మినుములూరులో నిలదీసిన మహిళలు
ఉపాధి కూలీ సొమ్ము ఎప్పుడు జమచేస్తారంటూ ప్రశ్నల వర్షం
‘ఇస్తాం.. చేస్తాం..’ అని మంత్రి హామీ
పాడేరు: ‘గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. కానీ రూ.1,050 చెల్లిస్తున్నాం. కొందరికి రాయితీ సిలిండర్ల నగదు అసలు జమ అవలేదు. ఎప్పుడు అవుతుంది. ఇప్పటివరకూ ఉచిత సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చారు. ఉన్న పింఛన్లు ఊడగొట్టారు. జీసీసీ డిపోలో పంచదార, బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారు?’ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మహిళలు నిలదీశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మినుములూరులో పలువురు మహిళలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి రెండు నెలలు కావస్తున్నా కూలీ సొమ్ము జమ చేయడం లేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తమ గ్రామంలో 15 మంది పింఛన్లు ఎందుకు తొలగించారని సర్పంచ్ లంకెల చిట్టమ్మ ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. జీసీసీ డిపోల్లో మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతామన్నారు.
గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ అదనంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కమాండర్ జీపుల సహాయంతో వృద్ధుల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేస్తామన్నారు. అనంతరం ఆయన సుండ్రుపుట్టు డీఆర్ డిపోతో పాటు పాడేరు జీసీసీ గోదామును పరిశీలించారు. కాగా, మంత్రి నాదెండ్ల పర్యటనలో జీసీసీ చైర్మన్, టీడీపీ నేత కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.