వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో భారీగా వారసుల్లేని సొమ్ము
2005లో కోటి ఖాతాల్లో రూ.918 కోట్ల నగదు
2024 నాటికి 20 కోట్ల ఖాతాల్లో రూ.62,314 కోట్లు
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2005లో కోటి ఖాతాల్లో కేవలం రూ.918 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉండగా.. 2015 నుంచి ఆ విలువ భారీగా పెరిగినట్లుగా పేర్కొంది. 2024 నాటికి 20 కోట్ల ఖాతాల్లో రూ.62,314 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. క్లెయిమ్ చేయని మొత్తంలో 75 శాతం సేవింగ్స్ ఖాతాల్లోనివేనని, అందులో 82 శాతం వాటా పబ్లిక్ సరీ్వస్ సెక్టార్ బ్యాంకుల్లోనే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

క్లెయిమ్ చేయని డిపాజిట్ల ఖాతాలపై బ్యాంకులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ.. ఇంకా నగదు ఎక్కువగానే ఉంటోంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లను హక్కుదారులకు తిరిగి ఇవ్వడానికి కస్టమర్లకు చెందిన చట్టపరమైన వారసుల స్థానాన్ని కనుగొనేందుకు బ్యాంకులు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి. క్లెయిమ్స్ ఫిర్యాదులు త్వరగా పరిష్కారం, రికార్డుల నిర్వహణ, క్లెయిమ్ చేయని డిపాజిట్ ఖాతాల కాలానుగుణ సమీక్ష కోసం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాయి. న్యాయమైన హక్కుదారులకు సహాయం చేయడానికి, బ్యాంకులు లేఖలు, ఈ–మెయిళ్లు లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఖాతాదారులను సంప్రదించడంతో పాటు ఖాతా యాక్టివేషన్, క్లెయిమ్ ప్రక్రియపై సమాచారాన్ని అందించడం వంటి చర్యలు కూడా చేపడుతున్నాయి.


