అతి త్వరలో గడపగడపకు వైద్యం.. అందరూ సిద్ధంగా ఉండాలి

Vidadala Rajini in Regional Review of Medical Health Department - Sakshi

గుంటూరు మెడికల్‌: రాష్ట్రంలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్యవిధానాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న పథకాలు, అందిస్తున్న సేవలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తొలిసారిగా మంగళవారం గుంటూరులో ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానం అమల్లోకి వచ్చాక ప్రభుత్వమే ఇంటింటికి వైద్యసేవలు అందిస్తుందన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం కొత్తగా 176 మంది మెడికల్‌ ఆఫీసర్లను, 1,681 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమిస్తామని తెలిపారు.

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లలో 65 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా ప్రత్యేక యాప్‌లు కూడా అన్ని స్థాయిల సిబ్బందికి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఎంయూ వాహనాలను 45 రోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. 

ఆరోగ్యశ్రీ రూపు మార్చిన సీఎం వైఎస్‌ జగన్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని మరింతగా పెంచారన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని తమ ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన వారికి ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్యవిధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయన్నారు. వైద్యులు, ఏఎన్‌ఎంలు వారి ఇళ్లకు సేవలందిస్తారని చెప్పారు.

ఆరోగ్యశ్రీ ద్వారా పొందిన వైద్యంపై రోగులు సంతృప్తి చెందకపోతే వారితో మాట్లాడిన వీడియోలను ఏఎన్‌ఎంలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారని, తద్వారా ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకునే వీలుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మాతా శిశు మరణాలు దాదాపు సున్నాకు తగ్గాయన్నారు. పీహెచ్‌సీల్లో నెలకు కనీసం పది డెలివరీలు అయినా చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్‌కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, ఎల్‌.శివశంకర్, ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్‌.హెచ్‌.ప్రసాద్, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ నెల్లూరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top