గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ: ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానం

Village Volunteer System A Bridge To People To Government - Sakshi

పాలన పారదర్శకంగా ఉండాలి...  ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు అందరికీ అందాలి.. లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియాలి..  సంక్షేమ పథకాల వివరాలు  ప్రజలకు తెలిసుండాలి... ఈ రెండింటి మధ్య వారధి కావాలి..  సంధాన కర్తలు కావాలి ఆ ఏర్పాటు ఓ వ్యవస్థలా ఉండాలి.. ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు  అది మనుగడ సాగించాలి..  అదే గ్రామ సచివాలయ వాలంటీర్‌ వ్యవస్థ.. దాదాపు రెండేళ్ల కిందట దేశంలోనే మొదటిసారిగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు. పకడ్బందీగా అమలవుతున్న విధానం.

కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అయ్యారు ఆ వాలంటీర్లు..  వైరస్‌ సోకిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు..  ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందులు, కూరగాయలు, నిత్యావసర సరకులు సరఫరా చేస్తున్నారు. వైరస్‌తో పోరాడి చనిపోయిన వ్యక్తులనూ మోసి చివరి మజిలీకి చేర్చుతున్నారు.. కష్టకాలంలో కనిపించిన వాళ్లే  ఆప్తులు.. ఆత్మీయులు..  వాళ్లే ఆంధ్రప్రదేశ్‌ సర్కారు పంపిన వాలంటీర్లు!!

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా జాతిపిత 150వ జయంతి సందర్భంగా అక్టోబరు 2 వ తేదీ 2019న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌  రెడ్డి ప్రారంభించారు. అలా ఆ వాలంటీర్లు ఆ రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాల్లో సభ్యులుగా ఇమిడిపోయారు.  వాళ్ల పనిని  కళ్లకు కట్టడానికి  కరోనా పరిస్థితిని మించిన ఉదాహరణ ఉండదు. పకడ్బందీగా అమలవుతున్న ఆ వ్యవస్థ గురించి వివరించడానికి  ఇంతకు మించిన సందర్భం రాదు.. 

కుటుంబ సభ్యుడై...
ఇది ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం, ఆమోదగిరి పట్నంలో జరిగిన కథ. మనసును తడి చేసే వ్యథ. కృష్ణమూర్తికి 75 ఏళ్లు. ఊరిలో ఒంటరిగా ఉంటున్నాడు. పింఛను దారులు అందరికీ ఇచ్చినట్టే క్రమం తప్పకుండా అతనికీ పింఛను ఇచ్చొస్తుంటాడు వాలంటీర్‌ మోదుగుల దినేష్‌. ఎప్పటిలా ఆ నెలా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లాడు దినేష్‌ పింఛను ఇచ్చేందుకు. అస్వస్థతతో మంచంలో కదల్లేని స్థితిలోఉన్నాడు కృష్ణమూర్తి. అతణ్ణలా చూసి చలించిపోయాడు దినేష్‌.  ‘ఇంట్లో ఎవరు లేరా ?’ అడిగాడు. ‘పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు’ అని బదులిచ్చాడు ఆ వృద్ధుడు.

అంతే! క్షణం కూడా ఆలస్యం చేయకుండా 108కి ఫోన్‌ చేశాడు దినేష్‌. పీపీఈ కిట్‌ ధరించి కృష్ణమూర్తి వెంట తను కూడా  చీరాల ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు అంబులెన్స్‌లో. ఆసుపత్రి రికార్డులో కృష్ణమూర్తి సంరక్షకుడిగా సంతకం చేశాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మరణించాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు దినేష్‌. అయినవాళ్ళందరూ కృష్ణమూర్తిని కాదనుకున్నా వాలంటీర్‌గా తన ధర్మాన్ని నిర్వర్తించి అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు ఆ వాలంటీర్‌.

తన ఆటోనే అంబులెన్స్‌..!
కరోనా తీవ్రత ముందు మిగిలిన వ్యాధులు, వ్యాధిగ్రస్తుల కష్టాలు చిన్నవిగా కనపడుతున్నాయి. అలాంటి వారికి అండగా నిలుస్తున్నాడు వాలంటీర్‌ ఈడా శ్రీనివాస రావు. అతనిది కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, ప్రొద్దుటూరు. ఉపాధి కోసం తానొక ఆటోను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ ఆటోనే ఆ గ్రామానికంతటికీ అంబులెన్స్‌ అయింది. విషమస్థితిలో ఉన్న రోగులను, గర్భిణీలను తన ఆటోలోనే ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. సత్వరమే వారికి  వైద్యసేవలు అందేలా తోడ్పడుతున్నాడు. ఇలా తన సేవతో ఈ వాలంటీరు ప్రజా బంధువయ్యాడు. 

ఒక్క నెలలో 298 మందికి...
వైఎస్సార్‌ జిల్లా 8వ డివిజన్‌ లోని శంకరాపురం 8/2 సచివాలయంలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్‌ అబ్బాస్‌ తనకొచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాడు. తన స్నేహితుల సహకారంతో అనాథ శవాలతోపాటు కోవిడ్‌తో చనిపోయిన (రక్తసంబంధీకులు పట్టించుకోని) వారిని గుర్తించి వారివారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపిస్తున్నాడు. కులమతాలకు అతీతంగా  పౌరుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. మానవత్వాన్ని చాటుతున్నాడు.  ఒక్క నెలలోనే 298 మందికి అంత్యక్రియలు నిర్వహించాడు అబ్బాస్‌. 

ఆ నలుగురై..
అనంతపురం జిల్లా..  తలుపుల మండలంలోని ఓబుళరెడ్డిపల్లి.. ఎస్సీ కాలనీకీ  చెందిన 58 ఏళ్ల  జయరాం చనిపోయాడు...కరోనాతో. చూడ్డానిక్కూడా రాలేదు అయినవాళ్లు. కరోనాకు భయపడి. అతని అంత్యక్రియలకూ ప్రేక్షకులుగానే ఉండిపోయారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా బాబ్జాన్, సాదిక్‌ బాషా, ఇమ్రాన్‌ల చెవిన పడింది. వాళ్లు గ్రామ వాలంటీర్లు.  జయరాం మృత దేహానికి అంత్యక్రియలు చేయాలని నిశ్చయించు కున్నారు. సహచరుడు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణతో కలిసి రంగంలోకి దిగారు. ఈ నలుగురే ఆ నలుగురిగా మారి జయారం అంత్యక్రియలు జరిపించారు. అతని చివరి మజిలీని సుగమం చేశారు. 

బాధ్యతగా.. 
గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలం, విప్పర్లపల్లి.. ఈ ఊరిలో ఓ దివ్యాంగుడితో పాటు ఒక వృద్ధుడూ మరణించాడు. వారి అంతిమసంస్కారాలకు బంధువులెవరూ ముందుకు రాలేదు. దాంతో  గ్రామ పెద్దల సహకారంతో వాలంటీర్‌ గాదె నర్శింహారెడ్డియే ఆ ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. 

ఎందుకు ఏర్పాటు చేశారంటే
లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ పథకాలను పొందే హక్కుంది. అలాంటి సంక్షేమ పథకాల మీద అవగాహన లేక, అవి అందక నష్టపోతున్న ప్రజలు ఎంతోమంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ గ్రామ సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ. దీని ప్రకారం గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో 100 ఇళ్లకు ఒక వాలంటీరు ఉంటాడు. ప్రభుత్వ సంక్షేమ కారక్రమాలను ఇంటింటికీ చేరుస్తాడు.

అదేవిధంగా ఆయా కుటుంబాల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారులను గుర్తిస్తాడు. ఆయా సంక్షేమ కార్యక్రమాల అమలులో వారు ఎదుర్కొంటున్న సమస్యలనూ గుర్తిస్తాడు. ఈ వాలంటీర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులనూ  జారీచేస్తోంది. వారందించే సేవకు  ప్రోత్సాహకం కింద ప్రతినెల అయిదువేల రూపాయలను అందజేస్తోంది ప్రభుత్వం.

వాలంటీర్ల విధులు ఇవీ...

  • కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం.
  •  తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పనిచేయాలి. ఇందుకోసం  గ్రామ,వార్డు సచివాలయ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. 
  • ప్రభుత్వ పథకాలు, సహాయాన్ని ఇంటివద్దకే వెళ్లి అందించాలి. తమ పరిధిలో సంక్షేమ పథకాలు అందేందుకు అర్హత ఉన్న వారికి అవగాహన కల్పించి వారికి అందేలా పనిచేయాలి. 
  • విద్య, ఆరోగ్యపరంగా తమ పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.

మాస్కుల నుంచి సరుకుల వరకు..
కరోనా వల్ల  ఇతరులతో కలవాలంటేనే భయపడిపోయే పరిస్థితిలో తమ పరిధిలోని  కుటుంబాల ఆరోగ్యాన్ని వాలంటీర్లే పర్యవేక్షిస్తున్నారు. ఆయా ఇళ్లల్లో ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా అని ఆరా తీస్తున్నారు. కరోనా బారినపడ్డ వాళ్లను సొంత బంధువులే కన్నెత్తి చూడని స్థితిలో వారికి ప్రభుత్వం ఇచ్చే మెడికల్‌ కిట్‌ను అందిస్తున్నారు. అవసరమైన సరకులు,   కూరగాయలను తెచ్చిస్తున్నారు. ఈ విపత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరూ ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున మాస్కుల నుంచి సరుకుల వరకు అన్నిటినీ సరఫరా చేసి ఆ  కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు.

ఆయా వార్డుల పరిధిలో 45 ఏళ్లు పై బడిన వారందరికీ కరోనా వ్యాక్సీన్‌ వేయించడంలో వాలంటీర్ల కృషి మరువలేనిది. మొదటి డోసు తేదీ నుంచి రెండవ డోసు వేసుకునే వరకు వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించడంలో వాళ్ల పాత్ర కీలకం. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు 6 లక్షల వ్యాక్సీన్‌ డోసులను వేసి రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్‌. వాలంటీర్‌ వ్యవస్థ సహకారంలేనిదే ఇది సాధ్యమయ్యేది కాదు. 

నిరాటంకంగా పింఛన్‌ల పంపిణీ..
కరోనా మహమ్మారి  ప్రపంచాన్నే తలకిందులు చేస్తోంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పింఛను పంపిణీ కార్యక్రమం ఆగలేదు. ఎలాంటి ఆంటకంలేకుండా యథావిధిగా సాగుతోంది. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా వేకువజామునే ఇంటి తలుపుతట్టి మరీ లబ్ధిదారులకు పింఛన్‌ను అందిస్తున్నారు వాలంటీర్లు. అదొక్కటే కాదు  జనన, మరణ ధ్రువీకరణ పత్రం మొదలు ఇంటి పట్టాల పంపిణీ, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ వంటి సుమారు 545 సర్వీసులనూ ఆ రాష్ట్రంలోని ప్రతి గడపకు చేరవేస్తున్నారు. 

700 కిలోమీటర్లు వెళ్లి..
పుంగమ్మ సొంతూరు మడకశిర. మూడునెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా, ఉసిలంపట్టి గ్రామంలో చికిత్స పొందు తోంది. ఈ కారణంగా అంతకుముందు రెండు నెలల నుంచీ పింఛన్‌ తీసుకోవడంలేదు ఆమె. ఏప్రిల్‌ నెలా తీసుకోకపోతే ఆమె పింఛన్‌  రద్దు అవుతుందని గుర్తించాడు  వాలంటీర్‌ హరిప్రసాద్‌ . దాంతో ఉసిలంపట్టిలో ఆమె ఉంటున్న చిరునామా కనుక్కొని మరీ మడకశిర నుంచి  700 కిలో మీటర్లు దూరంలో ఉన్న  ఉసిలంపట్టికి వెళ్లాడు. మూడు నెలల పింఛన్‌ను పుంగమ్మ చేతిలో పెట్టాడు.  

సేవచేయడం అదృష్టం..
క్వారంటైన్‌లో ఉన్న చాలా మంది  నిత్యావసర సరుకులు లేక అవస్ధలు పడ్తున్నారు. ప్రతిరోజూ వాళ్లకు నిత్యావసర సరుకులు, కూరగాయలు తీసుకెళ్లి ఇచ్చాను.. దానికి కరోనా బాధితులు చాలా సంతోషించారు. కోలుకున్న తరువాత నాకు కృతజ్ఞతలూ తెలిపారు. వాలంటీర్‌ ఉద్యోగం చేస్తూ సొంత ఊరి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. 
– అనిత, వాలంటీర్, శ్రీపర్రు, ఏలూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.

పెళ్లి బట్టలతోనే..
లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికే కాదు.. తామెలాంటి పరిస్థితిలో ఉన్నా సేవలను ఆపట్లేదు  వాలంటీర్లు. రాజశేఖర్‌ నాయక్‌ అనే వాలంటీర్‌ గురించి చదివితే ఆ విషయం తెలస్తుంది. అతనిది అనంతపుర్‌ జిల్లా అమడగూరు మండలం, గోపాల్‌నాయక్‌ తండా. అతని పెళ్లి పెళ్లి ముహూర్తం,  పింఛన్లను పంపిణీ చేయాల్సిన రోజు ఒకటే. పెళ్లి కోసం పింఛన్లను వాయిదా వేసుకోలేదు. అలాగని పెళ్లి ముహూర్తాన్నీ తప్పించలేదు. సొంత పని, ఉద్యోగం రెండిటినీ బ్యాలెన్స్‌ చేసుకున్నాడు రాజశేఖర్‌ నాయక్‌. తాళి కట్టే కార్యక్రమం ముగిసిన వెంటనే పెళ్లి బట్టల మీదే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను ఇచ్చివచ్చాడా పెళ్లికొడుకు. పని పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నాడు.  

వ్యాధి విస్తరించకుండా నిఘా..
తమకు కేటాయించిన వార్డుల్లో, వీధుల్లో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తూ వారికి పరీక్షలు నిర్వహించే పనిలోనూ వాలంటీర్ల శ్రమను కొనియాడుతున్నారు వైద్యశాఖాధికారులు. కరోనా రోగులను చూసేందుకు సొంత కుటుంబ సభ్యులే  భయపడుతున్న సమయంలో  తామున్నామంటూ భరోసానిస్తున్నారు. గంట..గంటకూ వారిని పర్యవేక్షిస్తూ వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ.. ఆ సమాచారాన్ని  ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. వ్యాధి నియంత్రణలో అలుపెరగని పోరు కొనసాగిస్తున్నారు. 

ఆఖరి క్షణంలో... ఆపద్బాంధవుడై...
కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందిస్తున్నా మిగిలిన పనులనేం మరిచిపోలేదీ వాలంటీర్లు. తమ పరిధిలో ఎవరికీ ఏ సమస్య వచ్చినా ముందుంటున్నారు. పుట్టపర్తి మండలం, జగరాజుపల్లెలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. 
సుమలతకు పదకొండేళ్లు ఉండొచ్చు. అయిదో తరగతి చదువుతోంది.  పచ్చకామెర్ల వ్యాధితో హిమోగ్లోబిన్‌ 2 కంటే తక్కువకు పడిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వైద్యం కోసం స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లింది కుటుంబం. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో దిక్కుతోచక మనోవేదనకు గురైంది సుమలత తల్లి. బిడ్డ ప్రాణం మీద ఆశ వదులుకుని ఇంట్లో పెట్టుకుంది. విషయం తెలుసుకున్న వాలంటీర్‌ ప్రసాద్‌.. అక్కడి ఎంపీడీఓ సురేష్‌కృష్ణకు  సుమలత అనారోగ్యం గురించి చెప్పాడు. తక్షణమే స్పందించిన ఆ అధికారి సుమలతను  పుట్టపర్తి సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రిలో చేర్పించాడు. రక్తదానంతో పాటు పలు సేవలనూ అందించాడు. సుమలత ఇప్పుడు కోలుకుంటోంది. 

ఆసుపత్రుల్లోనే రోగులకు 
ఇంటి వద్దకే సేవలు కాదు.. లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడికీ తమ సేవలను తీసుకెళ్తున్నారు వాలంటీర్లు. పొట్టి శ్రీరాములు (నెల్లూరు) జిల్లా వెంకటగిరిలో అలాంటి సంఘటనే జరిగింది. ఒక రోజు  తిరుపతి ఆసుపత్రి నుంచి క్లస్టర్‌ ఇంచార్జి వెంకటాచలంకు  ఫోన్‌ వచ్చింది. ‘బాబూ..నేను వీరగంగయ్యను. ప్రాణం బాలేక తిరుపతి ఆసుపత్రిలో చేరా. ఖర్చులకు డబ్బులు చాలడం లేదు. నాక్కాస్త  పింఛన్‌ డబ్బులు తెచ్చిస్తావా?’అంటూ దీనంగా అడిగాడు ఆ వ్యక్తి.  వీరగంగయ్య తిరుపతిలోని ఏ  ఆసుపత్రిలో చేరాడో తెలుసుకొని వెంటనే  తిరుపతికి బయలుదేరాడు వెంకటాచలం. వీరగంగయ్యకు పింఛన్‌ అందించాడు. తన బాధ్యతను నెరవేర్చాడు.

ఆ జాబితాలో.. 
ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌ కు చెందిన ప్రభుత్వాలు ఈ వ్యవస్థ మీద అధ్యయనాన్ని మొదలుపెట్టేశాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి వంటి ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్‌ పంపించి అధ్యయనం చేయించాయి. ప్రపంచ దృష్టిలోనూ పడింది వాలంటీర్ల వ్యవస్థ. దీని పనితీరును తెలుసుకునేందుకు ఏకంగా ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ వాలంటీర్స్‌ (యూఎన్‌వీ) సంస్థ గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడి ఉన్నతాధికారులతో ఓ వెబినార్‌ను నిర్వహించింది. వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు, దాని పనితీరు పట్ల ఆసక్తి చూపారు యూఎన్‌వీ సిబ్బంది.  

19 నెలల్లోనే అద్భుతం
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పాలన రాజధాని నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి మండల కేంద్రానికి వచ్చింది. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో గ్రామానికీ, అక్కడి నుంచి నేరుగా ఇంటికే వచ్చింది. ఆ క్షణం నుంచి ఏ ప్రభుత్వ పథకమైనా.. సర్కారు సేవ ఏదైనా ఇంటికే చేరుతున్న కాలాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇందులో 15,006 సచివాలయాలు భాగస్వాములయ్యాయి. 2లక్షల  47వేల 609 మంది వాలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. కేవలం 19 నెలల్లోనే సాధించిన ప్రగతిగా దీన్ని నిర్వచించవచ్చు. అందుకే ఈ అద్భుతం దేశాన్నే కాదు ప్రపంచాన్నీ ఆకర్షించింది. అ«ధ్యయనాలు 
సాగిస్తోంది.

ఆమే  కాపాడింది..
కరోనాతో మా అబ్బాయి చనిపోయాడు. దాంతో మా కుటుంబాన్ని ఇల్లు వదిలి రావద్దని చెప్పారు. ఎవరమూ బయటకెళ్లకపోతే పనులెట్లా? పనుల సంగతి పక్కన పెట్టినా తిండి, తిప్పలైనా తీరాలి కదా! ఆ టైమ్‌లో ధైర్యం చెప్పి మా కుటుంబానికి కావల్సిన సరుకులు, కూరగాయలన్నీ తెచ్చిపెట్టింది మా వాలంటీర్‌ నాగ తులసి. ఆమె మా ఇంటికొచ్చే ధైర్యం చేయకపోతే మా గతి ఎట్లుండునో ఈ రోజుకి! ఆమె కాపాడింది మమ్మల్ని.  
– అన్నపూర్ణమ్మ, వైరస్‌తో మృతి చెందిన మారుతి తల్లి, బత్తలపల్లి, అనంతపురం జిల్లా

ఈ టైమ్‌లో నిలబడ్డం.. 
కరోనా టైమ్‌లో మా వార్డ్‌ కుటుంబాల వాళ్లకు అండగా నిలబడ్డం నిజంగా మా పనికి న్యాయం చేసినట్టని పిస్తోంది. వార్డుల్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మమ్మల్నే సంప్రదిస్తున్నారు. హోం క్వారంటైన్‌ లో ఉన్నవారికి  భోజనాలు, పాలప్యాకెట్లు అందిస్తున్నాం. 30 మందికిపైగా కరోనారోగులను ఆసుపత్రిలో చేర్పించా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా రోగులకు సేవ చేస్తున్నా. 
– ప్రభుదాస్, వాలంటీర్, దేవనగర్, నంద్యాల, కర్నూలు జిల్లా

ఎంతోమందికి.. 
నాది మధ్యతరగతి కుటుంబం. బీఎస్సీబీఈడీ చేసాను. కిందటేడే వాలంటీరుగా  చేరాను. మా ఊళ్లో ఎంతోమందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాననే సంతృప్తి ఉంది. ఈ మధ్యే మా ఊళ్లో ఓ  కుంటుంబంలోని పెద్దకు కోవిడ్‌ సోకి  చనిపోయాడు. దహనం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. మా సర్పంచ్‌ సహకారంతో మేమే అంత్యక్రియలు చేశాం. కష్ట సమయంలో తోటి గ్రామస్తులకు ఇలా అండగా నిలబడగలుగుతున్నాం. 
– వెంకటరమణ, వాలంటీర్, అట్టలి గ్రామం, పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా.

కుటుంబంలో భాగమయ్యారు
ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చెరవేసేందుకు, వాటి అవగాహనను కల్పించేందుకే ఏర్పాటయిన వాలంటీర్లు వాళ్ల సేవలతో ఈ రోజు వాళ్ల వాళ్ల పరిధిలోని కుటుంబాల్లో భాగమయ్యారు. ఏ కష్టమొచ్చినా స్పందిస్తున్నారు. ఈ పాండమిక్‌లోనైతే అన్నీ తామై అండగా ఉంటున్నారు.  
– మురళీధర్‌ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌

సంతోషాలు నింపింది
నోరు లేని... మండల కార్యాలయాల చుట్టూ తిరగలేని పేద ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలనను తెచ్చింది.. వారి జీవితాల్లో సంతోషాలను నింపిందీ వ్యవస్థ.  ప్రధానంగా అనంతపురం జిల్లా వంటి వెనకబడిన ప్రాంతాలకు ఇది చాలా కావాల్సిన, ఉపయోగపడే సిస్టమ్‌ అని చెప్పొచ్చు.  
– గంధం చంద్రుడు, అనంతపురం జిల్లా కలెక్టరు

ఏ సమాచారమైన అరగంటలోనే...!
ఏ రాష్ట్రానికి లేనటువంటి సమాచార వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. దీనికి కారణం వాలంటీర్లే. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా, కొత్త సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా వెంటనే సచివాలయాలకు మేం పంపుతున్నాం. సచివాలయాల కార్యదర్శులతో మాకు ఒక వాట్సాప్‌ గ్రూపు ఉంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ఆయా గ్రామాల్లోని వాలంటీర్లకు చేరవేస్తున్నారు. వారు తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాలతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమచారాన్ని వారు వాట్సాప్‌ గ్రూపులో పెడుతున్నారు. ఒకవేళ ఎవరికైనా స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే ఎస్సెమ్మెస్‌ చేస్తున్నారు. దీనివల్ల  కేవలం అరగంటలోనే రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేయగలిగామంటే కేవలం ఈ సిస్టమ్‌ వల్లే. 
– అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సెక్రటేరియట్‌ మరియు వాలంటీర్ల శాఖ

– కె.జి. రాఘవేంద్రారెడ్డి
ఇన్‌పుట్స్‌: సాక్షి ఏపీ నెట్‌వర్క్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top