
గ్రేటర్ విశాఖ, మరో 4 మున్సిపాలిటీలు, 40 మండలాల్లో ఖాళీ పదవుల భర్తీకి పరోక్ష ఎన్నికలు
సాక్షి, అమరావతి: గ్రేటర్ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు సోమవారం మరో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ పదవితోపాటు బొబ్బిలి(విజయనగ రం), ఆదోని (కర్నూలు), తిరువూరు (ఎన్టీఆర్), కదిరి (శ్రీ సత్యసాయి) మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకోసం జీవీఎంసీ కార్పొరేషన్, ఆయా మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కదిరి మున్సిపాలిటీలో ముందుగా చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించి, ఆ తర్వాత వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ జిల్లా కలెక్టరుకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలా...
శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపెంట, రామగిరి మండలాలతోపాటు పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి మండలాల్లో ఎంపీపీ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అత్తిలి(పశి్చమ గోదావరి), కారంపూడి, నరసరావుపేట(పల్నాడు), దగదర్తి(ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు), సర్వకోట(శ్రీకాకుళం), వి.మాడుగల(అనకాపల్లి), దేవరాపల్లి(అనకాపల్లి), కైకలూరు (ఏలూరు), పిట్టలవానిపాలెం(బాపట్ల), దుగ్గిరాల(గుంటూరు), మార్కాపురం, త్రిపురాంతకం (ప్రకాశం), తవనంపల్లి(చిత్తూరు), కంబదూర్ (అనంతపురం) మండలాల్లో వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
కొత్తవలస (విజయనగరం), చోడవరం (అనకాపల్లి), కడియం (తూర్పు గోదావరి) మండలాల్లో మండల కో–ఆపె్టడ్ పదవులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 19 మండలాల్లోని 20 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా ఆరు మండలాల్లోని ఏడు పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు ఉన్నాయి. ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నిక కమిషనర్ ఆదేశించారు.