ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చుతాం
ఎవరైతే మావిగన్‌ను సమర్థిస్తారో వారు వైఎస్సార్‌సీపీకి ఓటేస్తారు
ఎవరైతే అమరావతిని కోరుకుంటారో వారు వారికి ఓటేస్తారు
మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ
‘రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయి. స్కాములు చేయకుండా రాజధానిని నిర్మించగలిగే అవకాశం ఏమిటి? అదే మావిగన్. ఏ స్కాములూ లేకుండా మావిగన్‌లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించుకోవచ్చు.
జగన్ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేస్తారు. నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల పట్ల చాలా సానుభూతి ఉన్నవాణ్ని. రైతులకు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను రైతులే చెబుతున్నారు. ఎందుకు అన్యాయం చేస్తున్నావని మనం రైతుల తరఫున అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం.
ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు. నేను మాట్లాడేది చూస్తున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు.
ఎలా మాట్లాడుతున్నారు. ఏమేం ఆధారాలు చూపిస్తున్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలేమిటని ప్రజలు గమనిస్తున్నారు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్‌ని రిసీవ్ చేసుకుంటారు.
సాక్షి, అమరావతి : తాము మావిగన్ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు)కే కట్టుబడి ఉన్నామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ‘రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఎవరైతే మావిగన్‌ను సమర్థిస్తారో వారు వైఎస్సార్‌సీపీకి ఓటేస్తారు.. ఎవరు అమరావతిని కోరుకుంటారో వారు వారికి ఓటేస్తారు.. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కూడా మేం చెబుతాం’ అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ జవాబు ఇచ్చారు.
‘ఈ అంశాన్ని మా మానిఫెస్టోలో కూడా చేరుస్తాం. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూద్దాం’ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వైఎస్ జగన్ ఇచ్చిన స్పష్టమైన సమాధానాలు ఇవీ..
స్కామ్‌లకు అవకాశం లేని రాజధాని మావిగన్
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు చేస్తున్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తున్నాం. అవన్నీ స్కాములు కాకుండా ఎలా పోతాయి? అందుకే స్కాములు చేయకుండా రాజధానిని నిర్మించగలిగే అవకాశం ఏమిటి? అదే మావిగన్. ఏ స్కాములూ లేకుండా మావిగన్‌లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మింంచుకోవచ్చు.
మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, గుంటూరులో ఇప్పటికే విభిన్న విద్యాసంస్థలు. ఇంకా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వేస్టేషన్లు. మూడింటికీ బ్రహ్మాండమైన కనెక్టింగ్ జాతీయ రహదారులు. అందుకే ఆ కట్టే బిల్డింగులు అమరావతిలో కాకుండా, ఇక్కడ కడితే చాలు. ఏ స్కాములూ లేకుండా బ్రహ్మాండమైన రాజధాని మావిగన్ వస్తుంది.
రైతుల తరఫున పోరాడుతున్నాం..
ఉండవల్లిలో నేను పర్యటించడం పెద్ద సమస్య కాదు. కానీ, దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఈసారి పర్యటనలో ముందుగా రిటైర్డ్ జడ్జిలను, లాయర్లను తీసుకెళ్లడంతో పాటు, ఎన్‌హెచ్‌ఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం వంటివి చేస్తాం. అలా కాకుండా నేరుగా నేను వెళ్తే, జగన్ అమరావతికి వ్యతిరేకం అని దు్రష్పచారం చేస్తారు. నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల పట్ల చాలా సానుభూతి ఉన్నవాణ్ని. రైతులకు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను రైతులే చెబుతున్నారు. ఎందుకు అన్యాయం చేస్తున్నావని మనం రైతుల తరఫున అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం.
ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు
ప్రతి అంశంపై యుద్ధమే. ఆ యుద్ధంలో వైఎస్సార్‌సీపీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా, అండగా నిలబడి వారి తరఫున కచ్చితంగా పోరాటాలు చేస్తాం. ఆ మాదిరిగా కచ్చితంగా ప్రతి జిల్లాలోనూ ఎక్కడెక్కడ సమస్యలున్నాయో అక్కడికి మా వాళ్లందరూ పోతున్నారు. సమయాన్నిబట్టి, అవసరాన్ని బట్టి నేను కూడా నిరసనల్లో పాల్గొంటున్నా. ఇది సాధారణంగా జరిగేదే.
ఈ ప్రభుత్వంలో ఏదైనా జరగొచ్చు
సాయికృష్ణ కేసు అంశంలో సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందని చెప్పారా. ఆయన్ను చంపినా చంపేస్తారు. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చు. అందుకనే ‘హే రామ్. సేవ్ ఆంధ్ర’ అన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతోంది అని చెప్పేదానికి ఇవన్నీ నిదర్శనాలు. చంద్రబాబు ఇక్కడ చేయడమే కాకుండా.. ఆయన ప్రభావం, ఎక్కడెక్కడైతే ప్రాపకం ఎక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికి పెంచి వాళ్లతో కూడా చేయిస్తున్నాడు దురదృష్టవశాత్తూ. అందుకనే చెప్పాం కదా..‘హే రామ్. సేవ్ ఆంధ్ర’ అని.
మా ఆరోపణ తప్పైతే ఆధారాలు చూపండి
మెగా డీఎస్సీలో అక్రమాలకు సంబంధించి ఆధారాలతో సహా నేను చూపించాను. ఎవరూ సమాధానాలు ఇవ్వలేదు. పెద్దపెద్ద పరుష పదజాలం అవసరం లేదు. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించాను. ఆ జీవో ఇది. సో అండ్ సో నంబర్ అని చూపించా. నీకు చేతనైతే ఇదిగో ఇవీ వాస్తవాలు అని చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకుండా పబ్లిసిటీ కోసం మాట్లాడటం ఎందుకు? దానివల్ల సాధించేదేమిటి? ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు.
ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు. ఏమేం ఆధారాలు చూపిస్తున్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలేమిటని ప్రజలు గమనిస్తున్నారు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గు్యమెంట్‌ని రిసీవ్ చేసుకుంటారు. నా ప్రెస్‌మీట్ ఇప్పుడు అయిపోయింది. ఒక్కటి కూడా అబద్ధం చెప్పలేదు. అన్నీ ఆధారాలతో సహా చూపించా. కానీ రేప్పొద్దున టీడీపీ వాళ్లు ప్రెస్‌మీట్ పెడితే ఏం చేస్తారు. ఇక ఇష్టమొచ్చినట్లు తిట్లు. జగన్ ఇట్టా, జగన్ అట్టా.. ఆడికి సంతోషం. వాడు, వీడు అనకపోతే సంతోషపడాల. లేకపోతే అవికూడా కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు.


