ఈ 18 నెలల కాలంలో.. రైతుల కోసం నిలిచిందెక్కడ? | YS Jagan Fires On Chandrababu Naidu: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఈ 18 నెలల కాలంలో.. రైతుల కోసం నిలిచిందెక్కడ?

Nov 24 2025 3:54 AM | Updated on Nov 24 2025 3:54 AM

YS Jagan Fires On Chandrababu Naidu: Andhra pradesh

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ధ్వజం 

పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైనా మీరు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు.. ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లేక పంటలను ట్రాక్టర్లతో దున్నివేసే దుస్థితికి తెచ్చారు 

మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి రోడ్డు మీద నిలబెట్టారు 

రైతుల కష్టాలు, బాధలు కప్పిపుచ్చి దానిపై చర్చ జరగకుండా మీరు చేస్తున్న డైవర్షన్‌ పబ్లిసిటీ స్టంటే ‘రైతన్నా.. మీ కోసం’

మీ వంచనను ప్రశ్నిస్తూ.. మీ కాలర్, మీ పార్టీ వాళ్ల కాలర్‌ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు బాబూ!

సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైనా సీఎం చంద్రబాబు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకో­లేక.. ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరా లేక.. రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తెచ్చారు..’’ 

అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘‘మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి, ఇప్పుడు వారు కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ఎండమావులు చూపిస్తారా? రైతుల కష్టాలు, బాధలు కనిపించనివ్వకుండా, దీని మీద చర్చ జరగకుండా ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్‌ పబ్లిసిటీ స్టంటే ‘‘రైతన్నా.. మీకోసం’’ కార్యక్రమం’’ అని స్పష్టం చేశారు.  

‘అసలు ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి మెదళ్లపై దాడి చేయడానికే మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది?..’’ అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ ఆదివారం తన ‘ఎక్స్‌’  ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్‌ హైదరాబాద్‌ యాత్రలతో మీ దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీకు డప్పు కొట్టే మీ ఎల్లోవీుడియా, మీ తొట్టి గ్యాంగ్‌కి.. ఇలా వీరందరికీ కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు. కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా?   

వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10 వేల మందితో టెలికాన్ఫరెన్స్‌ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకుంటున్నారు. కానీ అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్‌ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు?

 ధరలు పతనమై దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరు చేసి రైతులకు భరోసా కల్పించే చర్యలు ఎందుకు చేపట్టడం లేదు?  

ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా.. మీరు అధికారంలోకి వచ్చిన ఏడాది­లోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.

ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు.

   రైతులు, వారి తరఫున మేం పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్‌ చేయడానికి ఎదురుదాడి చేస్తారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకుంటామంటూ మీరు హడావుడి ప్రకటనలు చేస్తారు. తీరా ఆచరణలో ఏమీ చేయరు. ఏమీ ఉండదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే. 

మా ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను.. మీ దుర్మార్గ పాలనతో పూర్తిగా తొలగించడమో, నిర్వీర్యమో చేశారు. 
ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏం చేస్తారో  చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్‌ లేకపోయినా మీరే పంట నష్టరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు.  

 రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు.  
ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పీఎం కిసాన్‌ కాకుండా ఏడాదికి రూ.20 వేలు అన్నదాతా సుఖీభవ కింద ఇస్తామన్నారు. ఈ రెండేళ్లకు రూ.40 వేలకు గానూ ఇచ్చింది కేవలం రూ.10 వేలే. 

ఆర్బీకేలు, ఈ–క్రాప్, సీఎం యాప్, పొలం వద్దే పంట కొనుగోలు.. ఇలా అన్నీ నిర్వీర్యం. చివరకు ఎరువులు కూడా రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చా­రు. రైతుల బతుకులు దళారీల పాలు చేశారు. 
ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచ­నను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ల కాలర్‌ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని  మరిచిపోవద్దు చంద్రబాబు గారూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement