలా సుప్రీంకోర్టు తీర్పు
» కొమ్మినేని శ్రీనివాస్ మీడియా రంగంలో సుదీర్ఘంగా సేవలందించారు. 70 ఏళ్ల వయస్సులో ఆయన ఏం పాపం చేశారని చంద్రబాబు జైలుకు పంపించారు? ఎందుకంత ఉత్సాహం చూపించారు? ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే అనుకూలంగా, వ్యతిరేకంగా కొంత మంది మాట్లాడతారు. ప్యానలిస్టు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? ఇది మినిమం లాజిక్. అలాంటిది ఆయన్ను జైలులో పెట్టారు. కొమ్మినేనిపై చంద్రబాబుకు కోపం ఎక్కువే. గతంలో కొమ్మినేని ఉద్యోగాన్ని ఊడగొట్టడంలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. అంతటితో సంతోష పడకుండా ఆయన జీవితం నాశనం చేయాలని, పరువు తీయాలని, జైలులో పెట్టాలని దిక్కుమాలిన ఆలోచనలు చేశారు.
» కొమ్మినేనిని అరెస్టు చేయడమే కాకుండా.. సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని వ్యవస్థీకృతంగా చేశారు. పథకం ప్రకారం సాక్షి ఆస్తులు టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించారు. (ఫొటోలు చూపిస్తూ వివరాలు చదివి వినిపించారు) శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మెట్టా శైలజా, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్ భార్య గుండు స్వాతి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, తెలుగు యువత ప్రెసిడెంట్ మెండా దాసునాయుడు వీళ్లంతా శ్రీకాకుళం సాక్షి కార్యాలయంపై దాడి చేశారు.
» విశాఖపట్నం సాక్షి కార్యాలయంపై సిటీ 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ ముక్కా స్వాతి, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా సాక్షి కార్యాలయంపై అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. ఈయన పేరుకు బీజేపీనే కానీ టీడీపీ ఎమ్మెల్యే అని అందరికీ తెలుసు. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీసుపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనూరాధ, గద్దె క్రాంతి.. మంగళగిరి సాక్షి కార్యాలయంపై ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తదితరులు దాడి చేశారు.
» అనంతపురం సాక్షి కార్యాలయంపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ స్వప్న, సంగ తేజస్వీని, కడపలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేసు, తిరుపతి రేణిగుంట కార్యాలయంపై తిరుపతి డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం.. గతంలో డెప్యూటీ మేయర్ బై ఎలక్షన్ సందర్భంగా కార్పొరేటర్లను పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసిన వ్యక్తులే సాక్షి ఆఫీసులు పగలగొట్టే దానిలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. నెల్లూరులో టీడీపీ సిటీ అధ్యక్షురాలు కె.రేవతి, ఏలూరులో టీడీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతల వెంకట రమణ సాక్షిపై దాడి చేసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నారు.
» ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న పత్రిక, టీవీ చానల్ గొంతు నులిమేందుకు ఎమ్మెల్యేలతో కలిసి కార్యకర్తలను ఉసిగొలిపి పథకం ప్రకారం దాడులు చేయడం ధర్మమేనా? కొమ్మినేని కేసు విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 32 కింద తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయమని ఆదేశించింది. అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నింటినీ టీడీపీ కార్యకర్తలతో ధ్వంసం చేస్తే ప్రభుత్వంలోని చంద్రబాబు బాధ్యుడు కాదా?
కొమ్మినేనిని అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన సమయంలో సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేయడంలో చంద్రబాబు దోషికాడా? ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సిన పనా ఇది? ఇది తప్పుడు సంప్రదాయం కాదా? రేప్పొద్దున ఇదే సంప్రదాయం కొనసాగితే ఎవరైనా బతుకుతారా? ఈ రోజు సాక్షి, రేప్పొద్దున ఎన్‌టీవీ, టీ9 కావచ్చు.. ఎవరైనా జర్నలిస్టులు కావచ్చు.. విచ్చలవిడి రౌడీయిజం కాదా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజాశక్తి కావచ్చు.. ఇంకొకటి కావచ్చు.. ఎవరు రాసినా, ఎవరు చూపించినా ఇలానే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
ప్రశ్నించే గొంతు నొక్కేందుకే అక్రమ కేసులు
» మీ వైఫల్యాల నుంచి డైవర్షన్ చేసేందుకు, ప్రజల సమస్యలపై ఎవరైనా గొంతు విప్పితే ఆ గొంతును నులిమేందుకు ఏడాది కాలంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ సంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ పల్నాడు జిల్లాలో నా కార్యక్రమానికి ముందు రోజున.. టాపిక్ డైవర్షన్ చేయడం, ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతోనే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
» ఏడాదిగా లిక్కర్ కేసులో ఏనాడైనా భాస్కర్‌రెడ్డి పేరు వినిపించిందా? ఏదో విధంగా భాస్కర్‌ను ఇరికించడమే లక్ష్యంగా తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. తొలుత భాస్కర్ గన్‌మెన్‌ను పిలిచి భాస్కర్‌కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో జరిగిందని.. దాంట్లో భాస్కర్ పాత్ర ఉందని.. స్టేట్‌మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు. తాను తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వలేనన్నందుకు ఆ గన్‌మెన్‌ను కొట్టి చిత్ర హింసలకు గురిచేశారు.
» ఆ కానిస్టేబుల్ తనను కొట్టిన దెబ్బలన్నీ చూపిస్తూ వీడియో తీసి.. జరిగిన ఘటనపై డీజీపీ, గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు వేశాడు. నిన్న ఆ కేసు విచారణకు కూడా వచ్చింది. గిరి అనే మరో కానిస్టేబుల్‌ను తీసుకొచ్చి ఆయనతో ఈ కేసు విషయమై భాస్కర్‌తో మాట్లాడినట్టు చెబుతూ సాక్ష్యం పుట్టించారు.
ఈ సాక్ష్యంతో భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. భాస్కర్ ఆ కానిస్టేబుల్‌తో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడాడని చెబుతున్నారు. ఎవరైనా సరే తన డ్రైవర్‌తోనో, తన ఇంట్లో వారితో.. గన్‌మెన్‌తో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడితే చాలు.. వారిని తీసుకొచ్చి ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇప్పించడం, ఆ స్టేట్ మెంట్ ఆధారంగా అరెస్ట్‌లు చేయడం చేస్తున్నారు.
» స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడకపోతే చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇలా ఇరికించాలనుకుంటేæ ఎవరు తట్టుకుంటారు? ఎవరినైనా ఇరికించొచ్చు. ఈ తరహా తప్పుడు సంప్రదాయానికి నాంది పలికితే వ్యవస్థ బతుకుతుందా? ఇలాంటి ఘటనల నుంచే నక్సలిజం పుడుతుంది. రాష్ట్రాన్ని బీహార్ చేయడంలో చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు మరొకరు ఉండరు. భాస్కర్‌ను ఎందుకు టార్గెట్ చేశారంటే.. ఆయన నియోజకవర్గం చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబట్టి.
» భాస్కర్ మాత్రమే కాదు మొన్ననే లండన్‌లో చదువు పూర్తి చేసుకొని వచ్చిన ఆయన కొడుకుని కూడా ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. ఇదే నియోజకవర్గంలో 17 వేల ఓట్లతో ఓడిపోయి కుప్పం పారిపోయిన చంద్రబాబు.. మళ్లీ చంద్రగిరిలో రాజకీయాలు చేయాలనే కుట్రలతో భాస్కర్, ఆయన కొడుకును రాజకీయాల నుంచి తప్పించేయాలనే ఆలోచనతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఏమిటి ఈ రాజకీయాలు?
వెన్నుపోటు పొడవటంలో ఆయనకు ఆయనే సాటి
చంద్రబాబుకు మహిళలపై నిజంగా గౌరవం ఉంటే శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత చిన్నారిని టీడీపీకి చెందిన 14 మంది సామూహిక అత్యాచారం చేస్తే ఏం చేశారు? అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయి కనపడటం లేదని తల్లిదండ్రులు జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆరు రోజుల తర్వాత ఆ బాలిక శవమై కనిపించింది. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేశారు. ఇలాంటి కేసులపై దర్యాప్తు చేయాలి.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలనే ఆలోచన లేదు. ఎంత సేపు రెడ్‌బుక్ పేరుతో అమాయకులను కేసుల్లో ఇరికించాలనే ఆత్రం తప్ప.
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు వెన్నుపోటు పొడిచాడు. ఇలాంటి చంద్రబాబా మహిళల గౌరవం గురించి మాట్లాడేది? ప్రతి అక్కచెల్లెమ్మ తన కాళ్లపై తాను నిలబడే పరిస్థితి రావాలని, వారి కుటుంబ సభ్యులను దేవతలుగా చూసుకోవాలని ఆరాట పడింది మేము. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏకంగా రూ.1.89 లక్షల కోట్లను 19 పథకాల ద్వారా నేరుగా డీబీటీ రూపంలో అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ మొత్తం రూ.2.73 లక్షల కోట్లు డీబీటీగా అందించాం. 32 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం.
ఒక్కొక్కరి పేరిట రూ.4 లక్షల నుంచిరూ.15 లక్షలకుపైగా విలువైన భూమిని ఇచ్చాం. 22లక్షల ఇళ్లు మంజూరు చేసి 10 లక్షల ఇళ్లు కట్టించాం. మా హయాంలో మిగిలిన 12 లక్షల ఇళ్ల పనులు కూడా వేగంగా జరిగాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. ఈ లెక్కన మహిళలపై గౌరవం ఉండేది ఎవరికి? మంచి చేసిన మాకా.. లేక వారి ముసుగులో దౌర్జన్యం చేసే ఆ పెద్దమనిషి చంద్రబాబుకా? రాక్షసత్వం ప్రదర్శించే ఆ వ్యక్తికా? ప్రజలకైనా, మహిళలకైనా, సొంత కూతుర్ని ఇచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవటంలో ఆయనకు ఆయనే సాటి.