బాపట్ల జిల్లా ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో ఘటన
చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళన
చుండూరు (కొల్లూరు): బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం ఉపాధ్యాయులు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు దర్శన మిచ్చాయి. వాటిని విద్యార్థులు ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రులు చిక్కీలపై ఉన్న కవర్‌ను తొలగించి విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రయతి్నస్తున్న క్రమంలో పురుగులు కనిపించడంతో నిశ్చేషు్టలయ్యారు. ప్యాకెట్‌లోంచి తీసిన చిక్కీలోబతికున్న పురుగు బయటకు వస్తుండటం చూసిన తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యమైన భోజనం, చిక్కీలు అందించాల్చిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించడం, చిక్కీల నాణ్యతను విద్యాశాఖాధికారులు పరిశీలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులు పురుగులను గమనించకుండా ఆరగించి ఉంటే వారి పరిస్థితి ఏమిటన్న సందేహాలు తల్లిదండ్రులలో వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాటల కోటలు దాటుతుంటే.. విద్యార్థులకు ఇస్తున్న చిక్కీలలో పురుగులు బయటకొస్తున్నాయని పలువురు వ్యాఖ్యానించారు.


