
రాష్ట్రపతి ఉత్తర్వులు.. కేంద్రం నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు తుహిన్ కుమార్ పేరును సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసుకు రాష్ట్రపతి తాజాగా ఆమోదముద్ర వేశారు. తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ వచ్చే వారం ప్రమాణం చేసే అవకాశం ఉంది.
ఇదీ తుహిన్ నేపథ్యం..
తుహిన్ కుమార్‌ది పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామం. తల్లిదండ్రులు.. సరోజిని నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. కృష్ణా కాలేజీలో ఇంటర్, విశాఖ ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
2000–2004 మధ్య ఆయన హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా పనిచేశారు. 2010–14 మధ్య కాలంలో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2016–17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.