జి–20 సదస్సుతో విశాఖకు ప్రపంచ గుర్తింపు

Visakhapatnam gets global recognition with the G 20 summit - Sakshi

దేశం గర్వించేలా సదస్సు నిర్వహించాలి 

సదస్సు నిర్వహణపై మంత్రుల సమీక్ష 

28వ తేదీ సాయంత్రం సీఎం జగన్‌ ప్రసంగం: మంత్రి రజిని 

సదస్సుకు ఏర్పాట్లు పూర్తి :  మంత్రి అమర్‌నాథ్‌

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే జి–20 సదస్సు ద్వారా విశాఖ నగరానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్‌ మరింత పెంచేలా, దేశం గర్వించేలా ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జరిగే జి–20 సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్ తో కలిసి జిల్లా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘జి–20 సదస్సుకు 40 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 28వ తేదీన రాడిసన్‌ బ్లూ హోటల్లో బ్రేక్‌ఫాస్టు తర్వాత హోటల్లోని కన్వెన్షన్‌ హాలులో ప్రధాన సమావేశం జరుగుతుంది.

అనంతరం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 వరకు మూడు రకాల సమావేశాలు జరుగుతాయి. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు అదే హోటల్‌ సమీపంలోని బీచ్‌లో డిన్నర్‌ ఉంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి’ అని మంత్రి రజిని వివరించారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధాని కాబోయే విశాఖ నగరం అభివృద్ధి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.

జి–20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top