‘ఈనాడు’పై విశాఖ ఎంపీ పరువు నష్టం దావా

Visakha MP MVV Defamation Suit Against Eenadu - Sakshi

తప్పుడు కథనంతో నా పరువు, మర్యాదలకు భంగం

పోలీసులకూ ఫిర్యాదు

2018లో నేను ఎంపీని కాదు కదా.. వైఎస్సార్‌సీపీలోనూ చేరలేదు

అక్కడ 2019 మార్చిలోనే భవనానికి అనుమతులొచ్చాయి

ఇదంతా అసలు పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం

ఈ వివరాలన్నీ ఆ పత్రిక ప్రస్తావించలేదు

నాపై ఆ పత్రికలో వచ్చిన కథనం నిరాధారమైనది

ఈనాడు ఖండన ప్రచురించాలి.. ఆన్‌లైన్‌లో ఆ కథనం లింక్‌లు తొలగించాలి

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

మహారాణిపేట (విశాఖ దక్షిణ) : ఈనాడు పత్రికపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరువు నష్టం దావా వేయడంతోపాటు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఈనెల 13న ఈనాడులో ‘ఎంపీ గారి దందా’ శీర్షికతో వచ్చిన క«థనం పూర్తిగా నిరాధారమైనదని, తన పరువుమర్యాదలకు భంగం కలిగించేలా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనాడు కథనంలో చెప్పిన పది ఎకరాల 57 సెంట్ల భూమికి సంబంధించిన వాస్తవాలను ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

ఆ వివరాలేవీ ఈనాడు ప్రస్తావించలేదు
ఈ భూమి వ్యాపార లావాదేవీలు 2012లో మొదలై భూ యజమానులతో అగ్రిమెంటు 2018 జనవరి 8న జరిగిందని.. అప్పటికి తాను పార్లమెంటు సభ్యుడ్నిగానీ, కనీసం వైఎస్సార్‌సీపీ సభ్యుడ్ని కూడా కాదని ఎంపీ స్పష్టంచేశారు. తాను 2018 మేలో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. ఒక వ్యాపారిగా ఈ భూమికి చెందిన ప్రైవేటు వ్యక్తులందరితోను ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని నిర్మాణం మొదలుపెట్టానని తెలిపారు. ఈ భవనానికి జీవీఎంసీ 2019 మార్చిలో అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, ఈనాడు పత్రికలో ఈ విషయాలేవీ ప్రస్తావించకుండా తప్పుడు కథనం ప్రచురించిందని ఆరోపించారు.

ఇది పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం..
నిజానికి.. కూర్మన్నపాలెంలో ఈ భూమిపై వివాదం 1982 నుంచి సుదీర్ఘకాలంగా నడుస్తోందన్నారు. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్‌ లేబర్‌ బోర్డు (డీఎల్‌బీ) ఉద్యోగులతోపాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య ఈ వివాదం ఉందని.. దీన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న తనను 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు ఆశ్రయించారని ఎంపీ సత్యనారాయణ తెలిపారు. ఆ 160 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లాట్‌ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తామని తాను చెప్పడంతో వారు తమ వాటాను తనకు 2012లోనే అగ్రిమెంటు చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇక ఆ తర్వాత కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో తాను సంప్రదింపులు జరిపానని, 2012లో మొదలైన ఈ ప్రక్రియ చివరకు 2017లో ముగిసిందని, వారికి 30 వేల చదరపు అడుగులు ఇచ్చేలా 2017లో ఎంఓయూ కుదిరిందన్నారు. ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులు ఇచ్చే విధంగా 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నామని, ఇవన్నీ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు, వీటికి ప్రభుత్వంలో ఉన్న వారికి ఎటువంటి సంబంధంలేదని ఎంపీ స్పష్టంచేశారు. ఈ ఒప్పందాలతోపాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లింపులు కూడా చేశామన్నారు.

2019 మార్చిలోనే ప్లాన్‌కు జీవీఎంసీ ఆమోదం
ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించిందని ఎంపీ తెలిపారు. అక్కడ ధర చదరపు అడుగు రూ.4 వేల మేర ఉన్నా ఇందులో కొన్న సుమారు 1,800 మందికి రూ.2,500కే ఇచ్చామని, గేటెడ్‌ కమ్యూనిటీ సదుపాయాలున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు రూ.30 లక్షలలోపు ధరకే అందించానని, ఇదంతా పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో.. ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనం అవాస్తవమని.. ఈనాడు యాజమాన్యం ఖండన ప్రచురించాలని, అలాగే.. ఈనాడు నెట్‌వర్క్‌లో ఈ కథనానికి సంబంధించి ఆన్‌లైన్‌ లింక్స్‌ తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావుకు, అదే విధంగా ఎడిటర్‌ (ప్రింట్‌ మీడియా) పై చట్టబద్ధమైన సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, వారికి రిజిస్టర్డ్‌ పరువు నష్టం నోటీసును ఇస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top