breaking news
pushpa yagam
-
శ్రీవారికి పుష్ప యాగం (ఫోటోలు)
-
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ
తిరుపతి అలిపిరి/తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పున:ప్రారంభించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో 15 వేలు చొప్పున టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఆధార్ నంబరు నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశం ఉంటుందన్నారు. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 31 నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,131 మంది స్వామి వారిని దర్శించుకోగా, 31,188 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.47 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో పుష్పయాగం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించనున్న పుష్పయాగానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో మూలవిరాట్ ఎదురుగా ఆచార్య రుత్విక్వరణం (అర్చకులకు విధుల కేటాయింపు) నిర్వహించారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులను ఆలయం నుంచి ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది వరకు ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ చేశారు. టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, వీజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు. నేడు స్నపన తిరుమంజనం పుష్పయాగం సందర్భంగా మంగళవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవర్లకు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమిస్తారు. పుష్పయాగం కారణంగా మంగళవారం పలు సేవలు రద్దుచేసింది. -
Tirumala: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...
ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవంగా ప్రఖ్యాతిపొందిన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండపై అన్ని విశేషాలే, అన్నీ ప్రత్యేకతలే. శ్రీవారి దర్శనార్థం ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. స్వామి వారికి హుండీ ద్వారా ఏటా లభించే ఆదాయం రూ.800 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక సేవ నిర్వహిస్తుంటారు. అలాగే, ప్రతివారం వారోత్సవాలు, ప్రతిమాసం మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యం టీటీడీ ఇస్తుంది. శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికీ లేవు. ఆ దేవదేవునికి ప్రతినిత్యం నిర్వహించే అలంకరణకు 1093 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా, స్వామి వారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏమీ ఉండదు. శ్రీవారికి ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు. భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడు వెలసిన వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం మరెక్కడా లేదు. శ్రీనివాసునికి సాటిరాగల దైవం ముల్లోకాలలో మరెక్కడా లేడు అని భక్తుల నమ్మకం. శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజూ అరవై వేలు మొదలుకొని లక్ష మంది వరకు భక్తులు తరలివస్తుంటారు. ఇక శ్రీవారికి 1958లో హుండీ ద్వారా లభించే ఆదాయం లక్ష రూపాయల వరకు ఉంటే ఇప్పుడు స్వామివారికి ప్రతి రోజూ లభించే హుండీ ఆదాయం రెండున్నర కోట్ల పైమాటే. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు అలిపిరి నుంచి స్వామి వారిని కొలుచుకుంటూ ఎంతో ప్రయాసతో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్న తరువాత వారి కష్టాలన్నీ ఒక్కసారిగా మరచిపోతారు. స్వర్ణ పుష్పాలంకరణలతో కూడిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతికి లోనవుతారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడట, ఎంతటి అలంకరణ ప్రియుడో అంతటి భక్తజనప్రియుడట! శ్రీవారి అలంకరణకు టీటీడీ అధిక ప్రాధ్యానం ఇస్తోంది. స్వామివారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవుడికీ, మరే ఆలయంలోనూ ఉండవు. శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తే, తిరిగి గురువారం ఉదయం సడలింపు చేస్తారు– అంటే అలంకరణలను తీసివేస్తారు. మరో వైపు పుష్పాలంకరణ మాత్రం శ్రీనివాసునికి ప్రతిరోజూ రెండుసార్లు నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తోమాలసేవలో స్వామి వారికి మూడువందల కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి అలంకరించే పుష్పాలను పూల అర అనబడే పుష్ప మండపంలో భద్రపరిచేవారు. అటు తరువాత రద్దీ పెరగడంతో ఈ కార్యక్రమాన్ని ఆలయం వెలుపలకు మార్చేశారు. శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లే చామంతి, లిల్లీ, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, తులసి, తామరలు, కలువలు, మల్లెలు, కనకాంబరాలు వంటి పన్నెండు రకాల పుష్పాలతో రూపొందించిన మాలలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరదరాజ స్వామి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలు అవసరమవుతాయి. తిరుమల కొండ మీద కేవలం ముప్పయి కిలోల పువ్వులే లభిస్తుంటే, మిగిలిన 270 కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయటి నుంచి తెప్పిస్తుంటారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడే ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు. ఇక సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో అలంకరిస్తారు. తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు. తర్వాత వక్షస్థల లక్ష్మీ మాలలను అలంకరిస్తారు. స్వామివారి వక్షస్థలంలో కొలువుండే శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. శంఖు చక్రాలకు ఒకొక్క మూర ఉండే రెండు దండలను అలంకరిస్తారు. ఇక స్వామివారి బొడ్డున ఉండే నందక ఖడ్గానికి కఠారి సరం అనే రెండు మూరల మాలను అలంకరిస్తారు. తావళాలు అనే హారాలను రెండు మోచేతుల కింద, నడుము నుంచి మోకాళ్లపైన, మోకాళ్ల నుంచి పాదాల వరకు వేలాడేలా మూడు దండలను అలంకరిస్తారు. వీటిలో ఒకటి మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు ఉంటాయి. చివరిగా ఒక్కొక్క మూర ఉండే తిరువడి దండలను శ్రీవారి పాదాల చుట్టూ అలంకరిస్తారు. ఇవి కాకుండా భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ, కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామికి మూడు దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి మూడు దండలు, సీతారామలక్ష్మణులకు మూడు దండలు, రుక్మిణీ శ్రీకృష్ణులకు రెండు దండలు, చక్రత్తాళ్వారుకు ఒక దండ, అనంత గరుడ విష్వక్సేనులకు మూడు దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు, ద్వార పాలకులకు రెండు దండలు, గరుడాళ్వర్, వరదరాజస్వామి, వకుళమాతలకు మూడు దండలు, రామానుజాచార్యులకు రెండు దండలు, యోగనరసింహస్వామి, విష్వక్సేనులతో, పోటు తాయారు, బేడి ఆంజనేయస్వామికి నాలుగు దండలు, వరాహస్వామి ఆలయానికి మూడు దండలతో ప్రతి నిత్యం అలంకరిస్తారు. ప్రతి గురువారం శ్రీవారికి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరణ చేస్తారు. పూలంగి సేవగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక శ్రీవారికి ప్రతినెలా నిర్వహించే ఉత్సవాలకు విశేష పుష్పాలంకరణలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. విశేష పర్వదినాలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆలయాన్ని మూడు నుంచి ఐదు టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు. వివిధ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం నుంచి ఆలయ ప్రాకారం వరకు అలంకరిస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తిథులలో మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారాన్ని రెండు టన్నుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా చేసే అలంకరణ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. తెలుగు వారి నూతన సంవత్సరాది రోజు అయిన ఉగాది పర్వదినాన కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తారు. సాధారణ రోజులలో అలంకరణకు ఉపయోగించే చామంతి, తులసి, లిల్లి, మరువం, గన్నేరు, రోజాలు, దవనం, మల్లెలు, కలువలు, తామరలు, కనకాంబరాలు వంటివే కాకుండా కురివేరు, వట్టివేరు, తీగ సెంటు జాజులు, కట్ రోజెస్ వంటి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉగాది రోజున ఐదు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీనివాసునికి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి మాసం ఏదో ఒక సేవ నిర్వహిస్తున్నా ప్రతి ఏటా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి అయ్యేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుకు అనుగుణంగానే పుష్పాలంకరణకు టీటీడీ అధిక ప్రాధాన్యమిస్తుంది. తొమ్మిది రోజులపాటు పద్నాలుగు రకాల వాహనాలపై స్వామివారు మాడ వీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉత్సవాలకు ముప్పయి టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తుంది. వివిధ పుష్పాలతో చేసే దేవతా మూర్తుల ఆకృతులను తిలకించే భక్తులకు తిరుమల క్షేత్రమే ఇలలో వెలసిన వైకుంఠంగా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే పుష్పయాగం న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. పది టన్నుల పద్దెనిమిది రకాల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు. తరువాత ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూలపల్లకిలో ఉరేగిస్తారు. మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది. ఇన్నిరకాల పూలతో అలంకరిస్తే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉంటుందా? దిష్టి తగిలితే తగులుతుందేమో నని, శ్రీవారికి అలా దిష్టి తగలకుండా ఉండటానికి అర్చకులు సన్నని వెంట్రుకలా ఉండే కురువేరు అనే వేరును ఉపయోగిస్తారు. ఈ కురువేర్లు తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయట! (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) స్వామివారి పుష్పాలంకరణల కోసం తమిళనాడులోని చెన్నై, సేలం, శ్రీరంగం, కోయంబత్తూరు, దిండిగల్, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి 60 శాతం పుష్పాలు విరాళాలుగా అందితే, మిగిలిన 40 శాతం పుష్పాలను కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతం నుంచి దాతలు విరాళాలుగా అందిస్తారు. ప్రత్యేక పర్వదినాలలో అలంకరించేందుకు ప్రత్యేక పుష్పాలను కూడా టీటీడీ... బెంగళూరు నుంచే తెప్పిస్తుంది. మన దేశం నుంచే కాకుండా సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ నుంచి కూడా భక్తులు స్వామి వారికి పుష్పాలను విరాళంగా అందిస్తున్నారు. శ్రీవారికి పుష్పాలు విరాళాలుగా అందించడానికి దాతలు ముందుకు వస్తే టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. మరోవైపు స్వామివారి పుష్ప కైంకర్యానికి వినియోగించే పుష్పాలను టీటీడీ ద్వారానే పండించేందుకు ఏర్పాట్లును మొదలు పెట్టింది. పలమనేరులో 750 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న గో సంరక్షణశాల ప్రాంతంలో 25 ఏకరాల స్థలాన్ని పూలతోటల కోసం టీటీడీ కేటాయిస్తోంది. (క్లిక్ చేయండి: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం) -
వైభవంగా పుష్పయాగం
-
వైభవంగా ప్రారంభమైన పుష్పయాగం
తిరుమల : అంతర్గత భద్రత, ప్రకృతి వైపరీత్యాల నివారణ, రాజ్యం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో పుష్పప్రియుడైన శ్రీ వేంకటేశుడికి ఏటా చేసే పుష్పయాగం శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 8 టనుల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ పుష్పయాగానికి నిన్ననే అంకురార్పణ జరిగింది. శుక్రవారం మధ్యహ్నాం ఒంటిగంటకు ప్రారంభమైన పుష్పయాగం సాయంత్రం అయిదు గంటల వరకూ కొనసాగనుంది. పుష్పయాగం కోసం ఎనిమిది టన్నుల మేర 20 రకాలకుపైగా పుష్పాలను టీటీడీ సిద్ధం చేసింది. మరోవైపు పుష్పయాగం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ వేకువ జాము రెండు గంటలకు, అభిషేక సేవను మూడు గంటలకు నిర్వహించారు. 5వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ఏడో రోజున స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఈ పుష్పయాగాన్ని 1980 నవంబర్ 14న తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించింది. -
పుష్పయాగానికి అంకురార్పణ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామికి పుష్పయాగం చేసేందుకు గురువారం అంకురార్పణ చేశారు. ఆలయం నుంచి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయానికి నైరుతి దిశలోని వసంత మండపానికి తీసుకెళ్లి పుట్టమన్ను సేకరించి ఆలయానికి తీసుకొచ్చి అంకురార్పణ పూజలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనానికి 9 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 32,983 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 9 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటలు శ్రీవారి దర్శనం లభిస్తోంది. గురువారం హుండీ ద్వారా శ్రీవారికి రూ.1.95 కోట్ల ఆదాయం లభించింది. 4న కైశిక ద్వాదశి ఆస్థానం కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా నవంబర్ 4న తిరుమల ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. స్థితికారుడైన మహావిష్ణువును మేల్కొలిపే పర్వదినంగా భావించే దీన్ని ప్రభోదోత్సవం, ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. ఆషాడ శుక్ల ఏకాదశి నాడు గాఢనిద్రలోకి వెళ్లిన మహా విష్ణువు కైశిక ద్వాదశి రోజు మేల్కొంటారని భక్తుల నమ్మకం. శ్రీవారికి అజ్ఞాత భక్తుడి రూ.1.15 కోట్ల విరాళం తిరుమల శ్రీవారికి గురువారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.15 కోట్లు విరాళం ఇచ్చారు. తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త టీటీడీ ప్రాణదాన ట్రస్టు కోసం రూ.1 కోటి, ఆరోగ్య వరప్రసాద ట్రస్టు కోసం రూ.15 లక్షలు ఇచ్చారు. ఈ విరాళాలను దాతల విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రుడికి డీడీల రూపంలో అందజేశారు. శ్రీవారికి 5 కిలోల వెండి పాదుకలు కానుక తిరుమల శ్రీవారికి ఐదు కిలోల వెండి పాదుకలు సమర్పించినట్టు గురువారం అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. మునిమనుమరాలికి పుట్టు వెంట్రుకలు చెల్లించి కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుండెజబ్బు మరణాలు తగ్గిం చేందుకు అపోలో ఆస్పత్రులు కృషి చేస్తున్నాయన్నారు. త్వరలో నెల్లూరులో భారీ ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. -
తిరుమలలో నేడు పుష్పయాగం, ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. స్వామి దర్శనానికి భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి ఆరు గంటలు, నడక దారిన వెళ్లే భక్తులకు నాలుగు సమయం పడుతుంది. కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పది కంపార్ట్మెంట్లు నిండాయి. కాగా నేడు స్వామివారికి పుష్పయాగం కారణంగా ఆర్జిత సేవలన్నిటీనీ టీటీడీ రద్దు చేసింది. స్వామివారికి గురువారం ప్రత్యేక సేవ- తిరుప్పావై.