
రైల్వే ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం
అందులో ఒకరు.. మరో ఇద్దరిపై చాకుతో దాడి
తొలుత దోపిడీ కేసుగా నమోదు
దర్యాప్తులో వెలుగులోకి అసలు విషయం
విశాఖపట్నం జిల్లా: రైల్వే ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాహేతర సంబంధం చివరికి చాకుపోట్లకు దారితీసింది. తనతో సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని ఒక ఉద్యోగి ఈ దాడికి పాల్పడ్డాడు. తొలుత దోపిడీ కేసుగా నమోదైన ఈ ఘటన..
పోలీసుల దర్యాప్తులో వివాహేతర సంబంధమే అసలు కారణంగా తేలడంతో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం, గణపతినగర్‌లోని ఒక రెసిడెన్సీలో నివాసముంటున్న చంద్రకళ(రైల్వే ఉద్యోగి) భర్త మరణానంతరం ఉద్యోగం పొందింది. ఆమెకు రైల్వే మెకానికల్ విభాగంలో పని చేసే ఏనుగుల నాగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి నాగరాజు చంద్రకళ ఇంటికి వచ్చాడు. రాత్రి అక్కడే ఉన్నాడు.
అయితే, చంద్రకళ మరొకరితో సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్న నాగరాజు.. మధ్య రాత్రి తాను వెళ్లిపోతున్నానని చెప్పి.. అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై దాక్కున్నాడు. నాగరాజు వెళ్లిపోయాడని భావించిన చంద్రకళ.. లోకో పైలెట్‌గా పని చేస్తున్న గౌరి నాయుడును తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తీసుకువచ్చింది. కొద్దిసేపటి తర్వాత, మేడపై దాగి ఉన్న నాగరాజు ఆమె ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో గౌరి నాయుడు, చంద్రకళ ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురూ చంద్రకళ కారులో బయలుదేరగా.. నాగరాజు గోపాలపట్నంలో దిగిపోయాడు. గౌరి నాయుడు, చంద్రకళ చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో చేరారు.
దోపిడీగా నమ్మించే ప్రయత్నం
ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన గౌరి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తాను డ్యూటీ దిగి ఉత్తర సింహాచలం నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారని పేర్కొన్నాడు. బంగారు చైన్, డబ్బులు అడిగారని, నిరాకరించడంతో కత్తితో దాడి చేశారని చెప్పాడు. దీంతో గోపాలపట్నం పోలీసులు తొలుత దోపిడీ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు దాడికి కారణం రైల్వే ఉద్యోగుల మధ్య ఉన్న వివాహేతర సంబంధమేనని తేలింది. రహస్యం బయటపడకుండా ఉండేందుకే బాధితులు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో వాస్తవం బయటపడటంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు.