
ఏడాదిగా చర్యలు శూన్యం.. వరదకు వంతెనలు విలవిల
ఇప్పటికే 5 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం
లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీళ్లు
గతేడాది బెజవాడను ముంచెత్తడంతో అపార ఆస్తి, ప్రాణ నష్టం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వర్షం కురిసిందంటే చాలు బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా బుడమేరు ప్రాంత నివాసులు గతేడాది విలయం తలుచుకుని గజగజ వణికిపోతున్నారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు ఏడాదిగా ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు స్థానికంగా కురిసిన వర్షాలకే బుడమేరుకు 5,000 క్యూసెక్కులపైగా వరద వచ్చింది. ఏలూరు కాలువకు వెయ్యి క్యూసెక్కులు, మిగిలిన నీటిని బుడమేరు కాలువ ద్వారా బయటికి పంపే యత్నం చేస్తున్నారు.
బుడమేరు పరిధిలో ఆక్రమణల మాట దేవుడెరుగు కనీసం పూడికతీత కూడా సక్రమంగా చేయలేదు. గుణదల, నిడమానూరు, రామవరప్పాడు, గూడవల్లి ప్రాంతాల్లో బుడమేరు వంతెనలను వెడల్పు చేయకపోవడంతో పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నీళ్లు నిలువ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ఇళ్లలోకి ప్రవహిస్తోంది. రోడ్లు కోతకు గురి అవుతున్నాయి. బుడమేరు కాలువ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులని చెబుతున్నా ఆక్రమణలు, పూడికతో కాలువ కుంచించుకుపోయింది.
మూడు వేల క్యూసెక్కులకే కాలువ పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవటం, బుధవారం వరకు వెలగలేరు వద్ద వరద లేకపోవడంతో బెజవాడ ఊపిరి పీల్చుకుంది. గురువారం ఉదయం వెలగలేరు వద్దకు 3 వేల క్యూసెక్కుల వరద రాగా డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి పంపారు. 10,500 క్యూసెక్కుల వరకు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణాలోకి పంపే అవకాశం ఉంది. అయితే ఇదే వర్షం కొనసాగి ఉంటే బుడమేరు వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేవి.
మాయ మాటలతో సరి..!
బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి సర్కారు మాయ మాటలతో మభ్యపెట్టింది. గతేడాది విరుచుకుపడ్డ వరదకు 32 డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారమే 2.62 లక్షల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకక వారం రోజులపాటు వరద నీటిలోనే విలవిల్లాడాయి. పెద్దఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి, నష్టం జరిగింది. ముంపు నివారణకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ప్రకటించిన సీఎం చంద్రబాబు చివరకు రూ.39.47 కోట్లతో సరిపెట్టారు. ఆ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు.
విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేలా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ అంటూ మంత్రులు కొద్ది రోజులు హడావుడి చేశారు. తొలిదశలో బుడమేరు సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. 13.25 కిలోమీటర్లు మేర బుడమేరు ఆక్రమణలకు గురైంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటికి సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి.
చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంపు ప్రతిపాదన బుట్టదాఖలైంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలో మీటర్ల మేర కాలువ గట్ల పటిష్టానికి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలకే బుడమేరు ముంపు ప్రాంతాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన స్థితి ఉంది. 660 మందిని ఆ కేంద్రాలకు తరలించారు. గతంలో కృష్ణలంకలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని నగర వాసులు వాపోతున్నారు.
పుట్టగుంట వంతెన వద్ద ఉధృతి..
పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా వంతెన వద్ద 17.5 అడుగుల మేర వరద ఉంది. 20.5 అడుగులకు చేరితే మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేసే అవకాశం ఉంది. నందివాడ మండలంలో ఇప్పటికే 6 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు.

బుడమేరు ప్రవాహం మరింత పెరిగితే పరీవాహక గ్రామాలు గతేడాది మాదిరిగా ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వంతెన వద్ద ఎంఎన్‌కె రహదారి కోతకు గురవడంతో సగం మేర ధ్వంసమైంది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఉన్నా పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.
వర్షం పడితే వణుకే..
బుడమేరు వరద విలయానికి ఏడాది అవుతున్నా ఆ బీభత్సం ఇంకా కళ్లెదుట మెదులుతూనే ఉంది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం. వర్షం పడుతుంటే మా కాలనీ వాసులకు వణుకొస్తోంది. సంవత్సరం గడిచినా వరద నీరు మళ్లీ మా ఇళ్లల్లోకి రాదనే భరోసాను ప్రభుత్వం కల్పించలేకపోయింది. బుడమేరులో ఆక్రమణలు, పూడికలు తొలగించాలి. ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటుపై సమాచారం సరిగా లేదు. – టి.బాల, అరుణోదయనగర్, 57వ డివిజన్, విజయవాడ
కొద్దిపాటి వానకే ఇళ్లల్లోకి నీళ్లు..
సింగ్‌నగర్, నందమూరినగర్‌లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీ నీళ్లు.. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. గతేడాది వచ్చిన వరదలను మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇల్లు మునిగిపోయి సర్వస్వం కోల్పోయాం. ఇప్పుడు రెండు రోజుల వర్షానికే 68 ఇళ్లకుగానూ 30 ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేశాయి. రోడ్లన్నీ మునిగిపోవడంతో మోటార్లు పెట్టి తోడుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా డ్రెయినేజీ నీరు సక్రమంగా పారేలా, వర్షపునీరు నిలవకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలు నందమూరినగర్‌పై దృష్టిపెట్టి ముంపు ముప్పును తొలగించాలి. – వై.ప్రసాదరావు, నందమూరినగర్, 58వ డివిజన్, విజయవాడ
