యూఎస్‌.. డబుల్ ఇస్మార్ట్ | US warships deployed off the coast of Visakhapatnam | Sakshi
Sakshi News home page

యూఎస్‌.. డబుల్ ఇస్మార్ట్

Apr 7 2025 5:36 AM | Updated on Apr 7 2025 5:36 AM

US warships deployed off the coast of Visakhapatnam

మెరుపువేగంతో దాడి చేసే కన్నింగ్‌ ‘కామ్‌స్టాక్‌’

శత్రువుల స్థావరాలపై రచ్చ చేసే ‘రాల్ఫ్‌ జాన్సన్‌’

విశాఖ తీరంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు

టైగర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాల్లో సత్తా చాటుతున్న భారత్, యూఎస్‌  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శత్రువు కనిపిస్తే చాలు.. తేరుకునేలోగా మెరుపుదాడి చేసే వార్‌షిప్‌ ఒకటైతే.. దొంగచాటుగా దెబ్బతీయాలనుకున్న వారిపై దాడి చేసి మట్టుబెట్టే యుద్ధ నౌక ఇంకోటి. వైరి దేశాలపై బరిలో దిగితే వార్‌ వన్‌సైడ్‌ అని డిసైడ్‌ చేసే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ టెర్మినల్‌ వద్ద మోహరించాయి. కదన రంగంలో ఎంతటి భయంకరంగా శత్రువును భయపెడతాయో.. విపత్తుల సమయంలో సహాయ సహకారా­లు అందించడంలోనూ అంతే గంభీరంగా వ్యవహరిస్తాయి ఈ వార్‌షిప్స్‌.

వీటిలో ఒకటి అమెరికా నౌకాదళంలో తొలిసారిగా పురుషులు, మహిళా నావికులతో కూడిన యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ కామ్‌­స్టాక్‌ (ఎల్‌ఎస్‌డీ–45) కాగా.. మరోటి మెరుపు వేగంతో దాడి చేసి మృత్యువును పరిచయం చేసే (స్విఫ్ట్‌ సైలెంట్‌ డెడ్లీ) యుద్ధనౌకగా పేరున్న యూఎస్‌ఎస్‌ రాల్ఫ్‌ జాన్సన్‌ (డీడీజీ–114). ఒక యుద్ధ నౌకలో రాత్రిళ్లు కూడా గ్రెనేడ్లతో దాడి చేసేఅవకాశం ఉన్న లాంచర్లు.. ఏకంగా 8,200 అడుగుల దూరంలోని శత్రువును కూడా మట్టుబెట్టగలిగే సామర్థ్యం ఉన్న రైఫిల్‌ ఉన్నాయి. 

మరోదానికి శత్రువుపై 2 సీ హాక్‌ హెలికాప్టర్ల ద్వారా దాడి చేసే సామర్థ్యం ఉంది. చాటుగా దెబ్బతీసేందుకు శత్రు దేశాలు అమర్చిన మైన్లను గుర్తించి నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉంది. ఇవి భారత్‌–అమెరికా దేశాల త్రివిధ దళా­లతో టైగర్‌ ట్రయాంఫ్‌–25 నాలుగో ఎడిషన్‌ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ నౌకల విశేషాలను యూఎస్‌ఎస్‌ రాల్ఫ్‌ జాన్సన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ జాక్‌ సీజర్, కామ్‌స్టాక్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ బి.స్టాక్స్‌ వివరించారు.  

యూఎస్‌ఎస్‌ కామ్‌స్టాక్‌ (ఎల్‌ఎస్‌డీ–45)
» జల ప్రవేశం – 1990, ఫిబ్రవరి 3 
»తరగతి, రకం – విడ్బీ ఐల్యాండ్‌–క్లాస్‌ డాక్‌  ల్యాండింగ్‌ షిప్‌ 
» బరువు – 16,190 టన్నులు 
» పొడవు – 609 అడుగులు(186 మీటర్లు) 
» వెడల్పు – 84 అడుగులు (26 మీటర్లు) 
»వేగం – 20 నాట్స్‌ (37 కిమీ/గం) 
» సిబ్బంది సామర్థ్యం– 450 

ఆయుధ సామర్థ్యం 
2‘‘25 ఎంఎం, ఎంకే 38 కెనాన్స్, 2‘‘20 ఎంఎం ఫాలాన్కస్‌ సీఐడబ్ల్యూస్‌ మౌంట్స్, 6‘‘50 కాలిబర్‌ ఎంఈహెచ్‌బీ మెషిన్‌ గన్స్, 2 రామ్స్‌ 
»   యూఎస్‌ఎస్‌ కామ్‌స్టాక్‌ యూఎస్‌ నేవీలో ఒక డాక్‌ ల్యాండింగ్‌షిప్‌ 
» జలమార్గంలో నిర్దేశిత ప్రాంతాలకు రక్షణ దళాలు, యుద్ధ సామగ్రి తరలింపులో కీలక పాత్ర పోషిస్తోంది. 
»  ఉభయచర కార్యకలాపాల సమయంలో శత్రువులపై గగనతలం నుంచి విరుచుకుపడేందుకు వీలుగా ఈ నౌకపై హెలికాప్టర్‌ లాంచింగ్‌ సౌకర్యముంది. 
» ఈ నౌకలో నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌ ల్యాండింగ్‌ సదుపాయాలతో పాటు మూడు రకాల మెషిన్‌ గన్లు, రెండు రోలింగ్‌ ఎయిర్‌ఫ్రేమ్‌ మిస్సైల్స్‌ మౌంట్స్‌ ఉన్నాయి. 
»  పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలతో పాటు అధునాతన సాంకేతికతతో ఈ నౌక యుద్ధ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 
»  1992లో సోమాలియాలో ‘ఆపరేషన్‌ రిస్టోర్‌ హోప్‌’ పేరుతో ఐక్యరాజ్య సమితి చేపట్టిన సహాయ కార్యక్రమంలో పాలుపంచుకుంది.  

యూఎస్‌ఎస్‌ రాల్ఫ్‌ జాన్సన్‌ (డీడీజీ–114)
» జల ప్రవేశం: 2018, మార్చి 24 
» తరగతి, రకం: ఆర్లీగ్‌ బర్కీ–క్లాస్‌ డిస్ట్రాయర్‌ 
» బరువు–9217 టన్నులు 
» పొడవు– 513 అడుగులు (156 మీటర్లు) 
» వెడల్పు– 66 అడుగులు (20 మీటర్లు) 
» వేగం– 30 నాట్స్‌ (56 కిమీ/గం) 
» సిబ్బంది సామర్థ్యం– 300 ఆయుధ సామర్థ్యం 
» 8 రకాల లైట్, మెషిన్,  కాలిబర్‌ గన్నులు ఉన్నాయి. 
» ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేందుకు 96 సెల్స్‌తో క్షిపణులు, నాలుగు రకాల టార్పిడోలు, 2 సీహాక్‌ హెలికాప్టర్లు, డబుల్‌ హ్యాంగర్, హెలీప్యాడ్‌ సౌకర్యాలు ఉన్నాయి. 
»  యూఎస్‌ఎస్‌ రాల్ఫ్‌ జాన్సన్‌ నౌక యుద్ధ క్షేత్రంలో 9 రకాల పోరాట వ్యవస్థలను కలిగి ఉంది. 
» ఈ నౌకను అమెరికా 7వ నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్‌ స్క్వాడ్రన్‌ 15కు కేటాయించారు. 
»  ఇందులో సమీకృత వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐఎంఎండీ)తో పాటు బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. 
»   వెర్టికల్‌ లాంచింగ్‌ సిస్టం ద్వారా 96 సెల్స్‌ నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం దీని సొంతం. 
»  అంతర్జాతీయ జలాల్లో యూఎస్‌ 
నౌకాదళ శక్తి సామర్థ్యాలు చాటిచెప్పేలా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. 
»  దాడి కోసం శత్రుదేశాలు వ్యూహాత్మకంగా మోహరించిన మైన్లను కనుగొని నాశనం చేసే సాంకేతిక పరిజ్ఞానం ఈ యుద్ధ నౌక సొంతం. 
»  ఏ మాత్రం రాజీలేని, వెనుదిరగని యుద్ధ నౌకగా దీనికి పేరుంది.  

ఎం–320 గ్రెనైడ్‌ లాంచర్‌ 
యూఎస్‌ఎస్‌ కామ్‌స్టాక్‌ (ఎల్‌ఎస్‌డీ–45) యుద్ధ నౌకలో ఉండే ఎం–320 గ్రెనైడ్‌ లాంచర్‌ అన్ని సమయాల్లో శత్రువులపై గ్రెనైడ్లతో దాడికి ఉపయోగిస్తారు. పగటి వేళలోనే కాక తక్కువ కాంతి ఉన్న సమయాలు, రాత్రిళ్లు కూడా ఇది గ్రెనైడ్లతో దాడి చేస్తుంది. ఏకంగా 36.. 40 ఎంఎం గ్రెనైడ్లను ఈ లాంచర్‌తో తీసుకెళ్లే వీలుంది. ప్రధానంగా రాత్రిళ్లు శత్రువులపై దాడికి దీనిని ఉపయోగిస్తారు.  

కార్ల్‌ గుస్తఫ్‌ రైఫిల్‌  
యూఎస్‌ఎస్‌ కామ్‌స్టాక్‌ (ఎల్‌ఎస్‌డీ–45) యుద్ధ నౌకలో ఉన్న మరో ముఖ్య ఆయుధం. స్వీడన్‌ తయారుచేసిన ఈ రైఫిల్‌ను పట్టుకునేందుకు రెండు గ్రిప్‌ పాయింట్లు ఉన్నాయి. కదులుతున్న వాహనం నుంచి 350–400 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించవచ్చు. నిలబడిన సమయంలో మాత్రం 500 మీటర్ల దూరంలోని లక్ష్యంపై కూడా దాడి చేసే వీలుంటుంది. 8,200 అడుగుల దూరంలోని శత్రువుపై కూడా ఈ రైఫిల్‌లో లేజర్‌ గైడెడ్‌ మందుగుండును ఉపయోగించి మట్టుబెట్టొచ్చు. ఒకే వ్యక్తి   ఉపయోగించేందుకు వీలుగా కూడా తయారుచేశారు. ఫైర్‌ చేసే సమయంలో భుజంపై వెనక్కి తన్నే ఒత్తిడి తక్కువగా ఉండడం దీని ప్రత్యేకత.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement