తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ  | Sakshi
Sakshi News home page

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ 

Published Tue, Nov 1 2022 6:00 AM

TTD Issuance of Sarvadarshan Tokens in Tirupati from November 1 - Sakshi

తిరుపతి అలిపిరి/తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైం స్లాట్‌ టోకెన్ల జారీ ప్రక్రియను పున:ప్రారంభించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో 15 వేలు చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్‌ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు.

ఆధార్‌ నంబరు నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్‌ పొందే అవకాశం ఉంటుందన్నారు. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్‌ లైన్‌ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని చెప్పారు. 

శ్రీవారి దర్శనానికి 15 గంటలు 
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు 31 నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,131 మంది స్వామి వారిని దర్శించుకోగా, 31,188 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.47 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.  

నేడు తిరుమలలో పుష్పయాగం 
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించనున్న పుష్పయాగానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య రుత్విక్‌వరణం (అర్చకులకు విధుల కేటాయింపు) నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులను ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, వీజివో బాలిరెడ్డి, పేష్కార్‌ శ్రీహరి  పాల్గొన్నారు.  

నేడు స్నపన తిరుమంజనం 
పుష్పయాగం సందర్భంగా మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవర్లకు  సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.  సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో  దర్శనమిస్తారు. పుష్పయాగం కారణంగా మంగళవారం పలు సేవలు రద్దుచేసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement